భారత డిఫ్యాక్టో ప్రధానిగా వ్యవహరిస్తున్న ట్రంప్ : సీపీఐ నేతలు నారాయణ, కూనంనేని
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఈ దేశానికి ప్రమాదకరం ఉగ్రవాదులా?, మావోయిస్టులా? అని కేంద్ర ప్రభుత్వాన్ని సీపీఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ, రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. మావోయిస్టులపై ఉన్న ద్వేషం ఉగ్రవాదులపై లేనట్టు ఉందని చెప్పారు. అందుకే మావోయిస్టులతో చర్చలపై కేంద్రం స్పందించలేదన్నారు. భారత్‌కు అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ డిప్యాక్టో ప్రధానిగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోడీ డమ్మీగా మారిపోయారని అన్నారు. హైదరాబాద్‌లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయం మఖ్దూంభవన్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశాన్ని నిర్వహించారు. ట్రంప్ ఆదేశాలను మోడీ పాటిస్తుండడం భారత్‌కే అవమానకరమని అన్నారు. భారత ఆర్థిక వ్యవస్థను ట్రంప్ శాసించే ప్రయత్నం చేస్తున్న మోడీ అడ్డుకోకుండా మౌనం వహించడం సిగ్గుచేటన్నారు. భారత ప్రధాని మోడీయా లేక ట్రంపా అనేది ప్రజలు చర్చించుకుంటున్నారని విమర్శించారు. ఉగ్రవాదులు బహిరంగంగా తిరుగుతుంటే నిఘావర్గాలు ఏం చేస్తున్నాయని ప్రశ్నించారు. ఉగ్రవాదులను ఏరివేసేందుకు కేంద్రం చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌కు అన్ని పార్టీలూ మద్దతు ప్రకటించాయని గుర్తు చేశారు. కానీ ప్రధాని మోడీ ఉగ్రవాదులను అడ్డం పెట్టుకుని సొంత రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. రాజకీయ పార్టీలను కాదని దౌత్య ప్రతినిధుల బృందాన్ని ఎంపిక చేసే అధికారం మోడీకి ఎవరిచ్చారని ప్రశ్నించారు. ఇది ప్రజాస్వామ్య విరుద్ధమని అన్నారు. తల్లిదండ్రులు కష్టపడి భవిష్యత్ కోసం పిల్లలను విదేశాలకు పంపిస్తే వారు పంపించే డబ్బుపైనా ఐదు శాతం పన్ను విధించడం సరైంది కాదన్నారు. సాప్ట్‌వేర్ రంగం అభివృద్ది అంతా చంద్రబాబు హయాంలో జరిగిందంటూ గొప్పలు చెప్తారనీ, ఈ దేశ పౌరులకు అన్యాయం జరుగుతుంటే ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. సైనికులను అవమానించిన బీజేపీ మంత్రిని తక్షణమే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ నగరం ఇప్పుడు అందాల భామల చుట్టూ తిరుగుతోందన్నారు. వారి వెనుక మంత్రులు, అధికారులు తిరగడం సిగ్గుచేటన్నారు.
కొత్త పథకాల అమలుకు నిధులెక్కడివి? : కూనంనేని
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలుపై స్పష్టతనివ్వాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. పాత పథకాల అమలు పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. కొత్త పథకాల అమలు కోసం నిధులెక్కడివని అడిగారు. పాత పథకాలను అరకొరగా అమలు చేయడంతో ప్రజల్లో గందరగోళ పరిస్థితి ఏర్పడుతోందన్నారు. బీఆర్‌ఎస్ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందని చెప్పారు. ఆపరేషన్ కగార్ పేరుతో ఎంతమంది మావోయిస్టులను చంపేశారు, కేంద్ర ప్రభుత్వం లక్ష్యమేంటో శ్వేతప్రతం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర బలగాలతో కలిసి రాష్ట్ర పోలీసులు సైతం ఇందులో పాల్గొంటున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సైతం తన విధానాన్ని ప్రకటించాలని కోరారు. ఉగ్రవాదులతో దౌత్యపరంగా చర్చలు జరుపుతామని ప్రకటించిన కేంద్రం, మావోయిస్టులతో శాంతి చర్చలకు ఎందుకు ముందుకు రావడం ప్రశ్నించారు. ఇప్పటికే అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిన కేంద్రం ఇప్పుడు న్యాయ వ్యవస్థపైనా మాటల దాడి కొనసాగిస్తున్నదని విమర్శించారు. రాజ్యాంగబద్ధ వ్యవస్థల మధ్య హక్కులు, న్యాయపరమైన చిక్కులు తలెత్తినప్పుడు వాటిలో కలుగజేసుకుని వాటిని పరిష్కరించే అధికారం సుప్రీంకోర్టుకు ఉందన్నారు. ఇదే లేకపోతే పాలకుల ఆగడాలకు అడ్డుకట్ట అనేది ఉండబోదని అన్నారు. సుప్రీంకోర్టును రాష్ట్రపతి సైతం తప్పు పట్టడం ఏంటని ప్రశ్నించారు. ఆంధ్ర తొలి సీఎం టంగూటూరి ప్రకాశం పంతులు విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ద్వారా ఆయనకు సముచిత గౌరవం కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు. కమ్యూనిస్టు దిగ్గజం, మాజీ ఎంపీ ధర్మబిక్షం పేరును సూర్యాపేట జిల్లాకు పెట్టాలని సీఎంను కోరారు.
దేశానికి ప్రమాదం ఉగ్రవాదులా? మావోయిస్టులా?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES