Wednesday, October 1, 2025
E-PAPER
Homeఎడిట్ పేజిసంక్షేమ విద్యార్థుల సమస్యలు పట్టవా?

సంక్షేమ విద్యార్థుల సమస్యలు పట్టవా?

- Advertisement -

పేరు గొప్ప..ఊరు దిబ్బ అన్న చందంగా ఉంది సర్కారు వ్యవహరిస్తున్న తీరు. సంక్షేమ హాస్టల్స్‌ విద్యార్థులు అర్థాకలితో ఉంటున్నారని, వారికి మెనూ పెంచి నాణ్యమైన భోజనం అందిస్తామని చెప్పిన పాలకులు దాని అమలుకు పూనుకోవడం లేదు. ఇటీవల కాలంలో వసతిగృహాల్లో ఫుడ్‌ పాయిజన్‌ జరిగి రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది విద్యా ర్థులు చనిపోయారు. ఇంకా అనేకమంది ఆస్పత్రుల పాల య్యారు. దీంతో ప్రభుత్వం స్పందించి డైట్‌ చార్జీలు పెంచి నాణ్యమైన పోషకాహారం అందిస్తామని హామీ నిచ్చింది. ఇక హాస్టల్స్‌లో ఫుడ్‌ పాయిజన్‌ అనేది లేకుండా చేస్తామని గొప్పలకు పోయింది.తీరా చూస్తే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉన్నది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సంక్షేమ వసతి గృహాల్లో 7,65,705 మంది విద్యార్థులు నివాసం ఉంటున్నారు. పదినెలల క్రితం డైట్‌చార్జీలు పెంచేందుకు అప్పటి బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి, ప్రస్తుత టీజీపీఎస్సీ చైర్మన్‌ బుర్ర వెంకటేశం ఆధ్వర్యంలో వేసిన ఉన్నతాధికారుల కమిటీ ప్రతిపాదనల మేరకు డైట్‌ చార్జీలు నలభైశాతం పెంచింది.

ఉన్నతాధికారుల కమిటీ జాతీయ పోషకాహార సంస్థ (ఎన్‌ఐఎన్‌) సూచనలను పరిగణలోకి తీసుకుని, చివరిసారిగా 2017లో మెస్‌ చార్జీలు పెంచినప్పుడు నిత్యావసరాల ధరలు, ప్రస్తుతం రెండురెట్లు పెరిగిన ధరలను బేరీజు వేసుకొని, సుమారు 22 రకాల నిత్యవసరాల ధరలను అధ్యయనం చేసింది. పలు సూచనలతో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేందుకు డైట్‌ చార్జీలు పెంచాలని, వ్యక్తిగత ఆరోగ్య సంరక్షణకు 200శాతం కాస్మోటిక్‌ ఛార్జీలు పెెంచివ్వాలని ఉన్నతాధికారుల కమిటీ ప్రభుత్వం ఎదుట పలు ప్రతిపాదనలతో కూడిన రిపోర్ట్‌ను అందించింది. ఉన్నతాధికారుల కమిటీ మెస్‌, కాస్మోటిక్‌ చార్జీలు పెంచాలని సూచన చేస్తూనే, ప్రతినెలా వసతిగహాలకు గ్రీన్‌ఛానల్‌ ద్వారా డైట్‌ బిల్లులు చెల్లించాలని ఉన్నతాధికారుల కమిటీ కోరింది. అప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఫుడ్‌పాయిజన్‌ ఘటనల్లో భాగంగా కొమరం భీమ్‌ ఆసిఫాబాద్‌లో విద్యార్థిని మరణించాడు.

దీంతో ప్రభుత్వంపై వస్తున్న వ్యతిరేకతను దారి మళ్లించడం కోసం డైట్‌ చార్జీలు పెంచుతూ ప్రభుత్వం గెజిట్‌ విడుదల చేసినట్టు తెలుస్తోంది. లేదంటే ఇంతవరకు ఆచరణకు ఎందుకు దిగలేదు? ప్రతినెలా డైట్‌చార్జీలు చెల్లించకుండా, విద్యార్థులకు పెంచిన డైట్‌చార్జీలతో డైట్‌ అందించడం సాధ్యపడదు. గతం కంటే నేడు పెరిగిన చార్జీలతో విద్యార్థులకు డైట్‌ అందిస్తున్న కారణంగా సంక్షేమ వసతి గహాధికారులకూ డైట్‌చార్జీలు సకాలంలో చెల్లించకపోవడంతో అదనపు భారంగా మారింది. ఫైనాన్షియర్స్‌ల దగ్గర వడ్డీలు, ఇఎంఐలతో పర్సనల్‌ లోన్లు తీసుకుని రెగ్యులర్‌ మెనూ ప్రకారం భోజనం అందించాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇంకా రాష్ట్రంలో సుమారు 2300 ఎస్సీ,ఎస్టీ, బీసీ వసతి గహాలు, 400కు పైగా గురుకులాలు అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నారు. ప్రయివేటు బిల్డింగ్‌ ఓనర్లకు కిరాయిలు చెల్లించకపోగా బిల్డింగులకు తాళాలు వేసిన సందర్భాలు లేకపోలేదు.

బిల్డింగులు ఖాళీ చేసి వెళ్లిపోవాలని ఓనర్లు తగువుకు దిగుతున్న ఘటనలు చూస్తున్నాం. కనీసం కరెంట్‌ బిల్లులు చెల్లించకపోయినా డిస్కంలు నిరంతరాయంగా పవర్‌ సప్లరు చేస్తున్నాయి. సంక్షేమ వసతి గృహాలకు, గురుకులాలకు నిత్యావసర వస్తువులు, కూరగాయలు, పాలు, కోడిగుడ్లు,చికెన్‌, అరటిపండ్లు అందించే టెండరుదారులు తమ బిల్లులు చెల్లించకపోవడంతో చేతులెత్తేశారు. కొన్నిచోట్ల పదిహేను రోజులకు సరిపడా ఒకేసారి కూరగాయలు వేస్తే మురిగిన సందర్భాలూ లేకపోలేదు. ప్రభుత్వం ఇటు టెండర్‌ దారులకు, బిల్డింగ్‌ ఓనర్లకు బిల్లులు చెల్లించకపోవడంతో గృహాల అధికారులు, గురుకుల పాఠశాలల ప్రధానోపాధ్యాయులపైన వారు తీవ్రఒత్తిడి తీసుకొస్తున్నారు.

ఇవన్నీ కూడా సంక్షేమ హాస్టల్స్‌ దయనీయ పరిస్థితిని తెలుపుతున్నది. దీంతో ప్రతియేటా వసతి పొందే విద్యార్థుల సంఖ్య తగ్గిపోతోంది. నాణ్యతలేని భోజనం, అపరిశుభ్ర పరిసరాలు, వరుస ఫుడ్‌ పాయిజన్‌ ఘటనలు, అధికారుల నిర్లక్ష్యం, చాలీచాలని తిండి కారణంగా తల్లిదండ్రులు విసుగెత్తి విద్యార్థులను ఇండ్లకు తీసుకెళ్తున్నారు. వసతి గృహాల్లో, గురుకులాల్లో ప్రతి యేటా నిర్వహణ కోసం కేటాయించే బడ్జెట్‌ కూడా ఇవ్వకపోవడంతో శానిటేషన్‌ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పాత బిల్డింగులు శిథిలావస్థకు చేరడంతో పెచ్చు లూడి పడుతున్నాయి. వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం తక్షణమే స్పందించి వసతి గృహాలపై దృష్టి సారించి తగు సదుపాయాలు కల్పించాలి. ఇచ్చిన హామీల మేరకు వాటి అభివృద్ధికి సహకరించాలి. అలాగే విద్యార్థులకు, తల్లిదండ్రులకు హాస్టల్స్‌పై నమ్మకం సన్నగిల్లకుండా చూడాలి. లేదంటే రానున్న రోజుల్లో వసతి గృహాలు మూతపడే పరిస్థితి దాపురిస్తుంది. అలా జరగకుండా ఉండాలంటే భావిభారత విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వారి అవసరాలకు సరిపడా నిధుల్ని బడ్జెట్‌లో కేటాయించి విడుదల చేయాలి.

బి.వీరభద్రం
9492930835

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -