Sunday, December 21, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంకార్పొరేట్‌ సంస్థలకు బొగ్గుబావులా?

కార్పొరేట్‌ సంస్థలకు బొగ్గుబావులా?

- Advertisement -

వాటిని సింగరేణికి కేటాయించాలి : సీఐటీయూ

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
కేంద్ర ప్రభుత్వం బోగ్గుబావులను కార్పొరేట్‌ సంస్థలకు అప్పజెప్పాలనే ఆలోచన విరమించుకోవాలనీ, వాటిని సింగరేణికే కేటాయించాలని సీఐటీయూ రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేసింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చుక్క రాములు, పాలడుగు భాస్కర్‌ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రయివేటీకరణ విధానంలో భాగంగా బొగ్గుబావులను వేలంపాట ద్వారా కేంద్రం కార్పొరేట్‌ సంస్థలకు కట్టబెడుతున్నదని ఆందోళన వ్యక్తంచేశారు. కోల్‌ ఇండియా, సింగరేణిలోని బొగ్గు బావులను టెండర్ల ద్వారా కేటాయించాలని నిర్ణయించిందని గుర్తుచేశారు. వేలంపాటలో పాల్గొంటేనే గనులు కేటాయిస్తామని చెబుతోందనీ, ఈ విధానాన్ని సీఐటీయూ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నదని తెలిపారు. టెండర్లను రద్దు చేసి సింగరేణికి నేరుగా బొగ్గు బావులు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. ప్రయివేటీకరణలో భాగమే ఈ టెండర్లనీ, వాటికి వ్యతిరేకంగా సింగరేణి కార్మికులు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.

ఇప్పటికే బొగ్గురంగంలో ప్రయివేటీకరణ యధేచ్చగా అమలవుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో కోయగూడెం ఓసీ బ్లాకును అరబిందోకు కేటాయించి మూడేండ్లయినా పని చేపట్టలేదని పేర్కొన్నారు. సత్తుపల్లి ఓసీని అవంతిక కాంట్రాక్టర్‌కు అప్పగించారనీ, రెండేండ్లయినా పని ప్రారంభం చేయలేదని తెలిపారు. వీటిని రద్దు చేసి సింగరేణికి కేటాయించాలని డిమాండ్‌ చేశారు. ప్రస్తుతం మణుగూరు ఓసీ3 ఎక్స్‌టెన్షన్‌ బ్లాకును టెండర్‌లో పెట్టారని పేర్కొన్నారు. ఇది ప్రయివేటుకు వెళ్ళే ప్రమాదముందని తెలిపారు. ఇల్లందు, కొత్తగూడెం ఓపెన్‌ కాస్ట్లు కూడా గతంలో ప్రయివేట్‌ వారికి ఇవ్వడంతో ఆయా ఏరియాల్లో రానున్న కొద్దికాలంలో బొగ్గు బావులు మూతపడే ప్రమాదం ఉందని ఆరోపించారు. వీటన్నింటినీ పరిశీలిస్తే టెండర్ల విధానం వల్ల సింగరేణికి నష్టం జరిగిందని తెలిపారు. అంతిమంగా ప్రయివేటీకరణకు దారి తీస్తున్నదని తెలిపారు. రాష్ట్రంలోని బొగ్గు నిల్వలన్నీ గుర్తించి, వాటిని సింగరేణి హక్కుగా గుర్తించాలని డిమాండ్‌ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -