Thursday, December 25, 2025
E-PAPER
Homeఖమ్మంఅవి పోలీస్ స్టేషన్లా .? కాంగ్రెస్ కార్యాలయాలా ?

అవి పోలీస్ స్టేషన్లా .? కాంగ్రెస్ కార్యాలయాలా ?

- Advertisement -

డిప్యూటీ సీఎం మధిర నియోజకవర్గంలో ఘటన 
కాంగ్రెస్ ఎవరిపై దాడులు చేసినా కేసులు నమోదు చేయటం లేదు 
ఆళ్లపాడు సంఘటనపై పోలీసుల తీరు ప్రమాదకరం
సీపీఐ(ఎం) మాజీ రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు 
ఆళ్లపాడు సర్పంచ్ తెల్లబోయిన నాగేశ్వరరావు
నవతెలంగాణ – బోనకల్ 

ఖమ్మం జిల్లా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర నియోజకవర్గంలో పోలీస్ స్టేషన్లను పోలీసులు కాంగ్రెస్ కార్యాలయాలుగా మార్చి ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి రాత్రి సమయంలో కూడా లాకప్ లో అక్రమంగా నిర్బంధిస్తున్నారని సీపీఐ(ఎం) మాజీ రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు ఆళ్లపాడు బీఆర్ఎస్ సర్పంచ్ తెల్లబోయిన నాగేశ్వరరావు ఆరోపించారు. స్థానిక వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమరవీరుల భవనంలో బుధవారం సీపీఐ(ఎం), బిఆర్ఎస్ ఉమ్మడిగా విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ విలేకరుల సమావేశంలో పొన్నం వెంకటేశ్వరరావు, తెల్లబోయిన నాగేశ్వరరావు, పారా ప్రసాద్, గద్దల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ఆళ్లపాడు గ్రామంలో సీపీఐ(ఎం), బీఆర్ఎస్ ఈనెల 22వ తేదీన విజయోత్సవ ర్యాలీ నిర్వహించింది అన్నారు.

అయితే మరుసటి రోజు  23వ తేదీన కాంగ్రెస్ కు చెందిన మల్లాది లింగయ్య, మల్లాది ఉపేందర్ తదితరులు సీపీఐ(ఎం), బీఆర్ఎస్ నాయకుల ఇల్ల మీదకు వచ్చి దాడి చేసి కొట్టారని తెలిపారు. ఈ దాడిలో చెన్నకేశి వేణు తల పగిలి మూడు కుట్లు పడ్డాయన్నారు. పదిలం ఉదయ్ కిరణ్ భార్య ప్రమీలపై దాడి చేసి విచక్షణారహితంగా బట్టలు చింపి వేశారన్నారు. పదిలం ఉదయ్ కిరణ్ పై దాడి చేశారన్నారు. దీంతో పదిలం ఉదయ్ కిరణ్ అదే రోజు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే పోలీసులు ఏమాత్రం పట్టించుకోలేదని, కనీసం కేసు కూడా నమోదు చేయలేదని తెలిపారు. ఈ క్రమంలో 24న ఉదయం బలగాని నాగరాజు తన మోటార్ సైకిల్ పై గ్రామములో నుంచి ఇంటికి వెళుతుండగా కాంగ్రెస్ కు చెందిన మరీదు రామారావు, మరీదు బరకయ్య సోలార్ విషయంపై మాట్లాడుతుండగా నాగరాజు వారికి సమాధానం చెబుతుండగా అక్కడే ఉన్న కాంగ్రెస్ కు చెందిన కందుల పాపారావు ఆవేశంతో అక్కడకు వచ్చి నీవేందిరా చెప్పేది అంటూ బలగాని నాగరాజుపై దాడి చేశారని తెలిపారు.

నాగరాజు పై కందుల పాపారావు దాడి చేస్తుండగా అక్కడే ఉన్న బండి నాగేశ్వరరావు అడ్డుకున్నాడని తెలిపారు. అయినా కందుల పాపారావు ఆగకుండా నాగరాజు పై దాడి చేస్తుండగా బండి నాగేశ్వరరావు ఆగమంటూ కందులు పాపారావుని నెట్టాడని, దీంతో పాపారావు కింద పడ్డాడని తెలిపారు. ఆ వెంటనే అదే రోజు బలగాని నాగరాజు వచ్చి స్థానిక పోలీస్ స్టేషన్ లో తనను కందుల పాపారావు కొట్టాడని ఫిర్యాదు చేశాడని తెలిపారు. కానీ పోలీసులు కేసు నమోదు చేయలేదన్నారు. అయితే అదే రోజు రాత్రి కందుల పాపారావు వచ్చి ఫిర్యాదు చేస్తే నాగరాజుపై వెంటనే అక్రమ కేసు నమోదు చేశారని వారు తెలిపారు.

నాగరాజుని అదే రోజు పోలీసుల బలవంతంగా పట్టకొచ్చి లాకప్ లో రాత్రంతా అక్రమంగా నిర్బంధించారని తెలిపారు. చెన్నకేశి వేణుని దాడి చేసి తల పగలగడితే ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేయలేదు, బలగాని నాగరాజును కొడితే ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేయలేదని, అదే కాంగ్రెస్ కు చెందిన కందుల పాపారావు ఫిర్యాదు చేస్తే వెంటనే కేసు నమోదు చేసి ఎటువంటి విచారణ చేయకుండానే కేసు నమోదు చేశారని తెలిపారు. పూర్తి పక్షపాతంగా పోలీసుల వ్యవహరిస్తున్నారని తెలిపారు. అవి పోలీస్ స్టేషన్ల లేక కాంగ్రెస్ కార్యాలయాల పోలీసులు సమాధానం చెప్పాలని వారి డిమాండ్ చేశారు.

ఇది ఇలా ఉండగా కాంగ్రెస్ కు చెందిన కందుల పాపారావు బాగా దెబ్బలు తగిలాయి అంటూ 108 లో ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్తుండగా పాపారావు మాత్రం దర్జాగా సెల్ ఫోన్ చూసుకుంటూ ఉన్నాడని వారు తెలిపారు. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం రాత్రి సమయంలో ఎవరిని పోలీస్ స్టేషన్ లో ఉంచకూడదని నిబంధనలు ఉన్నప్పటికీ అధికార పార్టీ నాయకుల ఒత్తిడితో పోలీసులు అక్రమంగా బలగాని నాగరాజుని తెల్లవారులు లాకప్ లో బంధించారని తెలిపారు.

కనీసం పోలీస్ అధికారులు అతనితో మాట్లాడటానికి కూడా అవకాశం ఇవ్వటం లేదని, ఇదేనా న్యాయం చట్టం అంటూ వారి ప్రశ్నించారు. పోలీసుల వైఖరి మారకపోతే ప్రజా పోరాటాలు తప్పవని వారు హెచ్చరించారు. విలేకరుల సమావేశంలో సీపీఐ(ఎం) జిల్లా సీనియర్ నాయకులు చింతలచెరువు కోటేశ్వరరావు జిల్లా కమిటీ సభ్యులు దొండపాటి నాగేశ్వరరావు మండల కార్యదర్శి కిలారు సురేష్, ఆళ్లపాడు మాజీ సర్పంచ్ మర్రి తిరుపతిరావు, దొంతుబోయిన భూషయ్య, బండి పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -