ఖాట్మాండు : నేపాల్‌లో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. గతేడాది సెప్టెంబర్‌లో జెన్‌జెడ్ నిరసనల కారణంగా తలెత్తిన అల్లర్లు, ఘర్షణల్లో నిర్లక్ష్యపూరితమైన హత్యలకు పాల్పడ్డారన్న అభియోగాలపై నేపాల్ మాజీ ప్రధాని కె.పి.శర్మ ఓలి, మాజీ హోంమంత్రి రమేష్ లేఖక్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. రాష్ట్రీయ స్వతంత్ర పార్టీకి చెందిన బాలేంద్ర షా నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఈ అరెస్టులు చోటు చేసుకున్నాయి. తాజాగా నేపాల్ మాజీ ఇంధన శాఖ మంత్రి దీపక్ ఖడ్కాను ఆదివారం అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. మనీలాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా దీపక్ ఖడ్కాను ఈ ఉదయం అరెస్ట్ చేసినట్లు సిబిఐ ప్రతినిధి మీడియాకు వెల్లడించారు. నేపాల్ మనీలాండరింగ్ దర్యాప్తు విభాగం ఈ విచారణను పర్యవేక్షిస్తోందని అన్నారు. సెప్టెంబర్ 9వ తేదీన నిరసనల సందర్భంగ ఖడ్కా నివాసం నుండి స్వాధీనం చేసుకున్న నగదుకు సంబంధించిన దర్యాప్తులో భాగంగా ఆదివారం ఉదయం ఆయనను అదుపులోకి తీసుకున్నారని కొత్త హోం వ్యవహారాల మంత్రి తన ఫేస్‌బుక్ పోస్ట్‌లో తెలిపారు.
సెప్టెంబర్ 8,9 తేదీల్లో జరిగిన నిరసనల అణచివేతలో సుమారు 76మంది మరణించినట్లు అల్లర్లపై ఏర్పాటైన విచారణ కమిషన్ పేర్కొంది. నిరసనకారులు పార్లమెంట్ భవనం సహా ప్రభుత్వ కార్యాలయాలకు నిప్పుపెట్టారు. ఖడ్కా నివాసానికి నిప్పుపెట్టడంతో పాటు ఆయన నివాసంలో దొరికిన నగదును నిరసనకారులు గాల్లోకి విసిరిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గామారిన సంగతి తెలిసిందే.
నేపాల్‌లో కొనసాగుతున్న ‘మాజీమంత్రుల’ అరెస్టులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



