Friday, July 11, 2025
E-PAPER
Homeజాతీయంమీరిక్కడి వాళ్లేనా.. నిరూపించుకోండి

మీరిక్కడి వాళ్లేనా.. నిరూపించుకోండి

- Advertisement -

– అప్పుడే ఓటుహక్కు
– బీహార్‌ ఓటరు జాబితాల్లో 2.95 కోట్ల మంది పేర్లు తొలగింపు
– మళ్లీ నమోదు చేసుకోవాలని సూచన
– బీహార్లో ఎన్నికల సంఘం అత్యుత్సాహం
– గుర్తింపు కార్డులుగా ఆధార్‌, ఓటర్‌ ఐడీ పనికిరావని మెలిక

పినపాక సంగమేశ్వరరావు
విదేశీ అక్రమ వలసదారుల ఏరివేత పేరుతో దాదాపు 8 కోట్ల మంది భారతీయ ఓటర్ల పత్రాలను పున:పరిశీలన చేయాలని భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారింది. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంలో లక్షలాది మంది ప్రజల ఓటు హక్కును ఒక్క వేటుతో రద్దు చేసేందుకు, వారిని దేశం నుంచి సాగనంపేందుకు ప్రయత్నిస్తున్నారన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. బీహార్‌ ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్రానికి చెందిన ఎనిమిది కోట్ల మంది ఓటర్లు ఈ నెల 26వ తేదీ నాటికి తిరిగి తమ పేర్లను ఓటర్లుగా నమోదు చేసుకోవాలని ఈసీఐ స్పష్టం చేసింది. అలా చేయకపోతే వారు ఓటు హక్కును కోల్పోతారు. దానికితోడు వారిని ‘అనుమానిత విదేశీ పౌరులు’గా పరిగణిస్తారు. ఫలితంగా వారు జైలు శిక్ష, బహిష్కరణకు కూడా గురి కావాల్సి ఉంటుంది. బీహార్‌లో అక్టోబర్‌ లేదా నవంబర్‌లో ఎన్నికలు జరగాల్సి ఉండగా ఎన్నికల సంఘం ఇంత ఆకస్మికంగా ఈ నిర్ణయం తీసుకోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.

అక్రమ వలసదారులను గుర్తించి వారిని దేశం నుంచి బలవంతంగా బయటికి పంపేందుకు నరేంద్ర మోడీ ప్రభుత్వం గతంలో జాతీయ పౌరుల రిజిస్టర్‌ (ఎన్‌ఆర్‌సీ)ని ప్రతిపాదించింది. దానిని దొడ్డిదారిన అమలు చేసేందుకు ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకున్నదని విమర్శకులు అంటున్నారు. బెంగాలీ భాష మాట్లాడే వేలాది మంది ముస్లింలపై ఇప్పటికే కేంద్రం నిఘా పెట్టింది. వారిలో చాలా మందిపై బంగ్లాదేశ్‌ వలసదారులుగా ముద్ర వేసింది. తలసరి ఆదాయాన్ని బట్టి చూస్తే బీహార్‌ మన దేశంలో అత్యంత నిరుపేద రాష్ట్రం. ఆ రాష్ట్రంలో ప్రభుత్వ లెక్కల ప్రకారమే మూడో వంతు జనాభా పేదరికంలో మగ్గిపోతున్నారు. దేశంలో అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రాలలో మూడో స్థానంలో ఉన్న బీహార్‌కు రాజకీయ ప్రాధాన్యత ఉంది. 2005 నుంచి ఇక్కడ జేడీయూతో కలిసి బీజేపీ అధికారాన్ని చెలాయిస్తోంది.
దేశవ్యాప్తంగా అమలు చేసే యోచన
ఎన్నికల కమిషన్‌ తాజా నిబంధనల కారణంగా చాలా మంది ఓటర్లు తమ ఓటు హక్కును కోల్పోవాల్సి వస్తుంది. తమ స్థానికతను నిరూపించుకునేందుకు అవసరమైన పత్రాలను సిద్ధం చేసుకోవ డానికి కమిషన్‌ ఇచ్చిన గడువు చాలా తక్కువగా ఉండడం దీనికి ఓ కారణం. ఈసీఐ నిర్ణయంపై ప్రతిపక్ష పార్టీలు, పౌర సమాజ సంఘాలు, కొందరు వ్యక్తులు న్యాయ పోరాటం సాగిస్తున్నారు. పొరుగున ఉన్న బంగ్లాదేశ్‌, మయన్మార్‌ దేశాల నుంచి ముస్లిం వలసదారులు పెద్ద సంఖ్యలో దేశంలోకి ప్రవేశించారని ఆరోపిస్తున్న బీజేపీ ఇప్పుడు ఈసీఐ నిర్ణయాన్ని సమర్ధిస్తోంది. వాస్తవానికి దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాను ప్రక్షాళన చేయాలని బీజేపీ కోరుకుంటోంది. ఒకవేళ అదే జరిగితే భారత ప్రజాస్వామ్య భవిష్యత్తు, ఓటర్ల హక్కులపై తీవ్ర ప్రభావం పడుతుందని రాజకీయ పరిశీలకులు హెచ్చరించారు.
ఇప్పటిదాకా ఈసీ ఏం చేస్తోంది?
అనర్హులు ఓటర్ల జాబితాలో చేరకుండా చూడడమే ఈ చర్య ఉద్దేశమని ఈసీఐ చెబుతోంది. దేశంలో చివరిసారిగా ఓటర్ల జాబితా పూర్తి సవరణ 2003లో జరిగింది. అప్పటి నుంచి జాబితాలో క్రమం తప్పకుండా చేర్పులు, తొలగింపులు చేస్తున్నారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు కూడా ఈ ప్రక్రియ జరిగింది. బీహార్‌లో 7.96 కోట్ల మంది ఓటర్లు ఉండగా వారిలో 2.9 కోట్ల మంది తమ ఆధారాలను ధృవీకరించుకోవాల్సి ఉంటుందని ఈసీఐ అంటోంది. కానీ స్వతంత్ర అంచనాల ప్రకారం ఈ సంఖ్య 4.7 కోట్లుగా ఉండవచ్చునని తెలుస్తోంది. ‘2003 నుంచి బీహార్‌ ఓటర్ల జాబితాలో భారీ కుంభకోణం జరిగిందని ఈసీ అంగీకరిస్తోందా? అయితే గత 22 సంవత్సరాలుగా బీహార్‌ నుంచి ఎన్నికవుతున్న ప్రజా ప్రతినిధుల ఎన్నిక చెల్లదని అది చెబుతోందా?’ అని అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ఏడీఆర్‌) ప్రతినిధి జగదీప్‌ ఛోకర్‌ ప్రశ్నించారు.
ఆధార్‌, ఓటర్‌ ఐడీ పనికిరావు…
ఈసీఐ కసరత్తుపై అనేక విమర్శలు వస్తున్నాయి. ఓటర్ల జాబితా రూపకల్పన కోసం నెల రోజుల వ్యవధిలో ఎనిమిది కోట్ల మంది ఓటర్లను కలవడం చాలా కష్టమైన విషయం. పైగా ఈ ప్రక్రియను చేపట్టడానికి ముందు కమిషన్‌ ఎవరినీ సంప్రదించలేదు. అభిప్రాయాలు సేకరించలేదు. అకస్మాత్తుగా ఇలాంటి నిర్ణయం తీసుకోవడాన్ని చూస్తుంటే కమిషన్‌ నిస్పాక్షికతపై అనుమానాలు కలుగుతున్నాయని రాజకీయ విమర్శకులు చెప్తున్నారు. బీహార్‌లో లక్షలాది మంది ఓటర్లు కమిషన్‌ కోరిన పత్రాలను అందించడానికి ఇబ్బంది పడాల్సి వస్తుందని వారు తెలిపారు. భారత ప్రభుత్వం జారీ చేసిన ఆధార్‌ కార్డులు, ఈసీఐ జారీ చేసిన ఓటరు గుర్తింపు కార్డులను సైతం పరిగణనలోకి తీసుకోబోమని అధికారులు స్పష్టంం చేయడం విడ్డూరంగా ఉంది. వాటికి బదులుగా జనన ధృవీకరణ పత్రాల నుంచి పాస్‌పోర్టుల వరకూ, అటవీ హక్కుల ధృవీకరణ పత్రాలు, రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన విద్యా ధృవీకరణ పత్రాలు…ఇలా 11 రకాల పత్రాలు సమర్పించాలని కమిషన్‌ షరతు విధించింది.
పత్రాల సేకరణ సాధ్యమేనా?
బీహార్‌లో అక్షరాస్యతా రేటు చాలా తక్కువ. రాష్ట్ర జనాభాలో కేవలం 14.71 శాతం మంది మాత్రమే పదో తరగతి ఉత్తీర్ణులయ్యారు. కాబట్టి చాలా మంది వద్ద విద్యా ధృవీకరణ పత్రాలు ఉండవు. అలాగే బీహార్‌లో జనన నమోదు రేటు కూడా చాలా తక్కువే. రాష్ట్రంలో పాతిక శాతం జననాలు కూడా నమోదు కాలేదు. అంటే జనాభాలో నాలుగో వంతు మంది వద్ద జనన ధృవీకరణ పత్రాలు ఉండవు. అలాంటప్పుడు ఆయా పత్రాలను సమర్పించాలని కోరడం ఎంత వరకూ సబబన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఇక్కడ మరో ముఖ్యమైన విషయాన్ని కూడా గమనించాల్సి ఉంది. బీహార్‌లో జూన్‌-అక్టోబర్‌ నెలల మధ్య భారీ వర్షాలు కురిసి వరదలు సంభవిస్తాయి. వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను సహాయ శిబిరాలకు తరలిస్తారు. అలాంటప్పుడు వారు ఓటు హక్కు నమోదు కోసం పత్రాలను ఎలా సంపాదిస్తారో అధికారులకే తెలియాలి.
సర్కారుకు తందానా…
కేంద్ర ఎన్నికల సంఘం ఓ స్వతంత్ర సంస్థ. అయినప్పటికీ అది అధికార పార్టీ చెప్పినట్లు వ్యవహరిస్తూ దాని ప్రయోజనాలను కాపాడుతోందన్న విమర్శలు ఉన్నాయి. గత ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికలలో బీజేపీ సొంతగా మెజారిటీ సాధించలేక మిత్రపక్షాల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఆడలేక మద్దెల ఓడన్న సామెతను గుర్తు చేస్తూ ఆ పార్టీ నేతలు ఇప్పుడు ఓ వితండ వాదాన్ని తెర పైకి తెస్తున్నారు. రోహింగ్యా శరణార్థులు, బంగ్లాదేశ్‌ వలసవాదులు పెద్ద సంఖ్యలో దేశంలో తిష్ట వేయడం వల్లనే తాము ఓటమి చవిచూడాల్సి వచ్చిందని వాపోతున్నారు. గత లోక్‌సభ ఎన్నికల తర్వాత వివిధ రాష్ట్రాలలో…అది మహారాష్ట్ర అయినా, జార్ఖండ్‌ అయినా, ఢిల్లీ అయినా ఎన్నికలు జరిగినప్పుడు బీజేపీ నేతలు ఒకే పల్లవిని అందుకున్నారు. రోహింగ్యాలు, బంగ్లా వలసదారులను లక్ష్యంగా చేసుకోవడం ప్రారంభించారు. బీజేపీ ఆరోపణలకు సంబంధించి ఏవైనా నిర్దిష్ట ఆధారాలు ఉన్నాయా అంటే అవీ లేవు. ఈసీఐ కూడా ఈ వాదనకు వంత పాడడం అనుమానాలకు తావిస్తోంది. సంప్రదాయకంగా అట్టడుగు వర్గాలు, మతపరమైన మైనారిటీలు ఈసీఐ ని’బంధనాల’తో నష్టపోతారని పరిశీకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వర్గాలు ఓటు వేయకపోతే లాభపడేది బీజేపీయేనని వారు గుర్తు చేశారు.
ఆ రెండు వర్గాలే లక్ష్యంగా…
గత కొన్ని నెలలుగా కేంద్రం, బీజేపీ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలు వలసదారుల పేరుతో సరైన పత్రాలు లేవనే కారణాలు చూపి వారిని దేశం నుంచి బలవంతంగా బయటికి పంపే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఎనిమిది రాష్ట్రాల్లో వందలాది మందిని గుర్తించి నిర్బంధించారు. ముఖ్యంగా బెంగాలీ భాష మాట్లాడే ముస్లింలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. బంగ్లా వలసదారులని ముద్ర వేసి, వారిని దేశం ఆవలకు పంపే ప్రయత్నాలు చేస్తున్నారు. మోడీ ప్రభుత్వం సవరించిన పౌరసత్వ చట్టాలు ప్రధానంగా ముస్లింలనే ఎక్కువగా ప్రభావితం చేస్తున్నాయి. ఇతర మతాలకు చెందిన వారికి త్వరగానే భారత పౌరసత్వం లభిస్తోంది. బీహార్‌ జనాభాలో ముస్లింల వాటా 17 శాతం. దీనిపై ఏడీఆర్‌ ప్రతినిధి ఛోకర్‌ వ్యాఖ్యానిస్తూ రాష్ట్ర జనాభాలో సగం మందికి ఓటు హక్కు ఉండదని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -