ప్రస్తుతం కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లతో గంటల తరబడి గడుపుతున్నాం. ఇక మొబైల్ ఫోన్లను చూడకుండా ఒక్క నిమిషమైన ఉండలేం. ఇలా ఆధునిక డిజిటల్ ప్రపంచం మనిషిని, వారి జీవనశైలిని పూర్తిగా మార్చేసింది. ఇలా అన్ని పనులకు పరికరాలపై ఆధారపడటం జీవితంలో భాగమయ్యింది. ఇప్పుడు గంటల కొద్దీ కూర్చోవటమే పనిగా మారిపోయింది. ఇలా గంటల తరబడి కూర్చోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయంటున్నారు నిపుణులు. మరి ఈ సమస్యలను అధిగమించడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం…
ప్రస్తుతం నిత్యావసర వస్తువులు, కూరగాయలు, దుస్తులు కొనడానికి గడప దాటాల్సిన పనిలేదు. ఇవాన్ని ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేస్తే చాలు నేరుగా ఇంటికే వచ్చేస్తాయి. కానీ, శరీరం కూర్చోవడానికి తయారైంది కాదు. నిటారుగా నిల్చోవటానికి, నడవటానికి, పరుగెత్తటానికి, గుంజీలు తీయటానికి, తరచూ కదలటానికి అనుగుణంగానే పరిణామం చెందుతుందని నిపుణులు చెబుతున్నారు. గంటల తరబడి కూర్చోవడం వల్ల మన తుంట్లు, మోకాళ్లు, మడమలు అదే పనిగా వంగిన స్థితిలో ఉంటాయి. ఫలితంగా శరీరంలో రక్తప్రసరణ తగ్గటానికి కారణమవుతుంది. అంతేకాకుండా వెన్నెముకకు దన్నుగా నిలిచే వీపు, కండరాల వంటివి క్రమంగా, చడీచప్పుడు చేయకుండా బలహీనమవుతాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అనేక ఆరోగ్య సమస్యలు
ఎక్కువ సేపు కూర్చోవటం వల్ల తలెత్తే ప్రభావాలు వెంటనే కనిపించకపోవచ్చు. కానీ క్రమంగా శరీరం బలహీనపడడం, ఒత్తిడి పెరిగిపోయి నడుం, మెడ, భుజాల నొప్పితో బయటపడుతుందని నిపుణులు చెబుతున్నారు. వీటితో పాటు మోకాళ్లు, తొడ నొప్పులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా రక్త ప్రసరణ లోపించటం, నాడులు నొక్కుకుపోవటం వల్ల కొందరికి కాళ్లు, పాదాలు మొద్దు బారడంతో పాటు సూదులు పొడుస్తున్నట్లు అనిపించొచవచ్చు. కానీ చాలామంది వీటిని పెద్దగా పట్టించుకోరు. వయసు మీద పడటం వచ్చిన సమస్యలుగా అనుకుంటారు. బరువు పెరగటం ఇతరత్రా జబ్బులు లక్షణాలుగా అనుకొని వదిలేస్తారు.
జబ్బుల ముప్పులూ
కదలకుండా ఉండిపోవటం కండరాలు, కీళ్ల మీదే కాదు, ఇతరత్రా అంశాల పైనా ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. జీవక్రియలు నెమ్మందిచడం, బరువు, రక్తపోటు పెరగడం, డయాబెటిస్, గుండెజబ్బు వంటి దీర్ఘకాల సమస్యల ముప్పునూ పెంచుతాయి. కొన్ని రకాల క్యాన్సర్ల బారినపడే అవకాశమూ ఉంటుంది. అలాగే మానసిక ఆరోగ్యమూ దెబ్బతింటుందని బెటర్ హెల్త్ తన అధ్యయనంలో పేర్కొంది. బద్ధకంగా ఉండిపోయే వారిలో ఆందోళన, కుంగుబాటు ఎక్కువగా కనిపిస్తాయని కూడా తేలింది.
నిటారు డెస్క్‌లు
డెస్క్ ఉద్యోగాలు చేసేవారు ప్రతి 30 నిమిషాలకో లేదా గంటకో ఓసారి లేచి నిల్చోవాలని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఆఫీసులో మధ్యమధ్యలో అటూఇటూ కాసేపు నడవాలి. వీలుంటే ఆఫీసు బయట పరుగెత్తొచ్చని నిపుణులు సూచిస్తున్నారు. వీటితో పాటు శరీరాన్ని అటూఇటూ వంచటం, గుంజీలు తీయటమూ చేయొచ్చు. నిల్చొని పనిచేసే డెస్క్‌లు ఉంటే ఇంకా మంచిదని, కాసేపు నిల్చొని, కాసేపు కూర్చొని పనులు చేసుకోవచ్చని వివరించారు. తక్కువ కూర్చోవడం, ఎక్కువ కదలడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుందని mayoclinic అధ్యయనంలో పేర్కొంది.
ఇంటి పనులతో
ఇంట్లోనూ వీలైనంత వరకూ ఎవరి పనులు వాళ్లే చేసుకోవడానికి ప్రయత్నించాలని నిపుణులు చెబుతున్నారు. అవకాశం ఉంటే నిల్చొని వంట చేయడం, పాత్రలు తోమడం, వంగి ఇల్లు ఊడ్చడం, దుస్తులు ఉతకడం వంటి పనులు చేసుకోవచ్చు. అంతేకాకుండా దగ్గరలోని దుకాణాలకు వెళ్లేటప్పుడు వాహనాలకు బదులు నడిచి వెళ్లొచ్చు. నడుస్తూ ఫోన్ మాట్లాడటం, టీవీ చూస్తున్నప్పుడు ఒళ్లు విరుచుకోవటం వంటి తేలికైన మార్పులు కూడా మంచి ఫలితం చూపిస్తాయని నిపుణులు తెలిపారు.
ఆరుబయట ఆటలు
పిల్లలు, యుక్త వయసువారిని ఆరుబయట ఆడుకునేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలి. మొబైల్ ఫోన్, టీవీలు, ట్యాబ్లెట్, కంప్యూటర్, ల్యాప్‌టాప్‌లకు కేటాయించే సమయాన్ని పరిమితం చేసుకోవాలి. వారంలో ఒక గంట మాత్రమే వీటికి కేటాయించాలని నిపుణులు అంటున్నారు.
ఏ వయసు వారైనా
చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా ఎవరైనా గానీ ఒకేసారి గంట కన్నా ఎక్కువ సేపు కూర్చోవద్దని నిపుణులు చెబుతున్నారు. వృద్ధులు తేలికైన యోగాసనాలు, నెమ్మదిగా నడవటం లాంటివి చేయాలి. క్రమం తప్పకుండా ఇలా చేయడం వల్ల కండరాలు బలంగా ఉండటానికి, సాఫీగా కదలటానికి తోడ్పడతాయని నిపుణులు పేర్కొన్నారు.
అవగాహనతో మెలగాలి
ఎవరికైనా కూర్చోకుండా గంటల తరబడి ఉండటం సాధ్యం కాదు. కానీ ఎంతసేపు కూర్చుంటున్నామనేది ముఖ్యమంటున్నారు నిపుణులు. ఎక్కువ సేపు కూర్చోవాల్సి వస్తే మధ్యమధ్యలో లేచేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. జీవితంలో అన్ని దశల్లోనూ ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికిది నడక కీలకమని చెబుతున్నారు.
కదలటం ముఖ్యం
అదే పనిగా కూర్చొని పని చేసేవారు రోజుకు కనీసం 20-30 నిమిషాల సేపు తీవ్రమైన ఏరోబిక్ వ్యాయామాలు చేయటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. వేగంగా నడవటం, పరుగెత్తటం, సైకిల్ తొక్కటం, డ్యాన్స్, ఈత కొట్టటం లాంటి ఏరోబిక్ వ్యాయామాలు ఏవైనా చేయొచ్చని సూచిస్తున్నారు. ఒకవేళ ఇవి మొదట్లో కష్టంగా అనిపిస్తే రెండు, మూడు దఫాలుగా విభజించుకోవచ్చని సలహా ఇస్తున్నారు. ప్రతి గంటకు 5 నిమిషాల సేపు నడిచినా మంచి మార్పు కనిపిస్తోందని, మొత్తం మీద వారానికి కనీసం 150 నిమిషాలు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలని, కూర్చునే సమయాన్ని తగ్గించాలని అష్ట్రర.బస అధ్యయనంలో పేర్కొంది.
కదలకుండా కూర్చుంటున్నారా?
- Advertisement -
- Advertisement -