ఇసుక, అటవీ వనరులపై నిర్ణయాధికారం గ్రామ సభలదే
తాగునీటి సరఫరాలో అంతరాయం ఉండకూడదు :
పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఏజెన్సీ ప్రాంతాల్లో పెసా చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని పంచాయ తీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అధికారులను ఆదేశించా రు. బుధవారం హైదరాబాద్‌లోని బీఆర్. అంబేడ్కర్ సచివాలయంలో మిషన్ భగీరథ, ఉపాధి హామీ పథకం మొదలగు అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. పెసా పరిధిలో ఉన్న 1,289 గ్రామ పంచాయతీల్లో ఆదివాసీ, గిరిజనుల హక్కులను రక్షించేందుకు అన్ని చర్యలు చేపట్టాలన్నారు. ఇసుక, అటవీ వనరుల వినియోగంపై నిర్ణయాధికారం గ్రామ సభలకే ఉండాలని స్పష్టం చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి అవగాహన పెంచాలన్నారు. జిల్లా కోఆర్డినేటర్లు, గ్రామ సభ మోబిలైజర్ల నియామకాన్ని త్వరగా పూర్తి చేయాలని సూచించారు. వేసవి నేపథ్యంలో వచ్చే రెండు, మూడు నెలలు అత్యంత కీలకమనీ, ఆ సమయంలో తాగునీటి కొరత తలెత్తకుండా మిషన్ భగీరథ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలు నీటిని వృథా చేయకుండా అవగాహన పెంచాలన్నారు. రాష్ట్రంలోని రిజర్వాయర్లలో తాగునీటి అవసరాలకు సరిపడా నిల్వలు ఉన్నాయని అధికారులు వివరించారు. కృష్ణా, గోదావరి బేసిన్ల నుంచి నీటి కేటాయింపులు కొనసాగుతున్నందున ప్రస్తుతం ఆందోళనకర పరిస్థితులు లేవని తెలిపారు.
ప్రతి రోజు నీటి సరఫరా పరిస్థితిపై నివేదికలు సమర్పించాలని ఈ సందర్భంగా అధికారులను మంత్రి ఆదేశించారు. 1916 టోల్‌ఫ్రీ నెంబర్ ద్వారా అందుతున్న ఫిర్యాదులను సమర్థవంతంగా పరిష్కరించాలన్నారు. ఉపాధి హామీ పథకంలో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయనీ, దూర ప్రాంతాల్లో నెట్‌వర్క్ సమస్యల వల్ల ఫేషియల్ రికగ్నిషన్ హాజరు నమోదు కష్టంగా మారిందని అధికారులు వివరించారు. ఈ నిబంధనలను సడలించాల్సిందిగా కేంద్రానికి లేఖ రాయనున్నట్టు మంత్రి తెలిపారు. గత మూడు నెలలుగా వేతనాలు ఆలస్యమవుతున్న నేపథ్యంలో పెండింగ్ చెల్లింపులను తక్షణమే విడుదల చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.. ఈ కార్యక్రమం లో పంచాయతీరాజ్ ప్రత్యేక కార్యదర్శి సంజయ్ కుమార్, డైరెక్టర్ దివ్య దేవరాజన్, ఈఎన్‌సీ కృపాకర్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.



