Saturday, September 13, 2025
E-PAPER
Homeమానవిఆఫీసులో ఫోన్‌ మాట్లాడుతున్నారా?

ఆఫీసులో ఫోన్‌ మాట్లాడుతున్నారా?

- Advertisement -

ప్రియమైన వేణు గీతికకు
ఈ నెలంతా చాలా బిజీ అని చెప్పావు. ఎంత బిజీగా ఉన్నా సమయానికి భోజనం చెయ్యి, మంచి ఆహారం తీసుకో. ఆరోగ్యాన్ని అలక్ష్యం చేయకు తల్లి. నాన్న.. గత రెండు ఉత్తరాల్లో ఫోన్‌ గురించే రాసాను. ఈ ఉత్తరం కూడా ఫోన్‌కు సంబంధించిందినదే. ఈసారి పని చేసే చోట ఫోన్‌ ఉపయోగం గురించి రాస్తున్నాను. నేను చాలా చోట్ల ఉద్యోగులను, వ్యాపారస్తులను, సంస్థల్లో, పాఠశాలల్లో పనిచేసే వారిని చూస్తుంటాను. ఫోన్‌ వస్తే చాలు మాట్లాడుతూనే ఉంటారు. ఆ మాటలకు అంతం ఉండదు. ఎంత సేపు మాట్లాడతారో వారికే తెలియదు. ఫోన్‌ మాట్లాడటంలో తప్పులేదు. అయితే పని ప్రదేశంలో ఉన్నప్పుడు ఏదైనా వ్యక్తిగత ఫోన్‌ వస్తే, ఆఫీస్‌లో ఉన్నాను, భోజన విరామంలో మాట్లాడతాను, ఇంటికి వెళ్ళాక మాట్లాడతాను అని చెప్పాలి. కొందరు ఇంటి నుండి ఆఫీసుకు చేరుకునే వరకు ఫోన్‌ మాట్లాడుతూనే ఉంటారు. అంటే ఫోన్‌కి ఎంతగా బానిసలై పోయారో చూడు. నువ్వు కాలేజీలో చదివేటప్పుడు విద్యార్థుల చేతిలో ఫోన్‌ ఉండనిచ్చే వారు కాదు. కొన్ని చోట్ల ఉద్యోగం చేసే చోట కూడా ఫోన్‌ సెక్యురిటీలో ఇచ్చి వెళ్ళాలి. ఇది చాలా మంచి పద్ధతి. అప్పుడు ఎవరైనా సరే వారి చదువు మీద, పని మీద దృష్టి కేంద్రీకరించగలుగుతారు.

ఏదైనా అత్యవసర పరిస్థితి వస్తే కాలేజీ రిసెప్షన్‌కి కానీ, పై అధికారికి కానీ సమాచారం ఇవ్వాలి. నేను ప్రతిరోజు ఫిజియోథెరపికి వెళుతున్నాను కదా! ఈ శాఖకు కొత్తగా వచ్చిన ఆఫీసర్‌ ఫోన్‌ మాట్లాడుతూనే ఉంటారు. ఒక శాఖకు ఆఫీసర్‌ అయ్యుండి, వారిపై వారికే నియంత్రణ లేక పోతే ఇక కింది వాళ్లకు ఏం చెప్తారు, ఏం నేర్పిస్తారు. ఇదే విషయాన్ని నేను ఇన్‌డైరెక్టు గా చెప్పాను. పని చేసే చోట ఫోన్లు మాట్లాడటం మంచిది కాదు అని. ఇలాంటి వారిపై తప్పకుండా చర్యలు తీసుకోవాలి. అయితే వైద్యులు, పోలీసుల వంటి వారికి మాత్రం వృత్తిరీత్యా ఫోన్లు మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. వీరికి మినహాయింపు తప్పదు. ఫోన్‌ విష యంలో నువ్వు చాలా వరకు నియంత్రణలో ఉంటావు. కాలేజీలో చదివేటప్పుడు తప్పని సరైతేనే ఫోన్‌ మాట్లాడే దానివి. ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నావు. అంటే ఉద్యోగ బాధ్యతలు ముఖ్యం. ఆఫీసులో పనిచేసేటప్పుడు ఆఫీస్‌కి సంబంధించిన సమాచారం కొరకు, అత్యవసరమైతేనే ఫోన్‌ చేయాలి. బాధ్యతలు మరచి కబుర్లు చెప్పుకోకూడదు. వాటికి ఒక సమయం ఉంటుంది. వ్యక్తిగత ఫోన్లు కూడా అత్యవసర పరిస్థితులైతేనే మాట్లాడాలి. నాన్న ఒక్కటి గుర్తు పెట్టుకో పని చేసేచోట ఎంత నిబద్ధతతో ఉంటే అంత రాణిస్తావు. ఈ విషయాలు గుర్తు పెట్టుకుంటావని ఆకాంక్షిస్తూ…

ప్రేమతో మీ అమ్మ
పాలపర్తి సంధ్యారాణి

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -