అరవింద్ రాజకీయ జీవితం కాంగ్రెస్ బిక్ష : పీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేశ్ కుమార్‌గౌడ్
నవతెలంగాణ-నిజామాబాద్ ప్రాంతీయ ప్రతినిధి
‘కేటీఆర్, హరీశ్ రావు చేయాల్సిన అక్రమాలు చేసి కాంగ్రెస్ ప్రభుత్వంపై బట్ట కాల్చి మీద వేసే ప్రయత్నం చేస్తున్నారు. పదేండ్ల బీఆర్‌ఎస్ పాలనలో జరిగిన అవకతవకలపై చర్చకు సిద్ధమా..? అవినీతి బురద జల్లడం కాదు దమ్ముంటే చర్చకు రావాలి’ అని టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేశ్ కుమార్‌గౌడ్ సవాల్ విసిరారు. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై ఎలాంటి చర్చకైనా సిద్ధమని బీఆర్‌ఎస్ అవినీతిపై దర్యాప్తులు కొనసాగుతున్నట్టు తెలిపారు. పసలేని ఆరోపణలు చేసి పారిపోతామంటే కుదరదని హెచ్చరించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
బీఆర్‌ఎస్ నాయకులు గత పదేండ్ల కాలంలో చేసిన తప్పులు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయని తెలిపారు. తాము అధికారంలోకి వచ్చాక సింగరేణితో పాటు అనేక సంస్థలను ప్రక్షాళన చేసి సంస్థ బలోపేతం కోసం మార్గదర్శకాలు జారీ చేశామని తెలిపారు. సింగరేణిలో జరిగిన కాంట్రాక్ట్‌లు బీఆర్‌ఎస్ హయాంలోనే జరిగాయని, వాటిపైనే కేటీఆర్, హరీశ్‌రావు ఆరోపణలు చేస్తున్నట్టు చెప్పారు. వారు చేసే ప్రతి ఆరోపణలపై చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని.. దేశంలో టెలిగ్రాఫ్ చట్టంలో ఫోన్ ట్యాపింగ్ అనేది అత్యంత భయంకరమైనదని.. సొంత బీఆర్‌ఎస్ నాయకుల ఫోన్‌లను సైతం ట్యాపింగ్ చేశారని అన్నారు.
దేవుళ్ల పేరుతో ఓట్లగబోం..
మున్సిపాల్టీ ఎన్నికల్లో ఇది వరకు తాము చేసిన అభివృద్ధి చెప్పి ఓట్లడుగుతామని.. బీజేపీ వాళ్ల లాగా దేవుళ్ల పేరుతో ఓట్లు అడగబోమని మహేష్ అన్నారు. దేవుళ్ళ పేరుతో రాజకీయం చేసే మీరు ఎలాంటి అభివృద్ధి చేశారని ప్రశ్నించారు. స్వార్థ రాజకీయాల కోసం దేవుళ్ళ పేర్లను వాడుకోవద్దని, ఎంపీ అరవింద్ జీవితం కాంగ్రెస్ పార్టీ పెట్టిన బిక్ష అని తెలిపారు. ప్యాకేజీలపై ఆధారపడిన జీవితం తనది కాదని అన్నారు. ఈ సమావేశంలో డీసీసీ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ, నగేష్‌రెడ్డి, చైర్మెన్లు కేశ వేణు, తాహెర్‌బిన్, రాం భూపాల్, శేఖర్ గౌడ్, పలువురు సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
ఫోన్ ట్యాపింగ్‌పై చర్చకు సిద్ధమా..?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



