Sunday, March 1, 2026
E-PAPER
Homeమానవిన‌ల‌భై దాటుతున్నాయా?

న‌ల‌భై దాటుతున్నాయా?

- Advertisement -

వయసు పెరుగుతున్న కొద్దీ శరీరంలో మార్పులు వస్తుంటాయి. అప్పటి వరకూ మామూలుగా అనిపించిన విషయాలే తర్వాత ఎంతో ఖరీదైనవిగా కనిపిస్తాయి. అందులోనూ ఆరోగ్యం మరీ అమూల్యమవుతుంది. అందుకే ఆస్తులతో పాటు ఆరోగ్యాన్ని కూడా పెంచుకోవాలి. నాలుగు పదుల వయసు వచ్చే సరికి సంపాదనా, ఆస్తులు ఎన్ని ఉన్నా అనారోగ్యం పాలైతే ప్రశాంతతే ఉండదు. ముఖ్యంగా మహిళలు మరింత జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. అందుకే ఆ రోజుల్లో అసలైన విలాసాల్లో ఈ అంశాలే ముఖ్య పాత్ర పోషిస్తాయంటున్నారు నిపుణులు. మరి అవేంటో తెలుసుకుందాం.

చిన్నప్పటి నుంచి ఎన్నో పనుల్లో బిజీగా ఉంటూ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. దాని ప్రభావం 40 ఏండ్ల నుంచి మొదలవుతుంది. అయితే ఈ సమయంలో మోకాళ్లు, కీళ్ల నొప్పులు, నడుము పట్టేయడం లేకుండా ఉంటే శరీరం అన్నింటి కంటే ఖరీదైనదిగా భావించవచ్చు.

హార్మోన్ల సమతూకం
కుటుంబ పోషణలో ఎన్నో కష్టాలు, నష్టాలను చూస్తుంటారు. ఇలాంటి సమయంలో అనవసరమైన ఒత్తిళ్లతో హార్మోన్లలోనూ సమతుల్యత దెబ్బతింటుంది. అయితే మనలోని శక్తి, ప్రశాంతమైన మనసు వల్ల హార్మోన్లు సమతుల్యంగా ఉంటాయి. ఎలాంటి మానసిక ఒడిదొడుకులు లేకుండా ఉంటే జీవన నాణ్యత కూడా పెరుగుతుంది.

ప్రశాంతమైన నిద్ర
సులభంగా నిద్రపోవడం, రాత్రంతా అది కొనసాగడం వయసుతో పాటు తగ్గుతుంది. ఇలాంటి సమయంలో పడుకోగానే నిద్రపట్టడం ఓ వరంతో సమానం. మంచి నిద్ర శరీరాన్ని పునరుద్ధరిస్తుంది. మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. సౌందర్య చికిత్సల కన్నా మెరుగ్గా శరీరాన్ని, మొహాన్ని మెరిపిస్తుంది.

సరైన జీర్ణక్రియ
కోటి విద్యలు కూటికొరకే అంటారు. అయితే ఒక వయసు వచ్చే సరికి అనేక సమస్యలతో ఆహారాన్ని త్యాగం చేయాల్సి వస్తుంది. బరువు పెరగడం, జీర్ణక్రియ సమస్యలు వస్తాయేమో అన్న భయం లేకుండా తినగలగడం అనేది ఒక వరం. మంచి ఆహారం ద్వారా వచ్చే మెటాబాలిజం రోగనిరోధక శక్తిని పెంచుతుంది. మధ్యవయసులో పోషకాహారం మరింత ప్రభావవంతంగా ఉంటుంది. మీరు ఇప్పుడు తినే ఆహారం గుండె జబ్బులు, మధుమేహం, ఆస్టియోపోరోసిస్‌ వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని నేరుగా ప్రభావితం చేస్తుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.

రోజంతా శక్తి
నడివయసులోకి వచ్చే సరికి తెలియకుండానే మనలో శక్తి క్షీణిస్తుంటుంది. అయితే రోజంతా అలసటతో కూర్చోకుండా పని చేయడానికి, నడవడానికి, ఇతరులతో కలవడానికి, జీవితాన్ని ఆస్వాదించడానికి ఉండే శక్తే నిజమైన సంపద.

మెరిసే చర్మ కాంతి
సంపదలో అందమూ ఓ భాగమే. ఇది శారీరకమే కాదు మానసికమైనదిగా కూడా ఉండాలి. అయితే నిజమైన కాంతి మనం వాడే క్రీమ్‌ల వల్లే రాదు. మంచి ఆహారం, నీరు, నిద్ర, ఆరోగ్యకరమైన జీవనశైలి వల్ల చర్మం సహజంగా మెరుస్తుంది.

మనశ్శాంతి
ఎప్పుడూ ఇల్లు, కుటుంబ బాధ్యతలతో సతమతమయ్యే వారికి విశ్రాంతి కావాల్సిన సమయం నలభైల్లోనే ఆసన్నమవుతుంది. అయితే అదే సమయంలో వచ్చే ఆరోగ్య సమస్యలతో మనశ్శాంతి కోల్పోయే వారు ఎందరో ఉంటారు. అందుకే మనసు ప్రశాంతంగా ఉంటే ఆరోగ్యం బాగుంటుందని గుర్తుంచుకోవాలి.

అర్ధవంతమైన బంధాలు
నిక్కమైన మంచి నీలమెక్కటి చాలు అంటారు వేమన. అంటే పనికి రానివి మన చుట్టూ ఎన్ని ఉన్నా వ్యర్థమే. అలాగే మన విజయాలకు ఆనందించని, మన కష్టాల్లో తోడుగా ఉండని వారు ఎంత మంది ఉన్నా ప్రయోజనం ఉండదు. అందుకే మనల్ని అర్థం చేసుకునే, ప్రోత్సహించే, తోడుగా ఉండే కొద్దిమందితో ఉండటం ఎంతో ముఖ్యం. మంచి సంబంధాలు మనషులను, మనసులనూ బలంగా మారుస్తాయి.

ముందు జాగ్రత్త ముఖ్యం

వీటిని సాధించాలంటే, ఎలాగైతే విలాసవంతమైన జీవితం కోసం కష్టపడతామో అలాగే ఆరోగ్యంపై జాగ్రత్త కూడా అవసరం. రెండూ సమాంతరంగా కొనసాగిస్తేనే జీవితం సాఫీగా సాగుతుంది.
– రోజూ వ్యాయామం, మంచి శరీరాకృతి కొనసాగించడం.
– రోజూ 7-8 గంటలు నిద్రపోవడం, ఫోన్ల వాడకాన్ని తగ్గించడం
– జంక్‌ఫుడ్‌కు దూరంగా ఉంటూ సరిపడా నీళ్లు తాగాలి.
– ఎట్టి పరిస్థితుల్లోనూ అల్పాహారం మానేయ కూడదు.
– ప్రోటీన్‌ ఉన్న పండ్లు, కూరగాయలు తినాలి.
– మనసుకు హానిచేసే మనుషులకు దూరంగా ఉండటం.
– పనికి, విశ్రాంతికి సమాన ప్రాధాన్యం ఇవ్వాలి
– మంచి కమ్యూనికేషన్‌, క్షమించడం అలవాటు చేసుకోవాలి.

క్రమం తప్పకుండా చేయండి
– ప్రతిరోజూ శ్వాస వ్యాయామాలు, ఫిజియో థెరపీ ఎక్సర్‌సైజ్‌ చేయాలి
– బరువు తగ్గడం, విటమిన్‌ డి, క్యాల్షియం వంటివి చెక్‌ చేసుకోవాలి.
– క్రమం తప్పకుండా హెల్త్‌చెకప్‌లకు వెళ్లాలి. ఒత్తిడిని నియంత్రించుకోవాలి.
– సరైనా నిద్రా సమయాలు, రాత్రిపూట తేలికైన ఆహారం తీసుకోవాలి.
– చక్కెర, రిఫైన్డ్‌ వంటలు తగ్గించడంతో పాటు తిన్న తర్వాత తప్పనిసరిగా నడవాలి
– అనవసరపు అంచనాలు, వాదనలు తగ్గించి జీవితాన్ని యథాతథంగా స్వీకరించాలి.
ఈ అలవాట్లను యవ్వనం నుంచే పాటిస్తే తర్వాత జీవితాన్ని ఆనందంగా గడపవచ్చు. కాస్త ఆలస్యమైనప్పటికీ నలభైల్లో మొదలు పెట్టినా క్రమశిక్షణతో కూడిన జీవనశైలితో సురక్షితమైన, నాణ్యమైన జీవితాన్ని సాధించవచ్చు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -