– అనాజ్‌పూర్ రైతులకు పట్టా పాసుపుస్తకాలివ్వాలి : సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ
నవతెలంగాణ – బ్యూరో-హైదరాబాద్
రంగారెడ్డి జిల్లా అనాజ్‌పూర్ భూపోరాటం సందర్భంగా సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ, జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య, కార్యదర్శి వర్గ సభ్యులు ఇ నర్సింహా, రైతు సంఘం జిల్లా నాయకులు భాస్కర్‌రెడ్డి, స్థానిక రైతులను అక్రమంగా అరెస్టు చేయడాన్ని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. అనాజ్‌పూర్ రైతులకు పట్టా పాసుపుస్తకాలివ్వాలని డిమాండ్ చేసింది. అబ్దుల్లాపూర్‌మెట్ మండలం అనాజ్‌పూర్ రెవెన్యూ సర్వేనంబర్లు 274, 275, 276, 277, 278, 281లో 125 ఎకరాల సీలింగ్ భూమిని 125 మంది పేదలకు 1991లో అప్పటి ప్రభుత్వం అసైన్డ్ చేసిందని పేర్కొన్నది. ‘సర్టిఫికేట్లు, పట్టాదారు పాసుపుస్తకాలను జారీ చేసింది. ఆ భూములను నాటి నుండి నేటి వరకు ఈ రైతులు సాగు చేసుకుంటున్నారు.
కానీ ధరణి పోర్టల్ ఆన్‌లైన్‌లో రైతుల పేర్లు నమోదు చేయలేదు. ధరణి పాసుపుస్తకం ఇవ్వలేదు. దీంతో రైతు భరోసా, రైతుబీమా, పీఎం కిసాన్ సమ్మన్ నిధి, బ్యాంకులోన్లు రాక ఈ రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు’ని సీపీఐ(ఎం) తెలిపింది. తమకు కొత్త పాసుపుస్తకాలు ఇచ్చి న్యాయం చేయాలని బాధిత రైతులు గత ఎనిమిదేండ్లుగా అనేకసార్లు జిల్లా కలెక్టర్, ఆర్డీవో, తహశీల్దారును కలిసినా ఫలితం లేదని గుర్తు చేసింది. ఈ నేపథ్యంలో సీపీఐ(ఎం) అబ్దుల్లాపూర్‌మెట్టు మండల కమిటీ బాధిత రైతులకు అండగా నిలబడిరదని తెలిపింది. ఈ నేపథ్యంలో సోమవారం జాన్‌వెస్లీతో పాటు, బాధిత రైతులు భూమి దగ్గరకు వెళ్తుండగా పోలీసులు అడ్డుకుని వారిని అక్రమంగా అరెస్టులు చేయడం తగదని హితవు పలికింది. తక్షణమే ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని బాధిత రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేసింది. అరెస్టుచేసి పహడీషరీఫ్ పోలీస్‌స్టేషన్‌లో బంధించిన సీపీఐ(ఎం)నేతలను, రైతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేసింది. బాధిత రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు ఇచ్చి, ప్రభుత్వ పథకాలన్నీ వర్తింపజేయాలని విజ్ఞప్తి చేసింది.