Monday, December 22, 2025
E-PAPER
Homeమానవివ్యాయామమంటే బద్దకమా..!

వ్యాయామమంటే బద్దకమా..!

- Advertisement -

ఆరోగ్యంగా ఉండాలంటే మనం తీసుకునే ఆహారంతో పాటు వ్యాయామం కూడా ఎంతో అవసరం. దీని ప్రాధాన్యం తెలిసి కూడా చాలా మంది బద్దకిస్తుంటారు. మరికొందరికైతే అస్సలు టైంమే వుండదు. మహిళలు ఇలాంటి వాటిని కాస్త అధిగమించి మీ శరీరంపై కాస్త దృష్టి పెట్టాల్సిందే అంటున్నారు నిపుణులు. ముఖ్యంగా వ్యాయామం పట్ల సానుకూల దృక్పథం అలవరుచుకోవడం చాలా ముఖ్యమంటున్నారు. అందుకే కొన్ని చిన్న చిట్కాలు పాటిస్తే వ్యాయామం మీ రోజువారి జీవితంలో భాగం చేసుకోవచ్చు. అవేంటో తెలుసుకుందాం…

ఏ పని చేసినా స్పష్టత ఉంటే ఏకాగ్రత దానంతటదే వస్తుంది. ఇదే నియమం వ్యాయామానికీ వర్తిస్తుంది. కాబట్టి ముందు మీకు ‘అసలు నేను వ్యాయామం ఎందుకు చేయాలి?’ అనే విషయంపై స్పష్టత ఉండాలి. ఉదాహరణకు ‘వర్కౌట్స్‌ చేయడం వల్ల రోజంతా యాక్టివ్‌గా ఉండగలుగుతున్నా..’ లేదంటే ‘వ్యాయామం నా జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది..’, ‘ఎక్స్‌ర్‌సైజ్‌ నా శరీరక నొప్పుల్ని దూరం చేస్తుంది’, ‘వ్యాయామం నా రుతుచక్రాన్ని సరి చేసింది’… ఇలా ఒక్కొక్కరి లక్ష్యాలు, వ్యక్తిగత అవసరాలు ఒక్కోలా ఉంటాయి. మరి, మీ అవసరమేంటో స్పష్టంగా తెలుసుకోగలిగితే వ్యాయామాలపై ఏకాగత్ర పెట్టగలుగుతారు. అలాగే వర్కవుట్‌ ఇబ్బందిగా అనిపించినప్పుడల్లా మీ అవసరాన్ని ఒక్కసారి గుర్తు చేసుకుంటే బద్ధకం, నీరసం అన్నీ దూరమైపోతాయి.

ఆసక్తిని బట్టి
నచ్చిన పని చేస్తే ఎంత కష్టమైనా ఇష్టంగా పూర్తి చేస్తాం. అలాగే వ్యాయామం చేసే క్రమంలోనూ మీకు ఆసక్తి ఉన్న అంశాలపై దృష్టి పెట్టండి. ఉదాహరణకు జిమ్‌కు వెళ్లినప్పుడు కొన్ని వ్యాయామాలపై అనుకోకుండానే మనసు పారేసుకుంటాం. కొందరికి పుషప్స్‌, మరికొందరికి బరువులెత్తడం, ఇంకొందరికి లాంజెస్‌… ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి నచ్చొచ్చు. ఇవన్నీ కాకుండా నడక, జాగింగ్‌ వంటివి ఇష్టమైతే వీటితోనూ మొదలుపెట్టొచ్చు. ఇలా నచ్చేవి ఎంచుకుంటే మరింత ఆసక్తిగా వ్యాయామం చేయగలుగుతారు. దీనివల్ల వ్యాయామం చేయడం కూడా మీకు తేలిగ్గా ఇబ్బందిలేకుండా ఉంటుంది.

చిన్నగా మొదలుపెట్టి
ఫలితాలు వేగంగా రావాలని కొంతమంది మొదట్లోనే కష్టమైన వ్యాయామాలు చేస్తుంటారు. ఫలితంగా ఒళ్లు నొప్పులు రావడం, శరీరంపై గాయాలవడం వంటివి జరగొచ్చు. దానివల్ల వ్యాయామం అంటేనే ఒక ఫోబియాలా మారిపోతుంటుంది. మీకు కూడా ఇలాంటి భయాలే ఉంటే ముందు చిన్న చిన్న వ్యాయామాలతో వర్కట్లు మొదలు పెడితే ఇబ్బంది లేకుండా ఉంటుంది. వాకింగ్‌, జాగింగ్‌, సైక్లింగ్‌ వంటి సులువైన వ్యాయామాలతో మొదలుపెట్టి నెమ్మదిగా తీవ్రత పెంచుకుంటూ పోవాలి. ఫలితంగా వ్యాయామ రొటీన్‌పై ఇష్టం ఏర్పడుతుంది. శరీరంపైనా ప్రతికూల ప్రభావం పడకుండా జాగ్రత్తపడొచ్చు.

స్నేహితుల తోడుతో…
కొంతమంది తోడు లేనిదే ఏ పనీ చేయలేరు. వ్యాయామాలు కూడా అంతే. ఇలాంటి వారు స్నేహితులు, పెంపుడు జంతువులతో కలిసి వ్యాయామాలు చేయడం వల్ల తమ ఒంటరితనాన్ని అధిగమించి వ్యాయామాలపై దృష్టి పెట్టే అవకాశాలున్నాయంటున్నారు నిపుణులు. అంతేకాదు.. ఒకవేళ మధ్యమధ్యలో జిమ్‌ షెడ్యూల్‌ బోర్‌ కొట్టినా, మీరు మానేసినా… వారు మిమ్మల్ని వ్యాయామాలు చేసే దిశగా ప్రోత్సహించే అవకాశాలుంటాయి. ఇలా తోడుంటే రెండు విధాలుగా మేలు జరుగుతుంది.

చిన్న లక్ష్యాలు
చాలా మంది వ్యాయామం ప్రారంభించిన కొద్ది రోజులకే పూర్తి ఫలితాల్ని ఆశిస్తుంటారు. కానీ ఆశించిన ఫలితం పొందడానికి ఒక్కోసారి ఎక్కువ సమయం పట్టొచ్చు. కాబట్టి చిన్న చిన్న లక్ష్యాలను ఏర్పరచుకుని ఓపిగ్గా వ్యాయామం చేయాలంటున్నారు నిపుణులు. తద్వారా లక్ష్యాన్ని సులభంగా చేరగలుగుతామని చెబుతున్నారు. అలాగే దీనివల్ల వ్యాయామం చేయాలన్న ఆసక్తి కూడా పెరుగుతుంది.

ఇలా కూడా చేయండి
వ్యాయామం అంటే జిమ్‌లోనే చేయాల్సిన అవసరం లేదు. ఇంట్లోనూ, ఆరు బయట కూడా చేయవచ్చు. సరదాగా ఓ పాట పెట్టుకొని డ్యాన్స్‌ చేయండి. రింగ్‌, షటిల్‌, త్రోబాల్‌, తాడాట వంటివి పిల్లలో కలిసి ఆడేయండి. మౌంటెయిన్‌ క్లైంబింగ్‌, సైకిల్‌ తొక్కడం, జాగింగ్‌… ఇవన్నీ మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. బరువు అదుపులో ఉండటానికి, ఎముక ఆరోగ్యానికీ ఇవి ఇంతో అవసరం. ముఖ్యంగా మహిళల్లో హార్మోనుల్లో సమతుల్యతకు సాయపడతాయి. ఒత్తిడి తగ్గించి మానసిక ఆరోగ్యాన్ని అందిస్తాయి. ఇమ్యూనిటీని పెంచడంతో పాటు సుఖనిద్రకు ఉపకరిస్తాయి. ఒంట్లో సత్తువుకి కారణమవుతాయి. ఇన్ని లాభాలు కాబట్టే నిపుణులు వ్యాయామం చేయమంటున్నారు. అందుకే ప్రారంభంలో వీటికి రోజులో పది నిమిషాలు కేటాయించుకోండి. తర్వాత 20 నిమిషాల వరకూ చేయొచ్చు. మొత్తంగా వారంలో 75 నుండి 150 నిమిషాలు కేటాయించగలిగితే మేలు.

సౌకర్యం కూడా ముఖ్యమే
నడకకు వీలుగా షూస్‌ ఉండాల్సిందే. ఇవి కాళ్ల నొప్పులు రాకుండా కాపాడతాయి. మృదువైన కుషనింగ్‌తో కీళ్లకు సపోర్ట్‌ని ఇస్తాయి. అరికాళ్లపై ఒత్తిడిని తగ్గిస్తాయి. అంతేకాదు మట్టి, రాళ్లు, నీళ్లు, టైల్స్‌… ఇలా వేటి మీదైనా నడవడానికి సౌకర్యంగా ఉంటాయి. అసమానంగా ఉండే నేలపై నడవడానికి స్థిరత్వాన్ని ఇస్తాయి. వ్యాయామం ప్రారంభించిన రోజు నుంచే కిలోమీటర్లు నడిచేయాలని అనుకోవద్దు. మొదట ఓ 10-15 నిమిషాల దూరాన్ని నడిచి చూడండి. కాస్త శరీరం అలవాటు పడ్డాక క్రమంగా సమయాన్ని పెంచండి. వాకింగ్‌ చేసేటప్పుడు నిటారుగా నిలబడి అడుగులేయండి. అప్పుడే సరైన పోశ్చర్‌ సాధ్యమవుతుంది. అంతేకాదు, నడిచేముందు, తర్వాత తగినంత నీరు తాగడం తప్పనిసరి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -