Thursday, January 22, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఅహంకారం… చపలత్వం

అహంకారం… చపలత్వం

- Advertisement -

ప్రపంచానికి ప్రమాదకారిగా మారిన ట్రంప్‌
చెప్పేదొకటి…చేసేది మరొకటి
మాట వినకపోతే సుంకాల వడ్డనే
ట్రూత్‌ సోషల్‌ వేదికగా బెదిరింపులు
మిత్రదేశాలతోనూ కయ్యం

వాషింగ్టన్‌ : అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్‌ ట్రంప్‌ ఓవల్‌ కార్యాలయంలో ఎప్పుడు ప్రవేశించారో అప్పుడే దౌత్యం అనే పదం అక్కడి నుంచి అదృశ్యమైంది. ఇప్పుడు అక్కడ అహంకారం, చపలత్వం మాత్రమే కన్పిస్తున్నాయి. వెనిజులా అధ్యక్షుడు నికొలస్‌ మదురోను నిర్బంధించడం మొదలుకొని గ్రీన్‌లాండ్‌ను లక్ష్యంగా చేసుకోవడం వరకూ, వలసదారులను గొలుసులతో బంధించి దేశం నుంచి బహిష్కరించడం మొదలుకొని అంటార్కిటికాపై పన్ను విధించడం వరకూ అధికారం, ఎగతాళి మధ్య రేఖను ట్రంప్‌ చెరిపేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే ట్రంప్‌ పాలనలో ప్రతిదీ సాధ్యమే…ప్రతిదీ చట్టబద్ధమే.

పెంగ్విన్‌నూ వదలని ఘనాపాటి
ఇప్పుడు ట్రంప్‌, సుంకాలు పర్యాయపదాలు. ప్రపంచ దేశాలపై సుంకాలు విధించడాన్ని ఆయన ఎంతగానో ఇష్టపడతారు. చివరికి అంటార్కిటికాలోని పెంగ్విన్‌ పక్షులను కూడా వదిలిపెట్టలేదు. సూర్యుని చుట్టూ తనకు బదులుగా తిరుగుతున్న భూమిపై కూడా సుంకాలు విధించగల ఘనాపాటి. ఆయన ఓ ప్రమాదకరమైన నమూనాను సృష్టిస్తున్నారు. గత అధ్యక్షులకు పూర్తి భిన్నంగా ఉంటున్నారు. తనకు నోబెల్‌ బహుమతి ఇవ్వాలంటూ బహిరంగంగా ప్రచారం చేసుకున్న మొట్టమొదటి వ్యక్తి ట్రంపే. అంతేకాదు…సెకండ్‌ హ్యాండ్‌ శాంతి బహుమతిని ఆనందంతో స్వీకరించిన మొదటి వ్యక్తి కూడా ఆయనే.

ఎనిమిది యుద్ధాలను ఆపిన శాంతి ప్రదాతగా చెప్పుకుంటున్న ట్రంప్‌… ఓ దేశంపై బాంబులతో విరుచుకుపడి, దాని అధ్యక్షుడిని బంధించి, తనకు తానే అధ్యక్షుడిగా ప్రకటించుకున్నారు. జనావాసం లేని ద్వీపం అయినా సరే తాను చెప్పినట్లు వినకపోతే సుంకాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తారు. ట్రంప్‌ పాలనలో ఏదైనా సాధ్యమే. మాజీ అధ్యక్షులను హేళన చేస్తారు. దౌత్యాన్ని పూర్తిగా విస్మరిస్తారు. స్నేహితులైనా, శత్రువులైనా ఎవరినీ వదిలిపెట్టరు. ఆయనది విచిత్రమైన, వింతైన మనస్తత్వం. ఆయనకు తనపై ఆదుపే లేదు. ఏతావాతా చెప్పాలంటే ట్రంప్‌ ఓ ప్రమాదకారి.

ప్రయివేటు సంభాషణలూ షేర్‌ చేస్తారు
అధికారిక ప్రకటనలన్నింటినీ ట్రంప్‌ తన సామాజిక మాధ్యమ వేదిక ట్రూత్‌ సోషల్‌లోనే చేస్తుంటారు. ఎక్స్‌ (ఒకప్పుడు ట్విటర్‌)పై నిషేధం విధించిన మొట్టమొదటి అమెరికా అధ్యక్షుడు ఆయనే. ఆ తర్వాత సొంత దుకాణం తెరిచి దానికి ట్రూత్‌ సోషల్‌ అని పేరు పెట్టారు. తాను నిజం అనుకునే దానినే అందులో ఆయన షేర్‌ చేస్తారు. దానితో ప్రపంచ దేశాలు ఏకీభవించకపోవచ్చు. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేశానికి అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి గొంతును ఎవరూ అణచలేరు.

కాబట్టి ఎక్స్‌పై నిషేధం విధించినా ఆయన ప్రపంచంలో ఏ మూల నుంచి అయినా, ఏ వేదిక నుంచి అయినా మాట్లాడగలడు. ఆయన చెప్పే మాటలు ప్రపంచమంతటా వినిపిస్తాయి. తన సాహసోపేతమైన సోషల్‌ మీడియా పోస్టులు ప్రధాన స్రవంతి మీడియాకు ఇచ్చే ఇంటర్వ్యూల కంటే ఎక్కువగా అందరి దృష్టిని ఆకర్షిస్తాయని ఆయనకు తెలుసు. ఆయన పోస్టులు దిగ్భ్రాంతిని కలిగిస్తాయి. ఆయన దేనిపై ప్రకటన చేసినా అది ముందుగా వచ్చేది ట్రూత్‌ సోషల్‌లోనే. ఆ తర్వాతే అధికారిక ప్రకటన వెలువడుతుంది. నిజానికి ట్రంప్‌ చేసేవి ప్రకటనలు కావు. బెదిరింపులు, హెచ్చరికలు. చివరికి ప్రపంచ నేతలు తనతో జరిపిన ప్రైవేటు సంభాషణలను కూడా షేర్‌ చేస్తారు.

చర్యలు అనూహ్యం
ట్రంప్‌ ఎప్పుడేం చేస్తారో ఎవరికీ తెలీదు. ఆయన ప్రపంచ దేశాలతో ఎలా వ్యవహరిస్తారో అమెరికా విషయంలోనూ అలాగే వ్యవహరిస్తారని, అది సంప్రదాయ సనాతన పద్ధతికి భిన్నంగా ఉంటుందని విదేశాంగ మంత్రి జైశంకర్‌ ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో వ్యాఖ్యానించారు. ఆయన తదుపరి చర్యలేమిటో ఊహించడం చాలా కష్టం. ఇరాన్‌, గ్రీన్‌లాండ్‌లపై ఏదో ఒక చర్య తీసుకుంటారని అందరూ అంచనా వేస్తే ఆయన హఠాత్తుగా వెనిజులాపై విరుచుకుపడ్డారు.

అమెరికాలో నివసిస్తున్న అక్రమ వలసదారులను స్వదేశాలకు పంపుతానని హామీ ఇచ్చి వారికి సంకెళ్లు వేసి పశువుల మాదిరిగా బహిష్కరించారు. తాను బహిష్కరించిన వారిని అంగీకరించడానికి ఏ దేశమైనా నిరాకరిస్తే సుంకాలు విధిస్తారు. తన నిర్ణయాలను, ఆదేశాలను సవాలు చేస్తే ఎవరికైనా శిక్షలు, అవమానాలు తప్పవు. వలసదారులను ట్రంప్‌ నేరస్థులుగా చిత్రీకరించారు. ప్రతిఘటించిన వారిని చిత్రహింసలు పెట్టారు. అలా పాతిక లక్షల మందిని దేశం నుంచి సాగనంపారు. వేలాది మందిని నిర్బంధించారు. వలసదారులను అక్కున చేర్చుకునేందుకు నిరాకరించిన దేశాలపై ‘నేను మీతో వ్యాపారం చేయను’ అనే బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించారు.

లోపించిన హుందాతనం
ట్రంప్‌ ఓ వ్యాపారవేత్త. ఆయన ఏది చేసినా ఆ దృష్టితోనే ఉంటుంది. స్నేహాలు ఉండవు. అన్నీ వ్యాపార లావాదేవీలే. ప్రధాని నరేంద్ర మోడీని ‘మంచి స్నేహితుడు’ అని ప్రశంసిస్తారు. మరోవైపు రష్యా నుంచి చమురును కొనుగోలు చేస్తున్నందుకు అదనపు సుంకాలు వడ్డిస్తారు. ఈ విషయంలో ఎలాంటి శషభిషలు ఉండవు. ఇక మహిళల విషయంలో ఆయన ఎన్నో సందర్భాలలో అనుచిత వ్యాఖ్యలు చేశారు. వివాహిత మహిళతో లైంగిక సంబంధం పెట్టుకోవడానికి ప్రయత్నించానని ఆయన గొప్పగా చెప్పుకుంటారు. ఆయన తరచూ యువ తారలపై వ్యాఖ్యలు చేస్తారు. వాడిగా వేడిగా జరిగే పాప్‌-కల్చర్‌ చర్చల్లో భాగస్వామి అవుతారు. సిడ్నీ స్వీనీ వివాదాస్పద డెనిమ్‌ ప్రకటనను ‘అక్కడ అది అత్యంత హాటెస్ట్‌’ అంటూ వెనకేసుకొస్తారు. పోర్న్‌ స్టార్‌ స్టార్మీ డేనియల్స్‌కు చెల్లించిన సొమ్ము (తన విషయాలను రహస్యంగా ఉంచేందుకు ఇచ్చింది) విషయంలో ట్రంప్‌ క్రిమినల్‌ ఆరోపణలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఓ దేశాధ్యక్షుడిలో ఉండాల్సిన హుందాతనం ట్రంప్‌లో మచ్చుకైనా కన్పించదు.

రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కోసమే గ్రీన్‌లాండ్‌పై కన్ను
ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడు అయినప్పటికీ ఆయనలోని రియల్‌ ఎస్టేట్‌ దిగ్గజం ఇప్పటికీ సజీవంగానే ఉంది. కొనేటప్పుడు ఉచితంగా రావాలని, అమ్మేటప్పుడు ప్రీమియం ధరలకు అమ్మాలని అనుకుంటారు. తాజాగా ఇప్పుడు ఆయన కన్ను గ్రీన్‌లాండ్‌పై పడింది. గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకోవడానికి ఎన్నో కారణాలు చెబుతారు. ఆ ద్వీపం అమెరికా హస్తగతమైతే అగ్రరాజ్యం చరిత్రలో అదనంగా చేరిన అతి పెద్ద భూభాగం అవుతుంది. ప్రపంచ పటంలో ఫ్రాన్స్‌, జర్మనీ, బ్రిటన్‌, ఇటలీ, స్పెయిన్‌…వీటన్నింటినీ కలిపినా దాని కంటే పెద్దదిగా కన్పిస్తుంది.

గ్రీన్‌లాండ్‌ను రియల్‌ ఎస్టేట్‌కు అనుకూలమైన ప్రాంతంగా ట్రంప్‌ భావిస్తున్నారు. ఆయనకు ఇప్పటికే విలాసవంతమైన రిసార్టులు, ట్రంప్‌ టవర్లు, గోల్ఫ్‌ కోర్టులు ఉన్నాయి. గ్రీన్‌లాండ్‌ తన చేతికి వస్తే అక్కడ కూడా రియల్‌ ఎస్టేట్‌ను అభివృద్ధి చేసుకోవచ్చుననేది కూడా ట్రంప్‌ ఎత్తుగడ. గ్రీన్‌లాండ్‌ అమ్మకానికి లేదని యూరోపియన్‌ యూనియన్‌ నేతలు స్పష్టం చేస్తున్నప్పటికీ ఆయన తన ప్రయత్నాలు మానడం లేదు. ట్రంప్‌ పదవీకాలం ముగిసే నాటికి ప్రపంచ పటం ఎలా ఉంటుందో చెప్పలేం. కానీ అమెరికా తదుపరి అధ్యక్షులు ఆయన దూకుడుతో పోటీ పడలేక ఒత్తిడికి గురవుతారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -