శక్తివంతమైన క్షిపణులు, వార్‌హెడ్లను ప్రయోగిస్తాం
హర్మూజ్ నుంచి లీటరు చమురును కూడా సరఫరా కానివ్వం : అమెరికాకు ఇరాన్ హెచ్చరిక
ఇజ్రాయిల్, గల్ఫ్ , అరబ్ దేశాలపై దాడులు ఉధృతం
మధ్యప్రాచ్యంలో యుద్ధం దాదాపుగా ముగింపు దశకు వచ్చిందని, తాము విజయ తీరాలను చేరుకుంటున్నామని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేస్తున్న ప్రకటనలను ఇరాన్ తోసిపుచ్చింది. ఇరాన్ క్షిపణి కార్యక్రమాన్ని ధ్వంసం చేశామంటూ ట్రంప్ చేస్తున్న వాదనలను కూడా తిప్పికొట్టింది. అనేక శక్తివంతమైన క్షిపణులను మోహరిస్తున్నామని, టన్నుకుపైగా బరువున్న వార్‌హెడ్లను రంగంలోకి దింపుతున్నామని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ) తెలిపింది. ఇదిలావుండగా హర్మూజ్ జలసంధిలో చమురు నౌకలను ఇరాన్ అడ్డుకున్న పక్షంలో ఆ దేశంపై ఇరవై రెట్లు అధికంగా విరుచుకుపడతామని ట్రంప్ చేసిన హెచ్చరికపై టెహ్రాన్ స్పందించింది. దాడులు ఇలాగే కొనసాగితే మధ్యప్రాచ్యం నుంచి కనీసం ఒక లీటరు చమురును కూడా సరఫరా కానివ్వబోమని తేల్చి చెప్పింది.
నవతెలంగాణ – సెంట్రల్ డెస్క్
ఇరాన్‌పై ఇజ్రాయిల్, అమెరికా యుద్ధం మొదలై 12 రోజులైంది. ఇరాన్ ప్రతి దాడులతో పశ్చిమాసియాలో అమెరికా మిత్ర దేశాలకు ముచ్చెమటలు పట్టిస్తోంది. ఇజ్రాయిల్, యూఏఈ, సౌదీ అరేబియా, కువైట్ సహా అమెరికాకు వత్తాసు పలుకుతున్న గల్ఫ్ అరబ్ దేశాలపై ఇరాన్ దాడులు మంగళవారం కూడా కొనసాగాయి. హఫియాలోని ఇజ్రాయిల్ చమురు-గ్యాస్ రిఫైనరీని, ఇంధన ట్యాంకులను లక్ష్యంగా చేసుకొని ఇరాన్ డ్రోన్ దాడి జరిపింది. బహ్రెయిన్, సౌదీ అరేబియాలలోని చమురు క్షేత్రాలు, ఇంధన మౌలిక సదుపాయాలపై డ్రోన్, క్షిపణి దాడులు జరిగాయి. అమెరికాతో చర్చలు జరిపే విషయం తమ ఎజెండాలోనే లేదని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ స్పష్టం చేశారు. అవసరమైనంత కాలం యుద్ధాన్ని కొనసాగిస్తామని చెప్పారు. అమెరికా, ఇజ్రాయిల్ సేనల యుద్ధోన్మాదానికి ఇప్పటి వరకూ 193 మంది చిన్నారులు బలయ్యారని ఇరాన్ ప్రభుత్వ ప్రతినిధి తెలిపారు. వీరిలో ఎనిమిది నెలల వయసున్న బాలిక కూడా ఉంది. అమెరికా దాడిలో 11 మంది ఆరోగ్య కార్యకర్తలు కూడా చనిపోయారు.
52 ఆరోగ్య సేవల యూనిట్లు, 29 వైద్య కేంద్రాలు, 19 అత్యవసర యూనిట్లు, 16 అంబులెన్సులపై దాడి జరిగింది. ఇరాన్‌లోని లోరెస్టన్ రాష్ట్రంలో అమెరికా, ఇజ్రాయిల్ సేనలు జరిపిన దాడులలో నలుగురు విద్యార్థులు మరణించారు. రాష్ట్రంలోని 52 పాఠశాలలు దెబ్బతిన్నాయి. కేవలం కాల్పుల విరమణ పాటిస్తే సరిపోదని, దాడులు పూర్తిగా నిలిపివేసి వాటిని పునరావృతం చేయబోమని హామీ ఇస్తేనే దౌత్య యత్నాలకు అంగీకరిస్తామని ఇరాన్ ప్రభుత్వ ప్రతినిధి స్పష్టం చేశారు. ఇరాన్‌లో నివసిస్తున్న వేలాది మంది ఆఫ్ఘన్లు అమెరికా, ఇజ్రాయిల్ సేనల దాడుల కారణంగా ప్రతి రోజూ సరిహద్దును దాటి స్వదేశానికి చేరుకుంటున్నారని ఐరాస శరణార్థి సంస్థ తెలిపింది. ఇరాక్‌లోని కుర్దిస్థాన్ ప్రాంతంలో ఉన్న అమెరికా స్థావరంపై దాడి చేసినట్లు ఐఆర్‌జీసీ తెలిపింది. ఇరాన్‌పై దాడులకు తమ స్థావరాలను ఉపయోగించుకోవద్దని ఇరాక్ ప్రధాని మహమ్మద్ అల్-సుదానీ అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియోకు తేల్చి చెప్పారు. కాగా ఇరాన్ వైపు నుంచి క్షిపణులు దూసు కొస్తుండడంతో జెరుసలేంలో సైరన్లు మోగించి ప్రజలను అప్రమత్తం చేశారు.
టెహ్రాన్‌పై భీకర వైమానిక దాడులు
ఇరాన్‌పై సాగిస్తున్న యుద్ధం త్వరలోనే ముగింపునకు చేరుకుంటుందని ట్రంప్ అంటున్నప్పటికీ దాడులు ఎప్పుడు ఆగిపోతాయో ఆయన చెప్పడం లేదు. అటు ఇజ్రాయిల్, అమెరికా సేనలు టెహ్రాన్‌పై ఉధృతంగా దాడి చేస్తూనే ఉన్నాయి. నగరంలో ఇరవైకిపైగా పేలుడు శబ్దాలు వినిపించాయి. గత నెల 28న యుద్ధం ప్రారంభమైన తర్వాత ఇంత పెద్ద ఎత్తున టెహ్రాన్‌పై వైమానిక దాడులు జరగడం ఇదే మొదటిసారి. ఇప్పటి వరకూ ఇరాన్‌పై అసలైన పోరు జరగలేదని ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ హెచ్చరించారు. ఇరాన్‌లోని మినాబ్‌లో అమెరికా ప్రయోగించిన తోమహాక్ క్రూయిజ్ క్షిపణి ఓ నిర్మాణంపై పడింది. అందులోనే పాఠశాల, క్లినిక్ ఉన్నాయని తెలుస్తోంది. పాఠశాలపై జరిపిన దాడిలో అనేక మంది చనిపోయారని ఇరాన్ తెలిపింది. టర్కీ గగనతలం పైకి ఇరాన్ రెండోసారి బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించడంతో అక్కడి ప్రభుత్వం రక్షణ వ్యవస్థను మోహరించింది. ఇరాన్ నుంచి జరిగిన డ్రోన్, క్షిపణి దాడిని తిప్పికొట్టామని యూఏఈ తెలియజేసింది.
చమురు మార్కెట్లపై ప్రభావం
ఇరాన్ యుద్ధం కొనసాగి, హర్మూజ్ జలసంధిలో చమురు నౌకల ప్రయాణం నిలిచిపోతే ప్రపంచ చమురు మార్కెట్లపై తీవ్ర ప్రభావం పడుతుందని సౌదీ అరేబియాకు చెందిన ఆరామ్కో హెచ్చరించింది. ఈ సంస్థ ప్రపంచంలోనే అధిక పరిమాణంలో చమురును ఎగుమతి చేస్తోంది.
పుతిన్‌కు ట్రంప్ ఫోన్
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు డోనాల్డ్ ట్రంప్ ఫోన్ చేశారు. ఇరాన్‌పై యుద్ధం, ఉక్రెయిన్‌లో శాంతి స్థాపనకు అవకాశాలపై ఆయనతో చర్చించారు. ప్రస్తుతం నెలకొన్న ఇంధన సంక్షోభం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తుందని పుతిన్ చేసిన హెచ్చరిక నేపథ్యంలో ఈ టెలిఫోన్ సంభాషణ జరిగింది. ఇరాన్‌పై యుద్ధం ముగింపు, ఉక్రెయిన్‌లో సైనిక పరిష్కారం, ప్రపంచ చమురు మార్కెట్‌పై వెనిజులా ప్రభావం వంటి అంశాలపై రష్యా ఆలోచనలను పుతిన్ ఈ సందర్భంగా ట్రంప్‌నకు తెలియజేశారు.
ఈ సంవత్సరంలో ఇరువురు నేతలు మాట్లాడుకోవడం ఇదే మొదటిసారి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నివారణకు జరుగుతున్న కృషిలో పాలుపంచుకునేందుకు రష్యా సంసిద్ధంగా ఉన్నదని అధ్యక్ష భవనం ప్రతినిధి చెప్పారు. యుద్ధానికి ముగింపు పలికే విషయంలో మధ్యవర్తిత్వం వహించేందుకు పుతిన్ ముందుకు వచ్చారని, అయితే ఈ ప్రతిపాదనలన్నీ ఇంకా చర్చల దశలోనే ఉన్నాయని తెలిపారు. ఇదిలావుండగా ప్రపంచ ఇంధన మార్కెట్లలో నెలకొన్న గందరగోళం నేపథ్యంలో రష్యాపై చమురు ఆంక్షలను తగ్గించాలని అమెరికా ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలుస్తోంది.
ట్రంప్ మేకపోతు గాంబీర్యం
యుద్ధం ముగింపు దశకు చేరుకున్నదంటూ ట్రంప్ చేస్తున్న ప్రకటనలు కేవలం మార్కెట్లను శాంతపరచడానికి ఉద్దేశించిన వేనని విశ్లే షకులు అభిప్రాయపడ్డారు. యుద్ధం కారణంగా దిగజారిపోతున్న అమెరికా ఆర్థిక పరిస్థితి, తలెత్తబోయే అనూహ్య సంక్లిష్ట రాజకీయ పరిణామాలపై ట్రంప్ ఆందోళన చెందుతున్నారు. ట్రంప్ స్వరంలో తీవ్రత రానురానూ తగ్గిపోతోంది. ఇరాన్ నాయకత్వం బేషరతుగా లొంగిపోవాలని ట్రంప్ గతంలో డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడేమో యుద్ధాన్ని త్వరగా ముగించేందుకు ఆయన తొందర పడుతున్నారు.
పెరిగిపోతున్న చమురు ధరలు, మార్కెట్ నష్టాలు, దేశంలో ఎదురవుతున్న ఒత్తిడులు ట్రంప్‌ను ఆలోచనలో పడేస్తున్నాయి. పైగా యుద్ధాన్ని ముగించాలంటూ కొందరు సహాయకులు ట్రంప్‌నకు సలహా ఇచ్చారు. అమెరికన్లలో 56శాతం మంది యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్నారని ఓ తాజా సర్వే తెలిపింది. బ్యారల్ చమురు ధర వంద డాలర్లు దాటి నూట యాభై డాలర్లకు చేరువగా ఉంది. అమెరికా స్టాక్ మార్కెట్లు నష్టాలు చవిచూస్తున్నాయి. ఈ పరిణామాలన్నీ అమెరికా ఆర్థిక సమస్యలను మరింత పెంచబోతున్నాయి. అంతేకాక అంతర్జాతీయంగా ఆర్థిక సంక్షోభం తలెత్తే ప్రమాదం కూడా ఉంది. మరోవైపు దౌత్య యత్నాల ద్వారా ట్రంప్ దిగివచ్చేలా చేసేందుకు ఇరాన్ ప్రయత్నిస్తోంది.



