కార్ల్‌సన్, అలెగ్జాండ్రలకు టైటిల్స్
ప్రపంచ ర్యాపిడ్ చాంపియన్‌షిప్స్
దోహా (ఖతార్) : ఫిడె ప్రపంచ ర్యాపిడ్ చెస్ చాంపియన్‌షిప్స్‌లో భారత గ్రాండ్‌మాస్టర్లు కంచు మోత మోగించారు. ఓపెన్ విభాగంలో తెలంగాణ తేజం అర్జున్ ఎరిగేశి, మహిళల విభాగంలో తెలుగమ్మాయి కోనేరు హంపి కాంస్య పతకాలు సాధించారు. ఓపెన విభాగంలో 9.5 పాయింట్లతో అర్జున్ ఎరిగేశి మూడో స్థానంలో నిలిచాడు. నార్వే గ్రాండ్‌మాస్టర్ మాగస్ కార్ల్‌సన్ రికార్డు స్థాయిలో ఆరోసారి ప్రపంచ ర్యాపిడ్ చెస్ చాంపియన్‌గా నిలిచాడు. 10.5/13 పాయింట్లతో స్పష్టమైన ఆధిక్యం సాధించిన కార్ల్‌సన్ తిరుగులేని విజేతగా అవతరించాడు. రష్యా గ్రాండ్‌మాస్టర్ వ్లాడిస్లావ్ అర్టెమీవ్ 9.5 పాయింట్లతో అర్జున్ ఎరిగేశితో సమంగా నిలిచినా.. టైబ్రేకర్లలో మెరుగైన పాయింట్లతో రష్యన్ జీఎం సిల్వర్ మెడల్ దక్కించుకున్నాడు.
మహిళల విభాగంలో ఎన్నో నాటకీయ పరిణామాలు, ఎత్తులు పైఎత్తుల అనంతరం రష్యా గ్రాండ్‌మాస్టర్ అలెగ్జాండ్ర చాంపియన్‌గా నిలిచింది. బ్లిట్జ్ టైబ్రేకర్స్‌లో చైనా గ్రాండ్‌మాస్టర్ జు జినర్‌ను ఓడించిన అలెగ్జాండ్ర.. ర్యాపిడ్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. అలెగ్జాండ్ర, జు జినర్, కోనేరు హంపిలు 8.5 పాయింట్లతో సమవుజ్జీలుగా నిలిచారు. కానీ టైబ్రేకర్ ఫలితాల ఆధారంగా అలెగ్జాండ్ర స్వర్ణం సాధించగా.. జు జినర్ సిల్వర్ మెడల్ కైవసం చేసుకుంది. డిఫెండింగ్ చాంపియన్ కోనేరు హంపి కాంస్య పతకంతో సరిపెట్టుకుంది. భారత గ్రాండ్‌మాస్టర్లు ఆర్ వైశాలి, దివ్య దేశ్‌ముక్, ద్రోణవల్లి హారికలు వరుసగా 5, 8, 19వ స్థానాల్లో నిలిచారు. 67వ సీడ్‌గా తొలి గేమ్‌లో ఎత్తులు వేసిన బి సావిత్రి శ్రీ.. అద్భుత ఆటతీరుతో నాల్గో స్థానంలో నిలిచింది.
అర్జున్, హంపి కాంస్య వెలుగు
- Advertisement -
- Advertisement -



