నాలుగు బైకులు స్వాధీనం
మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన రూరల్ సీఐ జాన్ రెడ్డి
నవతెలంగాణ – బాల్కొండ
బైక్ దొంగతనం కేసులో ఇద్దరు దొంగలను అరెస్టు చేసినట్లు ఆర్మూర్ రూరల్ సీఐ గడ్డం జాన్ రెడ్డి తెలిపారు. మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ లో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఎస్ ఐ శైలేందర్ తో కలిసి సీఐ కేసు వివరాలను వెల్లడించారు. బాల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని బస్సా పూర్ గ్రామ శివారులో ఆదివారం ఎస్ ఐ శైలేందర్ ఆధ్వర్యంలో వాహనాలను తనిఖీ చేస్తుండగా కోటగిరి మండలం జల్లపల్లి గ్రామానికి చెందిన షేక్.ఇస్మాయిల్ ద్విచక్ర వాహనంపై అనుమానాస్పదంగా రాగా అతనిని పోలీసులు తనిఖీ చేశారు.
ఈ నేపథ్యంలో వాహనానికి సంబంధించిన పత్రాలు లేనందున ఇస్మాయిల్ ను అదుపులోకి తీసుకొని విచారించగా తన వద్ద ఉన్న వాహనం గత నెల ఆర్మూర్ లో దొంగిలించినట్టు తెలిపాడు.దాంతో పాటు మరో మూడు బైకు లు దొంగతనం చేసినట్లు పోలీసు విచారణలో తెలిపాడు. ఈ వాహనాలను ఇతరులకు అమ్మడానికి అదే గ్రామానికి చెందిన ప్రదీప్ సహకరించినట్లు ఇస్మాయిల్ తెలిపాడు. దీంతో ఎస్ఐ శైలేందర్ తన సిబ్బందితో జల్లపల్లి గ్రామానికి వెళ్లి ప్రదీప్ ను అదుపులోకి తీసుకొని అతని వద్ద మూడు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులైన ఇస్మాయిల్, ప్రదీప్ లను రిమైండ్ కి తరలించినట్లు సీఐ జాన్ రెడ్డి తెలిపారు.



