Monday, November 10, 2025
E-PAPER
Homeమానవిలేవగానే క‌ళ్ళు తిరుగుతున్నాయా..?

లేవగానే క‌ళ్ళు తిరుగుతున్నాయా..?

- Advertisement -

ఇది మహిళల నుండి తరుచుగా వచ్చే ఫిర్యాదు. ‘కాసేపు కదలకుండా మంచంమీద అలాగే కూర్చుని ఉంటే తగ్గిపోతుంది, మెల్లగా లేచి పనులు మొదలుపెట్టి, టీ తాగుతున్నప్పుడు సర్దుకుంటుంది’ ఇలా తమదైన శైలిలో, అనుదినం ఎదుర్కునే సమస్యని ఏ విధంగా అధిగమిస్తున్నారో కూడా చెప్తారు! తల తిరిగినట్టుగా/ బరువుగా/ అప్పుడప్పుడు కలవరపాటుగా, ఎక్కడ ఉన్నదీ తెలియని స్థితిని కళ్ళు తిరగడంగా చెప్పవచ్చు. ఇవన్నీ తాత్కాలికమైన అనుభూతులు. కొంత సేపు కలవరపెట్టి సర్దుకుంటాయి. కానీ ఇదే విధంగా ప్రతిరోజూ జరిగితే రోజువారీ జీవనం కష్టతరంగా మొదలౌతుంది.
కళ్లు/తల తిరుగుతున్నా రోజువారీ పనులు తప్పవు. లేచి పనులు చేసుకోవాల్సిన పరిస్థితిలో పడిపోతే? తలకో, ఎక్కడో తగలరాని చోట దెబ్బ తగిలితే? ఇవి కేవలం భయాలు, అపోహలు మాత్రమే కాదు. అలా జరగడానికి ఎంతో ఆస్కారముంది. సమస్య ఉన్నవారే కాదు లేని వారు కూడా ఈ విషయం గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.

ఈ విధమైన స్థితికి కారణాలు?
అలసట-ఒత్తిడి-నిద్రలేమి. ఈ మూడూ ఒకటిని ఇంకొకటి ప్రేరేపిస్తుంది. ఈ మూడు స్థితులు కూడా చెవి లోపలి భాగంలో ఉండే వెస్టిబ్యూలార్‌ సిస్టం అనబడే ఒక సున్నితమైన భాగాన్ని ప్రభావితం చేస్తాయి. వెస్టిబ్యూలార్‌ సిస్టం, ఇంద్రియాల నుండి మెదడుకు వచ్చే సూచికలను బట్టి, శరీర సంతులతను నియంత్రిస్తుంది. దీర్ఘ కాల ఒత్తిడి, నిద్రలేమి, నిద్రలో శ్వాస కష్టమవ్వడం వంటి సమస్యలు గాఢనిద్ర రానివ్వకుండా చేసి అలసటను పెంచుతాయి. దీనివల్ల అభిజ్ఞ్యా (జ్ఞ్యాపక-ఆలోచన-శ్రద్ధ-భాష), ఇంద్రియావయవాల నుండి వచ్చే ఉత్పాదకాల్ని (ఇంపుట్స్‌)గ్రహించడంలో మెదడు సామర్థ్యాలు బలహీనపడతాయి. ఇంపుట్స్‌ ఉన్నప్పటికీ గ్రహింపు తగ్గినందున వెస్బులర్‌ సిస్టం పనితీరు తగ్గిపోయి, పైన పేర్కొన్న సూచికలు మొదలౌతాయి.

రక్త ప్రసరణపై ప్రభావం
సామాన్యంగా ప్రతి వ్యక్తికీ, రోజూ సగటున ఆరు-ఏడు గంటల నిరంతర నిద్ర అవసరముంటుంది. సరైన నిద్ర లేకపోవడం, రాత్రి ఎక్కువ సేపు పనిచేయడం/చాలా ఆలస్యంగా పడుకొని పనుల వత్తిడితో మళ్ళీ పొద్దున్నే లేవడం, ఇలా నిత్యం చేసే వారిలో ఈ సమస్య తలెత్తవచ్చు. వీటన్నిటి పర్యవసానంగా శరీరం సమతుల్యత కోల్పోయి, పడుకొని లేచి నిలబడినా, నిటారుగా కూర్చున్నా, వంగినా, తల అకస్మాత్తుగా తిప్పినా పైన పేర్కొన్న ఇబ్బందులు కలుగుతాయి.
రెండవది.. నిర్జలీకరణం (డీహైడ్రేషన్‌). శరీరంలో సరిపడు నీరు ఉండకపోవడం. రోజుకు కనీసం మూడు లీటర్ల నీరు తాగాలి. శరీరంలో నీటి స్థాయిలు తగినంతగా లేనప్పుడు రక్త ప్రసరణపై ప్రభావం పడుతుంది. రక్త పరిమాణం తగ్గి, రక్తపోటు కూడా తగ్గుతుంది. రక్తపోటు ప్రభావం పడుకుని ఉన్నప్పుడు తెలియకపోవచ్చు. లేచి కూర్చున్నప్పుడు, మెదడుకు రక్త ప్రసరణ సరిగా జరగకపోవడంతో కళ్ళు తిరిగినట్టుగా ఉంటుంది. దీనిని ఆంగ్లంలో ఆర్థోస్టాటిక్‌ హైపోటెన్షన్‌ అని అంటారు.

మరిన్ని కారణాలు…
పడుకొని ఉన్నప్పుడు రక్తపోటు తక్కువగా ఉంటుంది. అకస్మాత్తుగా లేచినప్పుడు అది ఇంకా పడిపోయే అవకాశముంటుంది. అధిక రక్తపోటుకు మందులు వాడుతున్న వారిలో కూడా ఆకస్మికంగా రక్తపోటు పడిపోవచ్చు. ప్రొద్దున లేవగానే తలతిరగవచ్చు. చెవికి సంబంధించిన వెస్టిబ్యూలార్‌ సిస్టం సమస్యే కాకుండా వెర్టిగో, మెనియర్స్‌ డిసీస్‌ వంటి ఇతర వ్యాధులు, మైగ్రేన్‌, అనియంత్రిత మధుమేహం-శరీరంలోని రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువైనప్పుడు పడిపోయినప్పుడు, అధిక రక్త పోటుకు వాడే కొన్ని మందులు, కొన్ని రకాల డైయూరేటిక్స్‌, అంటి డిప్రెస్సంట్స్‌, అంటి ఎపిలెప్సీ, కొన్ని రకాల ఆంటీబయోటిక్స్‌, నిద్రకోసం వాడే సేడేటివ్స్‌, పెయిన్‌ కిల్లర్స్‌, డయాబెటిస్‌ మందులు-వీటి వల్ల కూడా పొద్దున్నే కళ్ళుతిరగవచ్చు. రక్తహీనత కూడా ఒక ముఖ్యమైన కారణం. మనం పీల్చే గాలిలోని జీవ వాయువైన ఆక్సిజన్‌, రక్తంలోని ఎర్రకణాల ద్వారా శరీరంలోని అన్ని కణాలకు చేతుతుంది. రక్తహీనత వల్ల ఈ ప్రక్రియ కుంటుపడుతుంది. ముఖ్యంగా మెదడుకు ఆక్సిజన్‌ సరఫరా తగ్గిపోతుంది.

తగ్గాలంటే ఏం చేయాలి?
సాధారణంగా ఈ సమస్యకి ఒకొక్కరిలో ఒకొక్క కారణం ఉంటుంది. వాటిని గుర్తించి, తగిన జాగ్రత్తలు పాటించాలి. రోజుకు ఆరేడుగంటలు నిరంతరంగా నిద్ర పోవాలి. మెలుకువ రాగానే వెంటనే లేచి నిలబడ కూడదు. ఒక ప్రక్కకు తిరిగి సావధానంగా లేచి నిలబడాలి. ఇది చాలా నిదానంగా, సమయం తీసుకుంటూ చేయాలి. ఆ విధంగా చేయడం వల్ల శరీర సంతులత నియంత్రణలో ఉంటుంది. తగినంత నీరు తాగాలి. అశ్రద్ధ చూపకూడదు. కనీసం మూడు లీటర్ల మంచినీరు తీసుకోవాలి. కాలానుసారంగా పెంచవలసిన అవసరం పడవచ్చు. సమతుల్యమైన ఆహారం తీసుకోవాలి. సాధారణంగా ఐరన్‌ లోపంతో ఏర్పడే రక్తహీనత ఉన్నవారికి తల తిరిగే సమస్య కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఐరన్‌ అధికంగా ఉండే ఆకుకూరలు, బాదం మొదలైనవి తీసుకోవడం ద్వారా ఈ సమస్యను తగ్గించవచ్చు.

అలవాట్లు మార్చుకుంటే…
ఒకేసారి ఎక్కువ మోతాదులో తినకూడదు. చాలామందికి ముఖ్యంగా శారీరిక శ్రమ ఎక్కువగా చేసేవారికి, రోజుకు మూడుసార్లు భోజనమే చేయడం అలవాటుగా ఉంటుంది. ఇలా మూడుపూటలూ అన్నం తినడంతో రక్తంలో చక్కెర స్థాయి ఒక్కసారిగా పెరిగి, కళ్ళు తిరగడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ విధంగా తినడం అలవాటైనవారిలో భోజనం ఒక పూట తప్పినా/ఆలస్యమైనా కళ్ళు తిరుగు తాయి. ఒత్తిడి, ఆందోళన తగ్గించుకోవడం ద్వారా తల తిరగడాన్ని నివారించవచ్చు. ప్రతీరోజూ నడకో, జిమ్ములోనో ముప్ఫై నుండి నలభై నిమిషాల పాటు వ్యాయామం చేయడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉండడం తో పాటు తల తిరగడం కూడా తగ్గుతుంది. నిత్య యోగా, ధ్యానం, ప్రాణాయామం వంటివి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

చికిత్స?
ఒత్తిడిని తగ్గించుకొని అలసటకులోను కాకుండా సేదతీర్చే నిద్ర-మానసిక- శారీరిక ఉల్లాసాన్నీ పొందే విధంగా జీవన శైలి అలవర్చుకోవాలి. ఇవన్నీ సమకూర్చుకున్న తర్వాత కూడా ప్రొద్దున్నే కళ్ళు తిరగడం తగ్గకపోతే వైద్య నిపుణులను సంప్రదించాలి.

  • డా|| మీరా, ఎం.డి. రిటైర్డ్‌ ప్రొఫెసర్‌, ఉస్మానియా మెడికల్‌ కాలేజ్‌
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -