Monday, January 19, 2026
E-PAPER
Homeఆదిలాబాద్వసంత పంచమి వేడుకలకు ఏర్పాట్లు పూర్తి చేయాలి: కలెక్టర్        

వసంత పంచమి వేడుకలకు ఏర్పాట్లు పూర్తి చేయాలి: కలెక్టర్        

- Advertisement -

నవతెలంగాణ – ముధోల్ 
బాసరలో ఈనెల 23వ తేదీన నిర్వహించే వసంత పంచమి వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ బాసరలో వసంత పంచమి వేడుకలకు సంబంధించి ఏర్పాట్లపై ముధోల్ శాసనసభ్యులు పవార్ రామారావు పటేల్ తో కలిసి అధికారులతో, బాసరలోని ఆలయ కార్యనిర్వాహక అధికారి కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. వసంత పంచమి ఏర్పాట్ల వివరాలను శాఖల వారి అధికారులను అడిగి తెలుసుకున్నారు. వసంత పంచమి పండుగను పురస్కరించుకొని, బాసరకు వచ్చే భక్తులను సంఖ్యను ముందుగా అంచనా వేస్తూ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలన్నారు.

ఆలయాన్ని అందమైన పూలు, లైటింగ్ తో ముస్తాబు చేయాలని అన్నారు .భక్తుల రద్దీని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ దర్శనానికి అనుమతించాలని సూచించారు. క్యూలైన్లలో చిన్నపిల్లలకు పాలు, పండ్లను అందించాలన్నారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా త్రాగునీరు, బయోటాయిలెట్ లను ఏర్పాటు చేయాలన్నారు. దేవాలయం, గోదావరి పుష్కర ఘాట్ లలో నిరంతరం పారిశుద్ధ్య కార్యక్రమాలను కొనసాగిస్తూ పరిశుభ్రతను పాటించాలన్నారు. ఎక్కువ సంఖ్యలో చెత్తబుట్టలను ఏర్పాటు చేయాలని తెలిపారు. భక్తులకు సరిపడినంత ప్రసాదాన్ని అందుబాటులో ఉంచాలని తెలిపారు. శిశువులకు పాలిచ్చేందుకు వీలుగా బేబీ ఫీడింగ్ గదులను ఏర్పాటు చేయాలన్నారు.

ఆలయ పరిసరాలన్నీ సీసీ కెమెరాలు పర్యవేక్షణలో నిరంతరం ఉంచాలన్నారు. అంబులెన్స్, అగ్నిమాపక యంత్రాలని అందుబాటులో ఉంచి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు ఏర్పడకుండా ముందస్తు జాగ్రత్త వహించాలన్నారు. వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి, వైద్యులను, అత్యవసర మందుల్ని అందుబాటులో ఉంచాలన్నారు. హెల్ప్ డెస్క్ లను ఏర్పాటు చేయాలని తెలిపారు. పుష్కర ఘాట్, రైల్వే స్టేషన్, బస్టాండ్ ల నుండి భక్తులు ఆలయానికి సులువుగా చేరుకునే విధంగా రోడ్డు మార్గాన్ని తెలిపే విధంగా బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. ఆయా ప్రధాన ప్రాంతాల నుంచి భక్తుల రద్దీ మేరకు సరిపడినన్ని బస్సులు నడపాలన్నారు. ఆలయంలో ప్రవేశం, నిష్క్రమణ, త్రాగునీరు, మరుగుదొడ్ల వివరాలు తెలిపే విధంగా సూచన బోర్డులను ఏర్పాటు చేయాలని తెలిపారు.

పార్కింగ్, ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పోలీసు శాఖ సమన్వయంతో పటిష్ట భద్రత చర్యలు చేపట్టాలన్నారు. గోదావరి ఘాట్ ప్రాంత ప్రదేశంలో నిరంతర పారిశుద్ధ్యన్ని కొనసాగించాలన్నారు. ఎప్పటికప్పుడు బ్లీచింగ్ పౌడర్ ను చల్లాలని సూచించారు. గోదావరి నదిలో స్నానమాచరించిన స్త్రీ, పురుష భక్తులకు వేరువేరుగా దుస్తులు మార్చుకునేందుకు వీలుగా గదులను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. గోదావరి నది వద్ద గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచాలని తెలిపారు. ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ మాట్లాడుతు వసంత పంచమి పర్వదినం రోజున, సరస్వతి అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అన్నారు.

భక్తులకు ఎక్కడ కూడా ఏమాత్రం అసౌకర్యం కలగకుండా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని పేర్కొన్నారు. భక్తుల రద్దీని అంచనా వేస్తూ తగ్గట్లుగా ఏర్పాట్లను పూర్తి చేయాలని తెలిపారు. అక్షరాభ్యాస కార్యక్రమాలకు ఇబ్బందులు కలగకుండా తగినంత మంది పురోహితులను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. అనంతరం బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవి అమ్మవారిని కలెక్టర్ దర్శించుకున్నారు. ఆలయ పూజారులు కలెక్టర్ కు స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సమావేశంలో భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, దేవాలయ ఏఈవో సుదర్శన్ గౌడ్, సర్పంచ్ తీగలవెంకటేష్ గౌడ్, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -