నీళ్లు, నిధులు, నియామకాల కోసం, స్థానికత పునాదులపై జరిగిన పోరాటాల ఫలితంగా ఏర్పడ్డది ప్రత్యేక తెలంగాణ. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత పరిపాలన సౌలభ్యం, సామాజిక అభివృద్ధి. గ్రామీణ, పట్టణ ప్రాంతాల సమతుల్యత పేరుతో నూతన జిల్లాల ఏర్పాటు జరిగింది. అభివృద్ధి కాంక్షతో ఏర్పడ్డ నూతన జిల్లాల ఏర్పాటే కొంతమంది ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలకు శాపమైంది.నూతన జిల్లాల ప్రకారం ఉద్యోగ, ఉపాధ్యాయులను కొత్త జిల్లాలకు సర్దుబాటు చేసే ప్రక్రియలో భాగంగా కేంద్ర ప్రభుత్వం (ఆర్గనైజేషన్ ఆఫ్ లోకల్ కేడర్ అండ్ రేగ్యులేషన్ ఆఫ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్) రాష్ట్రపతి ఉత్తర్వులిచ్చింది.
దీని ప్రకారం నాటి రాష్ట్ర ప్రభుత్వం 2018లో 124జీవో ఇచ్చి 2022 వరకు అమలు చేయలేదు. ఆగమేఘాల మీద జీవో 317తో స్థానికతకు పాతరేసింది. సీనియార్టీని పరిగణనలోకి తీసుకుని నూతన జిల్లాల వారిగా ఉద్యోగ, ఉపాధ్యాయులను విభజించింది. ఈ ప్రక్రియలో భాగంగా అభివృద్ధి చెందిన జిల్లా కేంద్ర ప్రాంతాలు సీనియర్లకే దక్కడంతో జూనియర్లంతా కొత్తజిల్లాల్లోని సుదూర ప్రాంతాలకు బదిలీ చేయబడ్డారు. దీంతో చాలామంది ఉద్యోగ,ఉపాధ్యాయులు వారి స్థానిక జిల్లాను కోల్పోయి పక్కజిల్లాలో పరాయివారయ్యారు. ప్రతి రోజు వందల కిలోమీటర్ల ప్రయాణంతో విధులు నిర్వహిస్తూ నరకయాతన అనుభవిస్తున్నారు.
317 జీవో పరిణామాలు
స్థానికతను కోల్పోయిన ఉద్యోగ, ఉపాధ్యాయులు రోడ్లపైకొచ్చి వివిధ రూపాల్లో ఆందోళనలు నిర్వహిస్తే నాటి పాలకులు ‘ఒక మంచిపని జరిగినప్పుడు కొద్దిమందికి అన్యాయం జరుగుతుంది’ అని మాట్లాడారు. ఈ కొద్ది మందికి కూడా అన్యాయం ఎందుకు జరగాలనేది ప్రశ్న? ఉమ్మడి రాష్ట్రం నుండి తెలంగాణ ఏర్పాటు జరిగినప్పుడు జరిగిన ఐఏఎస్‌ల విభజనలో ఆంధ్రా ప్రాంతానికి కేటాయించబడిన అధికారులు క్యాట్‌ను ఆశ్రయించి, కోర్టులకెక్కి తిరిగి తెలంగాణ ప్రాంతానికి వచ్చారు. ఐఏఎస్‌లకు ఒక న్యాయం, చిన్నస్థాయి ఉద్యోగులకు ఒక న్యాయమా? స్థానికత కోసం జరుగుతున్న ఆందోళనలను దృష్టిలో పెట్టుకొని నాటి ప్రభుత్వం నష్టపోయిన ఉద్యోగ,ఉపాధ్యాయులకు అనుకూలంగా 2022లో మ్యూచువల్ బదిలీలకు జీవో 21ని విడుదల చేసింది. దీని మూలంగా అప్పుడు లక్షల రూపాయలు చేతులు మారి డబ్బులున్న వారికే అవకాశాలు దొరికినట్టు ఆరోపణలు.
పైగా సమస్య పూర్తిగా పరిష్కారానికి నోచుకోలేదు. నష్టపోయిన ఉద్యోగ,ఉపాధ్యాయులు చేసే పోరాటంలో అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న నేటి ముఖ్యమంత్రి గాంధీభవన్ సాక్షిగా ‘మేం అధికారంలోకి వస్తే 48 గంటల్లో సమస్యను పరిష్కరిస్తామని’ చెప్పారు. నేటి మంత్రులు సైతం స్థానికత కోసం జరిగిన సభలు, సమావేశాల్లో పాల్గొని మద్దతిచ్చారు. నూతన ప్రభుత్వం ఏర్పడితే సమస్య తీరుతుందని ఆశతో ఉద్యోగులందరూ ఒకేతాటిపైకి వచ్చి కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొచ్చారు. ప్రభుత్వం చెప్పినట్టు కేబినేట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఏడాదికాలంలో పలు దఫాలుగా చర్చలు జరిపి 2025లో యూవో(ఖ.ఉ) నోట్ ఇచ్చింది. దీనిప్రకారం కేవలం స్థానభ్రంశం చెందిన వారికి మాత్రమే స్థానిక జిల్లాలకు వెళ్లే వెసులుబాటును కల్పిస్తామని అర్థం.
దీంతో బాధిత ఉద్యోగులు మళ్లీ ఆందోళన బాటపట్టగా జీవో నంబర్ 245తో మ్యూచువల్, స్పౌజ్, మెడికల్ వారికి మాత్రం పరిష్కార మార్గం లభించింది. కానీ, అందరికీ శాశ్వత పరిష్కారం దొరకలేదు. దీంతో 317 జీవో బాధిత రాష్ట్ర నాయకత్వం చేసిన పోరాటాల ఫలితంగా శాసనమండలిలో 317జీవో స్థానికతపై పెద్దఎత్తున చర్చ జరిగింది. ఈ సందర్భంగా ‘స్థానికత అనే అంశం రాష్ట్రపతి ఉత్తర్వులకు సంబంధించిన కేంద్ర పరిధి లోనిది. ఇందులో మార్పులు తీసుకొస్తే గాని సమస్యను పూర్తిగా పరిష్కరించుకోలేం. దాని కోసం కేంద్రానికి లేఖ రాస్తామని’ మండలిలో మంత్రి శ్రీధర్‌బాబు చెప్పారు. ఇది కేంద్రం కోర్టులోకి పంపితే సమస్య పరిష్కారానికి అధిక సమయం తీసుకుంటుందని చర్చలో పాల్గొన్న మండలిలోని గౌరవ సభ్యులు అంటే, ఎక్కువ సమయం పట్టకుండా రెండు మూడు నెలల్లోనే కేంద్రం నుండి సమాధానం వచ్చేవిధంగా మన కేంద్ర మంత్రుల ద్వారా ఒత్తిడి తీసుకొద్దామని సదరు మంత్రి హామీ నిచ్చారు. ఈ మాట చెప్పి నేటికి ఏడాదికి ఎక్కువే అవుతుంది. అయినా రాష్ట్ర ప్రభు త్వం కేంద్రానికి ఒక్క లేఖ కూడా రాయకపోవడం శోచనీయం.
స్థానికతకు కొలమానమేది?
ప్రభుత్వం 317 జీవో బాధితులకు శాశ్వత పరిష్కారం చూపించకపోగా వారిని విభజించింది. ఈ ఏడాది జీవో నంబర్ 190 తో కేవలం జిల్లా మారిన వారికి మాత్రమే వెసులుబాటు కల్పిస్తూ తాత్కాలిక అంతర్‌జిల్లా డిప్యుటేషన్ (బదిలీలు) జరపాలని చెప్పింది. 317 జీవో మూలంగా జిల్లా మారిన వారు మాత్రమే అర్హులని వారికి మాత్రమే అనుకూలంగా జీవో ఇచ్చింది. ఈ జీవో రాకముందే స్థానికేతర ప్రాంతంలో పనిచేస్తున్నవారు,ఈ జీవో వచ్చినప్పుడు ప్రమోషన్ లేకుండా, అమలు తర్వాత వచ్చిన వారు కూడా అనర్హులే అని పేర్కొన్నది. దీని ద్వారా న్యాయం కొద్దిమందికే జరుగుతుంది.
స్థానికతను నిర్ధారించేది 317జీవో అమలైన కాలమా? లేక పనిచేసిన ప్రాంతమా? లేక పుట్టి,పెరిగి,చదివిన ప్రాంతమా? జీవో అమలప్పుడు ఎక్కడ పనిచేస్తున్నారో, ఆ ప్రాంతాన్ని బట్టి స్థానికతను నిర్ధారించడం, ఇదెక్కడి న్యాయం? అయితే వివిధ కారణాల మూలంగా ఉమ్మడి జిల్లా ప్రాంతంలో(స్థానికేతర జిల్లాలో) ఈ జీవో రావడానికి ముందునుండి పనిచేస్తూ, అప్పుడు జరిగిన బదిలీల్లో స్వంత జిల్లా ప్రాంతానికి(స్థానిక జిల్లా) రావాడానికి అవకాశం దొరక్క అక్కడే ఉన్నవారు స్థానికతకు అర్హులెందుకు కాదో అంతు చిక్కని ప్రశ్నే? ఇలాంటి అన్ని అంశాల చిక్కు ముడుల్ని విపాల్సింది ప్రభుత్వమే. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నికల మేనిఫెస్టోలో హామీనిచ్చిన విధంగా 317జీవో స్థానికత సమస్యను పరిష్కరించాలి. స్థానికత కోల్పోయిన ప్రతి ఒక్కరికీ న్యాయం చేయాలి. చదివిన ప్రాంతాన్ని ఆధారంగా చేసుకుని, స్థానికతను నిర్ధారించి బాధితుల్ని సొంత జిల్లాలకు కేటాయించాలి.
అనంగారి అనిల్