సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి
నవతెలంగాణ-సిటీబ్యూరో/నేరేడ్‌మెట్
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం.. నిజాంకు, దొరలకు, భూస్వాములకు, జమీందారులకు వ్యతిరేకంగా జరిగిన వర్గ పోరాటమని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి తెలిపారు. వీర తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవ సభను మంగళవారం సీపీఐ(ఎం) మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జి.శ్రీనివాసులు అధ్యక్షతన మంగళవారం జిల్లాలోని కాప్రా సర్కిల్ మౌలాలి హౌసింగ్ బోర్డు కాలనీలో నిర్వహించారు. ఈ సందర్భంగా జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని హిందువులకి, ముస్లింల మధ్య పోరాటంగా బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ చిత్రీకరిస్తున్నాయని విమర్శించారు. ఈ పోరాటంలో బందగీ, షోయబుల్లాఖాన్ ఇంకా అనేకమంది ముస్లిం సోదరులు పాల్గొన్నారని గుర్తు చేశారు. తెలంగాణ సాయుధ పోరాటంలో దాదాపు 4,500 మంది అమరులయ్యారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి పి.సత్యం, కార్యదర్శివర్గ సభ్యులు కోమటి రవి, నాయకులు దుర్గయ్య, వెంకటాచారి, సఫియా, సుల్తానా, గణేష్, నాయకులు సత్యనారాయణ, స్ఫూర్తి గ్రూప్ నాయకులు, కంపెనీ కార్మికులు, కాలనీ ప్రజలు పాల్గొన్నారు.
నిజాంకు చెప్పినట్టే.. మోడీకి బుద్ధి చెప్పాలి మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు
నాడు నిజాం నవాబుకు ఎలాంటి బుద్ధి చెప్పామో.. ఇప్పుడు మోడీకి అలాంటి బుద్ధే చెప్పాలని సీపీఐ(ఎం) మాజీ కేంద్ర కమిటీ సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు అన్నారు. వీరతెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల సందర్భంగా సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో మల్కాజిగిరి చౌరస్తా వద్ద గాంధీ పార్కులో బహిరంగ సభ నిర్వహించారు. పార్టీ మల్కాజిగిరి సీనియర్ నాయకులు ఎం.కృపాసాగర్ అధ్యక్షతన జరిగిన సభలో చెరుపల్లి సీతారాములు ప్రసంగించారు. నిజాం నిర్బంధాలను వ్యతిరేకిస్తూ ఆంధ్ర మహాసభ ఏర్పడి తిరుగుబాటు చేసిందని గుర్తు చేశారు. బీంరెడ్డి నరసింహారెడ్డి, రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, ఆరుట్ల రామచంద్రారెడ్డి, ఆరుట్ల కమలాదేవి, మల్లు స్వరాజ్యం తదితరులు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొన్నారని గుర్తు చేశారు. ఈ పోరాటానికి పుచ్చలపల్లి సుందరయ్య, మాకినేని బసవ పున్నయ్య, చంద్ర రాజేశ్వరరావు, మోహియుద్దీన్(ముగ్దం), దేవులపల్లి వెంకటేశ్వరరావు నాయకత్వం వహించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి సత్యం, కోమటి రవి, మాజీ కౌన్సిలర్ లీలావతి, నాయకులు గుంటి లక్ష్మణ్, విజరు కుమార్, పి.మంగ, శ్రీనివాస్, హేమలత, సుమిత్ర, వైష్ణవి, సరోజ, యాదగిరి, బాలయ్య తదితరులు పాల్గొన్నారు.