మీ ఆదేశాలతోనే ఫోన్ ట్యాపింగ్ జరిగిందా?
నందినగర్‌లోని నివాసంలో కేసీఆర్‌ను నాలుగున్నర గంటలపాటు విచారించిన సిట్
ప్రశ్నలు సంధించిన ఆరుగురు అధికారులు
సిట్ సేకరించిన ఆధారాలతో ప్రశ్నలు.. ఎదురు ప్రశ్నించిన కేసీఆర్
విచారణ సమయంలో ఇంటిబయట ఉద్రిక్తత, కార్యకర్తల నిరసనలు
నవతెలంగాణ – హైదరాబాద్ బ్యూరో
రాష్ట్రంలో సంచలనం రేపిన ఫోన్‌ట్యాపింగ్ కేసులో బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావును సిట్ అధికారులు విచారించారు. ఆదివారం హైదరాబాద్‌లోని నందినగర్‌లో తన సొంత నివాసంలో ఆయన్ను నాలుగున్నర గంటల పాటు ప్రశ్నించారు. ఈ సమయంలో ఇంటి బయట వేలాది మంది కార్యకర్తల నిరసనలు, నినాదాలు చేశారు. భారీ బందోబస్తు మధ్య ఆరుగురు సిట్ అధికారులు ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించారు. విచారణ పర్వం పూర్తిగా వీడియో రికార్డింగ్ చేశారు. అధికారులు అడిగిన పలు ప్రశ్నలకు నేరుగా సమాధానమిచ్చిన కేసీఆర్ మరికొన్నింటికి ఎదురు ప్రశ్నించారు. ఒక సందర్భంలో ఇదంతా సిల్లీ వ్యవహారమనీ, కేవలం రాజకీయ కక్షతోనే సాగిస్తున్న డ్రామా అంటూ ఆయన అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది. సిట్ ఇచ్చిన నోటీసుల మేరకు… కేసీఆర్ ఆదివారం భారీ కాన్వాయ్ తో ఎర్రవల్లి ఫామ్‌హౌస్ నుంచి మధ్యాహ్నం 12.30గంటల సమయంలో నందినగర్ నివాసానికి చేరుకున్నారు.
ఇతరులు అటువైపు రాకుండా కెేసీఆర్ నివాస పరిసరాల్లో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. నగర స్పెషల్ బ్రాంచ్ జాయింట్ కమిషనర్ విజయ్ కుమార్, మహేశ్వరం డీసీపీ నారాయణరెడ్డి, గ్రేహౌండ్స్ కమాండెంట్ రవీందర్ రెడ్డి, కూకట్‌పల్లి డీసీపీ రితురాజ్, శంషాబాద్ అదనపు ఎస్పీ ఎఎస్ రావు, ఏసీపీలు శ్రీధర్ రికార్డింగ్ పరికరాలతో ఆయన నివాసానికి చేరుకున్నారు. రెండో అంతస్తులో వెయిట్‌చేస్తున్న సిట్ అధికారుల వద్దకు న్యాయవాదులతో కలిసి మధ్యాహ్నం 3గంటల ప్రాంతంలో కేసీఆర్ వచ్చారు. విచారణ గదిలోకి న్యాయవాదులను అనుమతించ లేదు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే హరీశ్‌రావు మొదటి అంతస్తులో ఉండి పరిస్థితిని సమీక్షించారు. మధ్యాహ్నం 3.10గంటలకు విచారణ ప్రారంభించారు. ఫోన్ ట్యాపింగ్ జరుగుతున్నట్టు మీకు ముందుగానే తెలుసా..? మీకు అవసరమైన వ్యక్తుల సమాచారం కోసం వారి ఫోన్లు ట్యాపింగ్ చేయమని అప్పటి ఎస్‌ఐబీ చీఫ్ ప్రభాకర్ రావును ఆదేశించారా? ఈ విషయంలో అప్పటి టాస్క్‌ఫోర్స్ డీసీపీ రాధాకిషన్‌రావును కూడా ఉపయోగించుకున్నారా? అనే ప్రశ్నలతో అధికారులు విచారణను ప్రారంభించినట్టు తెలిసింది.
అయితే, ఉదయమే ఇంటెలిజెన్స్ అధికారులు సీఎంగా ఉన్న తనను కలిసి శాంతిభద్రతల సమాచారం చెప్పేవారనీ, ఆ సమాచారం ఎలా సేకరించారనే విషయం తనకు అప్రస్తుతమని కెేసీఆర్ చెప్పినట్టు తెలిసింది. దేశ భద్రత, ప్రభుత్వ సుస్థిరత, మావోయిస్టుల కదలికలపై ఇంటెలిజెన్స్ అధికారులు ఫోన్ ట్యాపింగ్ చేస్తుంటారు. అది వారి విధుల్లో భాగమని మీకు తెలియదా? అని అడగ్గా కెేసీఆర్ సిట్ అధికారులను ఎదురు ప్రశ్నించినట్టు తెలిసింది. సుప్రీం నుంచి వచ్చిన ఆదేశాలతోనే ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడినట్టు గతంలో తాము అరెస్ట్ చేసి విచారించిన అధికారులు తెలిపిన విషయాన్ని వివరిస్తూ ..ఆ సుప్రీం మీరేనా? అని కేసీఆర్‌ను ప్రశ్నించగా దానికి ఆయన నేరుగా సమాధానమివ్వలేదని సమాచారం.
కాగా, బీఆర్‌ఎస్ పార్టీకి రూ.1100కోట్లకుపైగా నిధులు వ్యాపారులను బెదిరించి ఎలక్ట్రోరల్ బాండ్లు వసూలు చేశారన్న ప్రశ్నలకు కూడా ఆయన సమాధానం ఇవ్వలేదు. కాగా, ఫోన్‌ట్యాపింగ్ వ్యవహారమనేది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భద్రతా చర్యల్లో భాగంగా సాధారణంగా నిర్వహించే వ్యవహారమని కేసీఆర్ వాదించినట్టు తెలిసింది. గతంలో సిట్ సేకరించిన సమాచారం, పలు ఆధారాలను కేసీఆర్ ముందుపెట్టి ప్రశ్నించారు. మధ్యలో విరామమిస్తూ రాత్రి 7.45నిమిషాల ప్రాంతంలో విచారణను ముగించి స్టేట్‌మెంట్‌పై కేసీఆర్ సంతకం తీసుకున్నట్టు తెలిసింది. రాత్రి 8గంటల ప్రాంతంలో సిట్ అధికారులు కేసీఆర్ నివాసం నుంచి వెళ్లిపోయారు. కిందికి వచ్చిన కేసీఆర్ అక్కడే ఉన్న కేటీఆర్, హరీశ్‌రావుతో సమావేశమయ్యారు.



