Friday, August 22, 2025
E-PAPER
spot_img
Homeఎడిట్ పేజిశ్రమతో ఆర్జించేవారిదే 'అర్జక్‌ సంఘ్‌': రామ్‌ స్వరూప్‌ వర్మ

శ్రమతో ఆర్జించేవారిదే ‘అర్జక్‌ సంఘ్‌’: రామ్‌ స్వరూప్‌ వర్మ

- Advertisement -

దేశంలోని ఉత్తర దక్షిణ రాష్ట్రాలను నిశితంగా పరిశీలిస్తే- దక్షిణాది రాష్ట్రాల్లో విద్యావంతులు ఎక్కువ. పెరియార్‌, గోరా, కందుకూరి, త్రిపురనేని, కోవూర్‌ వంటి వారి కృషితో దక్షిణాన చైతన్యమెక్కువ. హేతువాదులెక్కువ. నిజమే! కానీ ఉత్తర భారతదేశంలోని రాష్ట్రాల నుంచి కూడా కొంతమంది సంఘ సంస్కర్తలు, హేతువాదులు, బౌద్ధ అనుయాయులు వచ్చారు. వారు చేయగలిగినంత చేశారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో జనాన్ని చైతన్యవంతుల్ని చేశారు. అయినా కూడా వారి ప్రభావం ఏమాత్రం లేకుండా జనాన్ని మూఢత్వంలో ముంచి, దౌర్జ న్యాలు చేస్తూ అక్రమమార్గంలో అధికార పీఠాలు ఆక్రమించిన వారిని మనం ఇటీవల చూస్తున్నాం. ముందుతరాలు చేసిన కృషిని, త్యాగాల్ని మట్టిలో కలిపి జనాన్ని ఆవు పేడ,ఆవు మూత్రం దగ్గర ఆపేస్తున్న వారిని, జైశ్రీరామ్‌ నినాదంతో దేశపౌరుల్ని మూడు వేల ఏండ్ల నాటి అనాగరిక ప్రపంచంలోకి నెట్టేస్తున్న వారిని చూస్తూనే ఉన్నాం!

ఒకప్పుడు ఉత్తరప్రదేశ్‌ నుండే రామ్‌ స్వరూప్‌ వర్మ, లలైసింగ్‌ యాదవ్‌లు వచ్చారు. బీహార్‌ నుండి బాబు జగదేవ్‌ ప్రసాద్‌ వచ్చాడు. బ్రాహ్మణిజం ఆధిపత్యాన్ని తగ్గించడానికి, బహుజనులు అధికారం చేపట్టడానికి కావల్సిన నేపథ్యాన్ని వారు సమకూర్చారు. రామ్‌ స్వరూప్‌ వర్మ, బాబు జగదేవ్‌ ప్రసాద్‌లు స్వయంగా రాజకీయాల్లోకి దూకి, ఆయా రాష్ట్రాల్లో మంత్రులుగా కొంతకాలం పరిపాలన సాగించారు కూడా! వీరిలో రామ్‌ స్వరూప్‌ వర్మది ప్రత్యేకమైన కృషి, జన్మ, పునర్జన్మ, ఆత్మ, పరమాత్మ, కర్మఫలితం వంటి కల్పించిన మాటలతో, తప్పుడు సిద్ధాంతాలతో జనాన్ని భయానికి గురిచేసి, లేని దేవుణ్ణి ప్రతిష్టాపించి, వారు చెప్పిన మాటలన్నీ భగవంతుడు చెప్పాడని బొంకుతూ, కష్టపడకుండా దోచుకుతింటున్న బ్రాహ్మణ ఆధిపత్యాన్ని నిర్ద్వందంగా నిరసించిన వాడు రామ్‌ స్వరూప్‌ వర్మ. మనుస్మృతిని చీల్చి చెండాడుతూ పుస్తకాలు రాసి, రామ్‌ చరితమానస్‌ (రామాయణాన్ని) బహిరంగంగా తగులబెట్టి, తన ఆలోచనలకు ఉద్దమ రూపమిచ్చిన క్రియాశీలి. ఇప్పటిదాకా మానవుడి కేంద్రంగానే విషయాలన్నీ వెలుగులోకి వచ్చాయని, ఇక ముందు కూడా అలాగే జరుగుతుందనీ – దేనిలోనూ ఏ శక్తి ఏమహత్తూ లేదని, ఏ మతమూ ఏ దేవుడూ లేడని కరాఖండిగా చెప్పి, కష్ట జీవుల పక్షాన నిలిచిన మేధావి, మానవవాది రామ్‌ స్వరూప్‌ వర్మ.

కులాల్ని, వర్గాల్ని, వర్ణాల్ని, మతాల్ని అందులోని శాఖల్ని త్యజించి అన్నింటికీ అతీతంగా మానవీయ విలువల్ని నిలుపడం కోసం ఒక ప్రత్యేకమైన సంఘాన్ని ఏర్పాటు చేశాడు రామ్‌ స్వరూప్‌ వర్మ. దాని పేరు అర్జక్‌ సంఘ్‌ – అంటే శారీరక శ్రమతో మాత్రమే డబ్బు జీవనం సాగించే వారి సంఘం. శారీరక శ్రమ సౌందర్యానికి అత్యున్నతమైన గౌరవమిచ్చే సంఘం. వర్ణ వ్యవస్థను కాలరాసి, వైజ్ఞానిక అవగాహనతో జన్యు శాస్త్రం రుజువు పరిచిన – ”మనుషులంతా ఒక్కటే”నన్న భావనతో అందరినీ కలుపుకుపోయే సంఘం – అర్జక్‌ సంఫ్‌ు ! అర్జక్‌- అంటే ఆర్జించేవాడు. కూర్చుని దొంగ మాటలు చెప్పి, డబ్బులాగేవారు కూడా ఆర్జిస్తున్నారు కదా? – అంటే.. వారు ఈ సంఘంలో సభ్యులు కారు. ఎంతటి మేధావి అయినా, ఎంత గొప్ప ప్రణాళికలు రూపొందించినా – అవి వాస్తవ రూపం దాల్చాలంటే శ్రమశక్తి తోడు కావాల్సిందే! ఆలోచనలు ఆలోచనలుగా ఉంటే లాభం ఉండదు. అవి వాస్తవ రూపాలు సంతరించుకుంటేనే సమాజానికి ఉపయోగం! అందువల్ల, అర్జక సంఘంలో కప్పపడి, చమటోడ్చి పనిచేసే కర్షక, కార్మిక వర్గాల వారికే ప్రాధాన్యత ఉంటుంది. శ్రమకూ, మానవీయ విలువలకూ ప్రాధాన్యమిచ్చే ఆలోచనాపరులు కూడా ఈ సంఘంలో భాగస్వాములు కావచ్చు. అయితే, వారు తమ తమ కులమతాల్ని, ఆర్థిక స్థోమతల్ని పక్కకు నెట్టి, మానవ శ్రేయస్సు కోరుకునే స్వేచ్ఛాజీవులు కావాలి ! అన్న విషయం రామ్‌స్వరూప్‌ వర్మ తన సంఘానికి సంబంధించిన బైలాస్‌లో రాసుకున్నాడు. 1970 తొలినాళ్లలో ప్రారంభ మైన ఈ సంఘాన్ని అయిన అనుయాయులు ఈ నాటికీ క్రియాశీలంగానే ఉంచారు.ఆ సంఘం వారు అధికారికంగా నిర్వహించుకుంటున్న యూట్యూబ్‌ ఛానెల్‌ ఇప్పటికీ పనిచేస్తూనే ఉంది. హేతువాదాన్ని, శాస్త్రీయ అవగాహనను, మానవవాదాన్నీ ప్రచారం చేస్తూనే ఉంది.

రామ్‌ స్వరూప్‌ వర్మ చెప్పిన దాన్నిబట్టి – బ్రాహ్మనిజం ఒక చెట్టు లాంటిది. పునర్జన్మ దాని తల్లి వేరు. మనిషి చేతిలో ఏమీ లేదు. అంతా విధిరాత అని ప్రగాఢంగా నమ్మే ఆలోచనా ధోరణి ఆ చెట్టు కాండమైతే, వర్ణవ్యవస్థ ఆ వృక్షానికున్న శాఖలు. దానిమీదే కులం ఆకులుగా మొలుస్తాయి. అగ్రవర్ణం, నిమ్నవర్గం లాగా కొన్ని పుష్పాలు వృక్షం అగ్రభాగాన పూస్తే, కొన్ని పువ్వులు కింది భాగంలో అంచెలంచెలుగా పూస్తాయి. శ్రమదోపిడే ఈ వృక్షపు ఫలాలు! భారత దేశంలో శతాబ్దాలుగా వేళ్లూనుకుని ఉన్న బ్రాహ్మ ణిజపు స్వభావాన్ని రామ్‌ స్వరూప్‌ వర్మ సంకేతాత్మకంగా, సందేశాత్మకంగా ఇలా వర్ణించి చెప్పాడు. వైజ్ఞానిక అవగాహనతో సమాజాన్ని అవలోకించే వారికి వర్మ వర్ణన బాగా నచ్చుతుంది. ఇది మాత్రమేగాక, ఆయన మరొక విషయం కూడా నిర్మొహమాటంగా చెప్పాడు. మనకు కొందరు సంఘ సంస్కర్తలుంటారు. వారు ఆకులు, పూలు – పండ్లు పీకేద్దామని ప్రయత్నిస్తుంటారు. దానివల్ల ఫలితం ఉండదు కదా? ఆకులు మళ్లీ మొలుస్తుంటాయి. పూలు మళ్లీ పూస్తుంటాయి. శ్రమదోపిడీ ఫలాలు కాస్తూనే ఉంటాయి. మరి ఎలాగా? అంటే… వేళ్లతో సహా ఆ వృక్షాన్ని ఊడ బెరికితేగాని, లేదా నరికితే గాని సమసమాజ స్థాపన జరగదు!

రామ్‌ స్వరూప్‌ వర్మ (22 ఆగష్టు 1923-19 ఆగష్టు 1998) యు.పి, కాన్పూర్‌ జిల్లా, గౌరి కరన్‌ గ్రామంలో కుర్మి జాతి వ్యవసాయ కుటుంబంలో పుట్టాడు. తండ్రి వంళ్‌గోపాల్‌, తల్లి సుఖీయా. విద్యార్థి దశలోనే వర్మకు సియాందులారే అనే అమ్మాయితో పెద్దలు పెండ్లి చేశారు. ఆ అమ్మాయి రెండేళ్లకే చనిపోయింది. వర్మ మళ్లీ పెండ్లి చేసుకోలేదు. తనను తాను బహుజన ఉద్యమకారుడిగా, రాజకీయ నాయ కుడిగా, మానవవాదిగా, రచయితగా, తత్త్వవేత్తగా తీర్చిదిద్దుకుంటూ, సమాజానికి దిశా నిర్దేశం చేస్తూ ముందుకుసాగాడు. యం.ఎ, ఎల్‌ఎల్‌బి డిగ్రీలు తీసుకున్నా లాయర్‌గా ప్రాక్టీసు చేయలేదు. ఐ.ఎ.యస్‌ పరీక్ష ఉత్తీర్ణుడై ఉండి కూడా ఇంటర్వ్యూకు పోలేదు. స్వేచ్ఛగా జన జీవితంతో మమేకమై పని చేయాలనుకున్నాడు కాబట్టి, తొందరపడి ఏ ఉన్నతోద్యోగంలోనో చేరిపోలేదు. తర్వాత కొంతకాలానికి ఆచార్య నరేంద్రదేవ్‌ తోనూ, డా.రామ్‌మనోహర్‌ లోహియాతోనూ పరిచయాలు పెరిగి, సోషలిస్ట్‌ పార్టీ సభ్యుడయ్యాడు. ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీకి పలుమార్లు ఎన్ని కయ్యాడు. చరణ్‌ సింగ్‌ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో 1967లో ఆయన మంత్రి వర్గంలో ఆర్థిక మంత్రి అయ్యాడు. అప్పటికి ఆయనకు ఒక విషయం పూర్తిగా అర్థమైంది. ‘సామాజిక, సాంస్కృతిక రంగాల్లో సమానత్వం సాధించకుండా రాజకీయ, ఆర్థిక సమానత్వం’ సాధించడం కుదరదని ! ఫలితంగానే అర్జక్‌ సంఘ్‌ స్థాపనకు పూనుకున్నాడు –

1972లో వర్మ సోషలిస్ట్‌ పార్టీ వదిలి, తనే ‘సమాజ్‌ దళ్‌’ అనే కొత్త రాజకీయ పార్టీ ప్రారంభించాడు. దానికి అనుబంధంగా ‘అర్జక్‌ సాప్తాహిక్‌’ అనే హిందీ వార పత్రిక ప్రచురణ చేపట్టాడు. అదే సమయంలో బీహార్‌లో బాబు జగదేవ్‌ ప్రసాద్‌ సోషలిస్ట్‌ పార్టీ వదిలి ‘శోషిత్‌ దళ్‌’ పేరుతో కొత్త పార్టీనీ, అనుబంధంగా ‘శోషిత్‌ సాప్తాహిక్‌’ హిందీ వారపత్రికను ప్రారంభించారు. ఈ ఇద్దరి ఆలోచను, వారు ప్రచురిస్తున్న పత్రికల కథనాలు, చేపట్టిన కార్యక్రమాలు ఒకే విధంగా ఉండడంతో 1972లో ఇద్దరూ కలిసి పోయారు. ఇద్దరూ కలిసి- సంయుక్తంగా ”శోషిత్‌ సమాజ్‌ దళ్‌ ” పేరుతో పార్టీ ప్రారంభించారు. దానికి రామ్‌ స్వరూప్‌ వర్మ చైర్‌ పర్సన్‌గా, జగదేవ్‌ ప్రసాద్‌ కార్యదర్శిగా పని చేయనారంభించారు.

రామ్‌ స్వరూప్‌ వర్మ రచనలన్నీ హిందీలో ప్రకటించాడు. అందులో ”మానవ వాది ప్రశ్నోత్తరి”, ”మానవవాద్‌ వర్సెస్‌ బ్రాహ్మణ్‌ వాద్‌”, ”మనుస్మృతి- రాష్ట్ర్‌ కళంక్‌”, ”నిరాదర్‌ కైసే మిటే”, ”అచూ తోంకి సమస్యా -అవుర్‌ సమాధాన్‌’, ”ఆర్జక్‌ సంఫ్‌ు సిద్ధాంత్‌ – కర్తవ్య విధాన్‌-కార్యక్రమ్‌” వంటి శీర్షికలతో చాలా పుస్తకాలు ప్రకటించారు. 1 పుట్టుక, పెండ్లి, చావు వంటి వాటిల్లో బ్రాహ్మణ పురోహితుల ప్రమేయాన్ని పూర్తిగా తొలగించాలి. 2.ఆచారాల పేరుతో ఆర్భాటాలు ఆపేయాలి. 3.నిజాల్ని జీర్ణించుకుని వాస్తవంలో బతకాలి. 4.మొత్తానికి మొత్తంగా బ్రాహ్మణిజాన్ని తరిమికొట్టాలి 5.అంతమాత్రం చేత అగ్రవర్ణం వారిని ద్వేషించకూడదు 6.అందరినీ సమాన స్థాయి గల మనుషులుగా గౌరవించుకోవాలి- వంటి విషయాలన్నీ రామ్‌స్వరూప్‌ వర్మ తన అర్జక సంఘ బైలాస్‌లో పొందు పరిచాడు.
బుద్ధుడి ఆలోచనలకు, బోధనలకు ఆకర్షితుడైన రామ్‌ స్వరూప్‌ వర్మ, వాటిని ఆధునిక వైజ్ఞానిక కాలానికి అనుగుణంగా మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నాడు. తను అభిమానించే డా.బి.ఆర్‌. అంబేద్కర్‌ చివరి దశలో హిందూ మతం వదిలి బౌద్ధాన్ని స్వీకరించాడు. ఆయన ఇంకొంత కాలం జీవించి ఉంటే ‘నవయానం’లో అనువైన మార్పులు, చేర్పులు చేసి ఉండేవారేమోనన్నది వర్మ అభిప్రాయం. బుద్ధుడు చెప్పిన అంశాలు వైజ్ఞానిక ఆలోచనా ధోరణికి దారితీసేవిగా ఉన్నాయి. కానీ, ఆ మహనీయుడు గాని, ఆయన శిష్యులు గానీ ఒక బౌద్ధ సంస్కృ తిని అభివృద్ధి చేయలేదు. పైగా తరువాతి కాలంలో బౌద్ధం వజ్రయానం, తంత్రయానం లాగా విడిపోతూ వచ్చింది. ఆయా శాఖల వారు విగ్రహారాధనను ప్రోత్సహించారు. రామ్‌ స్వరూప్‌ వర్మకు ఆ విషయం నచ్చలేదు. అదే – బ్రాహ్మణిజంలో మతమే లేదు. కానీ, వారు తమదైన ఒక విష సంస్కృతిని జనానికి అలవాటు చేశారు. వేదాలు, పురాణాలు, కావ్యాలు, కల్పనలు, శతాబ్దాలుగా పెద్ద ఎత్తున రాసుకుంటూ వచ్చారు. అన్ని సాహితీ ప్రక్రియల్లో, అన్ని కళా ప్రక్రియల్లో తమదైన మూఢభక్తిని బలవంతంగా ఒప్పిస్తూ వచ్చారు. తామే మహోన్నతులమన్నట్లుగా, పవిత్రులమన్నట్లుగా – తమ కళల్ని ఆదరించిన వారే హృదయ సంస్కారులన్నట్లుగా జనాన్ని భ్రమింపజేశారు. ప్రతిభగల కవి, పండితులు, గాయకులు, నటులు, నాటకత్తెలు, వాయిద్యకారులు అందరికందరూ అన్యాయంగా బ్రాహ్మణిజానికి బలైపోయారు. అబద్ధాలకు మూఢత్వానికీ భజనలు చేస్తున్నామే అని ఆత్మవిమర్శ చేసుకోలేకపోయారు. ఇక అధిక సంఖ్యాకులైన సామాన్య జనం- ఆ ఒరవడిలోనే పడి కొట్టుకుపోతూ వచ్చారు. ఇప్పటికీ అలాగే కొట్టుకుపోతున్నారు.

”అలాంటి పని బౌద్ధం చేయలేకపోయింది. అందుకే బ్రాహ్మణిజానికి బలైపోయింది. వైదిక మత దౌర్జన్యాలను ఎదుర్కోలేక – బౌద్ధం, విదేశాల్లోకి వెళ్లి విస్తరించింది. కానీ, పుట్టిన తన దేశంలో అంతరించిపోయింది” – అనేది రామ్‌ స్వరూప వర్మ భావన! వైజ్ఞానిక అవగాహన, మానవవాదాల కలగలుపే తమ అర్జక్‌ సంఫ్‌ు – అని చెప్పి, ఒప్పించి, స్థిరపరిచిన వాడు రామ్‌ స్వరూపే వర్మ, భారతీయ సమాజాన్ని బ్రాహ్మ ణీయ ఆధిపత్యంలోంచి బయటపడేయడానికి తన 75 ఏండ్ల జీవిత కాలం నిరంతరం శ్రమించిన పోరాట వీరుడు. ఆయన జీవితం నేటి తరానికే కాదు, రాగల తరాల వారికి కూడా స్పూర్తిదాయకం – అనడంలో సందేహం లేదు. మనకు ఇప్పుడు మరింత మంది రామ్‌ స్వరూప్‌ వర్మలు కావల్సిన పరిస్థితులు ఉన్నాయి!
రచయిత : సుప్రసిద్ధ సాహితీ వేత్త,
విశ్రాంత బయాలజీ ప్రొఫెసర్‌.
డాక్టర్‌ దేవరాజు మహారాజు

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad