సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటయోధుడు శ్రీరామయ్య మృతదేహానికి నివాళులు
నవతెలంగాణ-నేరేడుచర్ల
కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని ఆచరణలో పెట్టి, ఆశయాల సాధన కోసం తుదిశ్వాస వరకు పోరాడిన గొప్ప నాయకుడు అరిబండి శ్రీరామయ్య అని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ అన్నారు. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలంలోని మేడారం గ్రామంలో అరిబండి శ్రీరామయ్య మృతదేహాన్ని సందర్శించి పూలమాలలేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడి, సీపీఐ(ఎం)లో అంచలంచెలుగా ఎదుగుతూ గ్రామంలోని యువతను ఒక్కతాటిపై నిలిపి పార్టీని పటిష్టపరిచారని తెలిపారు. ప్రజలకు అండగా ఉంటూ రాజకీయ నాయకుడిగా, ప్రజాప్రతినిధిగా, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో పాల్గొన్న వ్యక్తిగా ప్రజాసేవ చేశారని కొనియాడారు.
భూమికోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం జరిగిన తెలంగాణ సాయుధ రైతాంగపోరాటంలో పాల్గొన్న అరిబండి శ్రీరామయ్య జీవితం నేటి కమ్యూనిస్టులకు స్ఫూర్తిదాయకమన్నారు.
దేశంలో పేద, ధనిక వ్యత్యాసం లేకుండా కులమతాల అసమానతలు లేని.. స్త్రీ పురుష భేషజాలం లేని.. సమసమాజ రాజ్యం ఉండాలనే సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్లే విధానంలో ఆయన కృషి చేశారన్నారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, మల్లు లక్ష్మి మాట్లాడుతూ.. నిజాం రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడిన గొప్ప వ్యక్తి అరిబండి శ్రీరామయ్య అని, వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొన్నారని తెలిపారు. ఆయన మరణం ఈ ప్రాంత కమ్యూనిస్టు ఉద్యమానికి తీరని లోటన్నారు. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా, ఎన్నో నిర్బంధాలు ఎదుర్కొని ప్రజల కోసం పనిచేశారని, పార్టీని ముందుకు నడిపించారని చెప్పారు.
సర్పంచ్‌గా, ఎంపీటీసీగా, వైస్‌ఎంపీపీగా అనేక పదవుల్లో పని చేశారని, ఆయన జీవితాంతం ఎన్నో త్యాగాలు చేశారని తెలిపారు. నివాళలర్పించిన వారిలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పారేపల్లి శేఖర్‌రావు, జిల్లా కమిటీ సభ్యులు కొదమగుండ్ల నగేష్, కందగట్ల అనంత ప్రకాష్, ధనియాకుల శ్రీకాంత్ వర్మ, పల్లా వెంకటరెడ్డి, నేరేడుచర్ల మండల కార్యదర్శి సిరికొండ శ్రీను, హుజూర్‌నగర్ మండల కార్యదర్శి పోషనబోయిన హుస్సేన్, కెేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు మర్రి నాగేశ్వరరావు, సీపీఐ(ఎం) నాయకులు కట్ట మధుబాబు, మామిడి నాగసైదులు, అలవాల శ్రీధర్, నందమూరి బాబురావు, బొప్పన రాణమ్మ, మామిడి జానకి రాములు, నీలా రామ్మూర్తి, ఎస్‌కె.ఆఫీజ్, ముషం నరసింహ, పాతూరి శ్రీనివాసరావు, దిద్దకుంట్ల పురుషోత్తంరెడ్డి, దోరేపల్లి వెంకటేశ్వర్లు, రమేష్ ఉన్నారు.



