Saturday, September 13, 2025
E-PAPER
Homeజాతీయంబీహార్‌లో 'ఆమె' ప్రభావాన్ని తగ్గిస్తున్నారా..?

బీహార్‌లో ‘ఆమె’ ప్రభావాన్ని తగ్గిస్తున్నారా..?

- Advertisement -

ఎస్‌ఐఆర్‌తో తగ్గిన మహిళా ఓటర్ల సంఖ్య
ఓటరు జాబితా నుంచి 36 లక్షల మంది గల్లంతు
‘మరణం’ కారణంగా 11 లక్షల మంది మహిళల పేర్లు తొలగింపు
ఇది కూడా మగవారి కంటే అధికమే
రాష్ట్ర ప్రభుత్వ గణాంకాలతో సరిపోలని ఈసీ లెక్కలు
పలు అనుమానాలకు తావిస్తున్న తాజా పరిణామాలు

స్థానిక సంస్థలు, అసెంబ్లీ, లోక్‌సభ.. ఇలా ఏ ఎన్నికల్లో చూసుకున్నా మహిళా ఓటర్లు నిర్ణయాత్మక పాత్ర పోషిస్తారు. రాజకీయ పార్టీలు కూడా వీరి ఓట్లను పొందటం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాయి. ఎన్నికల్లో హామీలు గుప్పించటం, వారిని ఆకర్షించే విధంగా పథకాలు రూపొందించటం వంటివి చేస్తుంటాయి. అంతేకాక మహిళల కోసం పార్టీలు తమ మ్యానిఫెస్టోల్లో ప్రత్యేక స్థానాన్ని కేటాయిస్తాయి. రాష్ట్రాలకు భారీగా ఆదాయాన్ని తెచ్చిపెట్టే మద్యపానంపైనా నిషేధం విధించటానికి రాజకీయ పార్టీలు సిద్ధపడుతుంటాయి. ప్రభుత్వాన్ని నిలబెట్టాలన్నా, పడగొట్టాలన్నా మహిళా ఓట్లు చాలా కీలకమన్న విషయాలు రాజకీయపార్టీలు గుర్తెరిగాయి. ఈ ఏడాది షెడ్యూల్‌ ప్రకారం అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న బీహార్‌ కూడా అందుకు మినహాయింపేమీ కాదు. అయితే భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఇక్కడ తీసుకొచ్చిన వివాదాస్పద స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (ఎస్‌ఐఆర్‌) బీహార్‌లో మహిళా ఓట్లను పెద్ద ఎత్తున తొలగించింది. ఈ సంఖ్య పురుషుల కంటే అధికంగా ఉన్నది. కొన్నేండ్లుగా స్థిరంగా పెరుగుతూ వస్తున్న మహిళా ఓటర్లను ఈ సారి ఓటరు జాబితా నుంచి తొలగించటం సర్వత్రా అనుమానాలను కలిగిస్తున్నది.

పాట్నా : దేశ జనాభాలో 9 శాతం వాటాను కలిగి ఉన్న బీహార్‌ 243 అసెంబ్లీ స్థానాలు, 40 ఎంపీ సీట్లతో రాజకీయంగా ఎంతో ప్రాధాన్యతను కలిగి ఉన్నది. అందుకే ఇక్కడ అధికారాన్ని చేజిక్కించుకోవటం కోసం ప్రధాన జాతీయ, ప్రాంతీయ పార్టీలు ఇప్పటికే తమ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. అధికార బీజేపీ-జేడీ(యూ) కూటమి ఒకవైపు, ప్రతిపక్ష ఆర్జేడీ-కాంగ్రెస్‌, ఇరత పార్టీల కూటమి మరొకవైపు బరిలో నిలువనున్నాయి. షెడ్యూల్‌ ప్రకారం ఈ ఏడాది బీహార్‌ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. సొంత బలం లేకున్నా.. కూటములను మారుస్తూ దాదాపు 20 ఏండ్ల నుంచి బీహార్‌ను సీఎం నితీశ్‌ పరిపాలిస్తున్నారు. ప్రస్తుతం ఎన్డీఏ కూటమిలో కీలకంగా ఉన్న ఆయన.. బీహార్‌ ప్రజల్లో నెలకొన్న ప్రభుత్వ వ్యతిరేక భావనతో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. కాబట్టి బీహార్‌లో ఎలాగైనా విజయం సాధించాలన్న ఉద్దేశంతో బీజేపీ- జేడీయూలు తమకు అనుకూలంగా లేని ఓట్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించటంలో భాగంగానే బీహార్‌లో ఎస్‌ఐఆర్‌ను ఈసీ ద్వారా తీసుకొచ్చాయనే ఆరోపణలు రాజకీయ వర్గాల్లో నడుస్తోన్న విషయం విదితమే.

ఓట్ల తొలగింపులే టార్గెట్‌గా ఈసీఐ సర్‌
ఎస్‌ఐఆర్‌ను తీసుకొచ్చిన ఈసీఐ.. ఓట్ల తొలగింపులే ప్రాధాన్య అంశంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్టుగా కనిపించింది. ఇప్పటికే దాదాపు 65 లక్షల మందికి పైగా ఓటర్లను జాబితా నుంచి తొలగించింది. అయితే వీరిలో అత్యధికం మహిళలే ఉండటం కూడా అనుమానాలకు బలమిస్తోంది. ఇక ఈసీఐ చెప్పే లెక్కలు కూడా అవాక్కయ్యేలా ఉంటున్నాయి. ఈసీఐ లెక్కల ప్రకారం బీహార్‌లో పురుషుల కంటే మహిళలే వేగంగా మరణిస్తున్నారు. అయితే మహిళల మరణాలు పురుషుల కంటే తక్కువగా ఉన్నాయన్న రాష్ట్ర గణాంకాలకు విరుద్ధంగా ఇది కనిపిస్తున్నది. బీహార్‌లో వివాదాస్పద ఎస్‌ఐఆర్‌ జరిగిన ఒక నెలలోనే ఓటర్ల జాబితా నుంచి 65 లక్షల మందికి పైగా పేర్లు తొలగింపులకు గురైన విషయం విదితమే. వీరిలో 36.59 లక్షల మంది మహిళలు కాగా.. 29.3 లక్షల మంది పురుషులు ఉన్నారు. అంటే పురుషుల కంటే అదనంగా 7.9 లక్షల మంది మహిళల పేర్లు ఓటర్ల జాబితా నుంచి తొలగించబడ్డాయి. అయితే ఎన్నికల సంఘం ఈ తొలగింపులకు నాలుగు కారణాలను చెప్పింది. అవి ప్రజలు ఒక చోటు నుంచి మరొక చోటుకు వెళ్లడం (స్థాన భ్రంశం), మరణాలు, గణన ఫారమ్‌లను పూరించటంలో వైఫల్యం, నకిలీ ఎంట్రీలుగా ఉన్నాయి.

ఈసీ చెప్పిన నాలుగు కారణాల్లో మహిళా ఓట్ల తొలగింపులే అధికం
మహిళల పేర్ల తొలగింపులో అధికం స్థానం భ్రంశం (16.09 లక్షలు)కు చెందినవైతే.. తర్వాతి స్థానంలో మరణం (11.6 లక్షలు) ఉన్నది. ఇక గణన ఫారమ్‌లను పూరించటంలో వైఫల్యం కారణంగా 5.2 లక్షల మంది, నకిలీ ఎంట్రీలతో 3.7 లక్షల మంది మహిళలు ఓటర్ల జాబితాలో పేర్లను కోల్పోయారు. ఇక పురుషుల విషయానికి వస్తే.. మరణం కారణంగా పది లక్షల మంది ఓటర్లను మాత్రమే తొలగించారు. పైన పేర్కొన్న నాలుగు కారణలలో ప్రతి ఒక్కదానిలోనూ పురుష ఓటర్ల తొలగింపులు మహిళల కంటే తక్కువగా ఉన్నాయి. మరణం కారణంగా 10.6 లక్షల మంది, స్థానభ్రంశం కారణంగా 10.4 లక్షల మంది, ఫారమ్‌లను పూరించటంలో వైఫల్యం కారణంగా 4.4 లక్షల మంది, నకిలీ ఎంట్రీల కారణంగా 3.5 లక్షల మంది పురుష ఓటర్లు ఓటరు జాబితా నుంచి తొలగించబడ్డారు.

గత అసెంబ్లీ ఎన్నికల కంటే తగ్గిన ఏడు లక్షల మంది మహిళలు
బీహార్‌లో మహిళా ఓటర్ల లింగ నిష్పత్తి రెండేండ్లుగా పెరుగుతున్నది. ఇది 2024లో ప్రతి వెయ్యి మంది పురుషులకు 909 మహిళలుగా ఉంటే.. 2025 జనవరిలో ప్రచురించబడిన జాబితాలో ఇది 913కు పెరిగింది. ఇప్పుడు దాని కనిష్టస్థాయికి 892కు పడిపోవటం గమనార్హం. బీహార్‌ ఎస్‌ఐఆర్‌లో భాగంగా ఓటర్లను చేర్చడానికి ఆధార్‌ను ఐడీ ప్రూఫ్‌గా పరిగణించాల్సిందేనంటూ సుప్రీంకోర్టు ఇటీవలే ఎన్నికల కమిషన్‌ను ఆదేశించిన విషయం విదితమే. బీహార్‌లో ఓటర్ల తుది జాబితా సెప్టెంబర్‌ 30న ప్రచురించనున్నారు. అయితే ప్రస్తుత ట్రెండ్‌ కొనసాగితే ఈ తొలగింపులు మహిళల ఓటింగ్‌ శాతంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయనీ, ముఖ్యంగా ఎస్‌ఐఆర్‌ తర్వాత ఐదేండ్లలో బీహార్‌లో మహిళా ఓటర్ల సంఖ్య ఇప్పుడు అత్యల్ప స్థాయికి చేరుకుంటుందని విశ్లేషకులు చెప్తున్నారు. 2020 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే రాష్ట్రంలో ఈ సారి మహిళా ఓటర్లు ఏడు లక్షల మంది తగ్గారు. పురుష ఓటర్ల సంఖ్య 5 లక్షలు మాత్రమే తగ్గటం గమనార్హం.

రాష్ట్ర ప్రభుత్వ డేటాకు విరుద్ధంగా ఈసీ లెక్కలు
అయితే ఎన్నికల సంఘం గణాంకాలు రాష్ట్ర ప్రభుత్వ సమాచారంతో మాత్రం సరిపోలటం లేదు. బీహార్‌లో వార్షిక జనన మరణాల రిజిస్టర్‌ ప్రకారం 2018 నుంచి 2022 మధ్య రాష్ట్రంలో దాదాపు 60 శాతం మరణాలు పురుషులవే. ప్రభుత్వానికి సంబంధించిన ఈ సమాచారం కూడా బహిరంగంగా అందుబాటులో ఉన్నది. అయితే ఎన్నికల సంఘం గణాంకాలు మాత్రం బీహార్‌లో మహిళల మరణాలే అధికమని చెప్తుండటం గమనార్హం. వాస్తవానికి గత ఎన్నికల్లో మహిళలు నిర్ణయాత్మక ఓటర్లుగా కీలక పాత్రను పోషించారు. ఇప్పుడు బీజేపీ-జేడీ(యూ) పాలన పట్ల వారిలో వ్యతిరేకత ఏర్పడింది. దీంతో ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికలకు ముందు అధిక సంఖ్యలో వారి ఓట్లను తొలగించటం ప్రాధాన్యతను సంతరించుకున్నది. పురుషులతో పోలిస్తే ఓటర్లుగా తక్కువ మంది మహిళలు తమ పేర్లను నమోదుచేసుకున్నప్పటికీ.. గత మూడు ఎన్నికలలో వారి ఓటింగ్‌ స్థిరంగా పురుషుల కంటే ఎక్కువగా ఉన్నది. 2005లో ఇది 42.51 శాతంగా ఉంటే.. 2020 అసెంబ్లీ ఎన్నికల నాటికి ఇది ఏకంగా 59.7 శాతానికి పెరిగింది. అదే సమయంలో పురుషుల ఓటింగ్‌ 49.9 శాతం నుంచి 54.45 శాతానికి పెరిగినా.. మహిళ ఓటింగ్‌ శాతం పెరుగుదలతో పోలిస్తే చాలా తక్కువ కావటం గమనార్హం.

‘మరణం’తో 50 శాతానికి పైగా మహిళా ఓట్లు గల్లంతు
బీహార్‌ ఎన్నికల్లో మహిళలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. దీనిని గుర్తించిన నితీశ్‌ సర్కారు 2006లో మహిళలకు 50 శాతం పంచాయతీ స్థానాలను రిజర్వ్‌ చేశారు. భారత్‌లో ఇలా చేసిన తొలి రాష్ట్రంగా బీహార్‌ నిలిచింది. అలాగే మద్యపాన నిషేధం, ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు వంటివి కూడా తీసుకొచ్చారు. 2020 ఎన్నికల్లో మహిళలను దృష్టిలో ఉంచుకొని తమ మ్యానిఫెస్టోలో వారి కోసం ప్రత్యేకంగా హామీలను రూపొందించిన కారణంగా బీజేపీ-జేడీ(యూ) కూటమి అధికారంలోకి రాగలిగింది. ఆ సమయంలో ప్రధాన ప్రతిపక్షం మహిళలను విస్మరించటంతో మళ్లీ అదే స్థానానికి పరిమితమైంది. రాష్ట్రవ్యాప్తంగా 243 అసెంబ్లీ నియోజక వర్గాలలో 187 చోట్ల మరణం కారణంగా తొలగించబడిన మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లోనూ తొలగింపునకు గురైనఓట్లు 50 శాతం మరణం కారణంగానే ఉండటం గమనార్హం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -