Monday, November 3, 2025
E-PAPER
Homeఆటలుఅర్ష్‌దీప్‌, సుందర్‌ మెరువగా

అర్ష్‌దీప్‌, సుందర్‌ మెరువగా

- Advertisement -

మూడో టీ20లో భారత్‌ గెలుపు
1-1తో టీ20 సిరీస్‌ సమం

భారత్‌ పుంజుకుంది. బంతితో అర్ష్‌దీప్‌ సింగ్‌ (3/35) మూడు వికెట్ల ప్రదర్శనతో విజృంభించగా, ఛేదనలో వాషింగ్టన్‌ సుందర్‌ (49 నాటౌట్‌) అజేయ ఇన్నింగ్స్‌తో కదం తొక్కాడు. బ్యాటర్లు సమిష్టిగా రాణించటంతో 187 పరుగుల లక్ష్యాన్ని భారత్‌ మరో 9 బంతులు ఉండగానే ఛేదించింది. 5 వికెట్ల తేడాతో మూడో టీ20లో గెలుపొందింది. ఐదు మ్యాచుల టీ20 సిరీస్‌ను 1-1తో సమం చేసింది.

హోబర్ట్‌ (ఆస్ట్రేలియా) :
ఆస్ట్రేలియాతో మూడో టీ20లో భారత్‌ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. 187 పరుగుల లక్ష్యాన్ని టీమ్‌ ఇండియా 18.3 ఓవర్లలోనే ఛేదించింది. ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ (49 నాటౌట్‌, 23 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) ఛేదనలో అజేయ ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ (25, 16 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), తిలక్‌ వర్మ (29, 26 బంతుల్లో 1 ఫోర్‌, 1 సిక్స్‌), జితేశ్‌ శర్మ (22 నాటౌట్‌, 13 బంతుల్లో 2 ఫోర్లు) రాణించారు.

ఆసీస్‌ పేసర్‌ నాథన్‌ ఎలిస్‌ (3/36) ఆకట్టుకున్నాడు. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 186 పరుగులు చేసింది. టిమ్‌ డెవిడ్‌ (74, 38 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్స్‌లు), మార్కస్‌ స్టోయినిస్‌ (64, 39 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్థ సెంచరీలతో మెరిశారు. 3 వికెట్లతో ఆసీస్‌ నడ్డివిరిచిన పేసర్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా నిలిచాడు. భారత్‌, ఆస్ట్రేలియా నాల్గో టీ20 గురువారం గోల్డ్‌కోస్ట్‌లో జరుగనుంది.

వాహ్‌.. వాషింగ్టన్‌
ఛేదనలో అభిషేక్‌ శర్మ (25) సహజశైలిలో రెచ్చిపోయాడు. రెండు సిక్సర్లు, రెండు ఫోర్లతో పవర్‌ప్లేలో దండెత్తాడు. కానీ నాథన్‌ ఎలిస్‌ పేస్‌లో మార్పులతో ఓపెనర్లను తికమక పెట్టాడు. అభిషేక్‌ సహా శుభ్‌మన్‌ గిల్‌ (15) ఎలిస్‌ వలలో చిక్కారు. కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ (24) ధనాధన్‌ షో చూపించాడు. రెండు సిక్సర్లు, ఓ ఫోర్‌తో 11 బంతుల్లోనే 24 పరుగులు పిండుకున్నాడు. కానీ సూర్య నిలకడ చూపించలేదు.

తిలక్‌ వర్మ (29) మిడిల్‌ ఆర్డర్‌లో కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. వికెట్ల పతనాన్ని అడ్డుకున్న తిలక్‌ వర్మ.. స్ట్రయిక్‌ రొటేషన్‌తో ఆసీస్‌ పేసర్ల సహనాన్ని పరీక్షించాడు. బ్యాటింగ్‌ లైనప్‌ డగౌట్‌కు చేరగా.. వాషింగ్టన్‌ సుందర్‌ (49 నాటౌట్‌), జితేశ్‌ శర్మ (22 నాటౌట్‌) ఆరో వికెట్‌కు అజేయంగా 25 బంతుల్లో 43 పరుగులు జత చేశారు. వాషింగ్టన్‌ 3 ఫోర్లు, 4 సిక్సర్లతో చెలరేగగా.. జితేశ్‌ 3 బౌండరీలతో రాణించాడు. దీంతో ఐదు వికెట్లు పడినా ఒత్తిడిని జయిస్తూ మరో 9 బంతులు ఉండగానే భారత్‌ లాంఛనం ముగించింది.

డెవిడ్‌ ధనాధన్‌
టిమ్‌ డెవిడ్‌ (74), మార్కస్‌ స్టోయినిస్‌ (64) అర్థ సెంచరీలతో ఆసీస్‌ తొలుత భారీ స్కోరు చేసింది. అర్ష్‌దీప్‌ సింగ్‌ దెబ్బకు 14/2తో ఆసీస్‌ కష్టాల్లో కూరుకుంది. ట్రావిశ్‌ హెడ్‌ (6), జోశ్‌ ఇంగ్లిశ్‌ (1)ను వరుస ఓవర్లలో సాగనంపిన అర్ష్‌దీప్‌ ఆసీస్‌ దూకుడుకు కళ్లెం వేశాడు. పవర్‌ప్లే అనంతరం వరుస బంతుల్లో మిచెల్‌ మార్ష్‌ (11), మిచెల్‌ ఓవెన్‌ (0) వికెట్లతో కంగారూలను వరుణ్‌ చక్రవర్తి మాయ చేశాడు. కానీ టిమ్‌ డెవిడ్‌ ఓ ఎండ్‌లో దంచికొట్టాడు. ఏడు ఫోర్లు, మూడు సిక్సర్లతో 23 బంతుల్లోనే అర్థ సెంచరీ సాధించాడు. మార్కస్‌ స్టోయినిస్‌ సైతం డెవిడ్‌కు జత కలిశాడు. డెవిడ్‌ అవుటైనా.. మాథ్యూ షార్ట్‌ (26 నాటౌట్‌)తో కలిసి స్టోయినిస్‌ జోరందుకున్నాడు. ఈ ఇద్దరు 39 బంతుల్లోనే 64 పరుగులు జోడించగా ఆసీస్‌ 186 పరుగులు చేసింది. స్టార్‌ పేసర్‌ జశ్‌ప్రీత్‌ బుమ్రా (0/26) వికెట్లు తీయలేదు.

సంక్షిప్త స్కోరు వివరాలు :
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌ : 186/6 (టిమ్‌ డెవిడ్‌ 74, మార్కస్‌ స్టోయినిస్‌ 64, అర్ష్‌దీప్‌ సింగ్‌ 3/35, వరుణ్‌ చక్రవర్తి 2/33)
భారత్‌ ఇన్నింగ్స్‌ : 188/5 (వాషింగ్టన్‌ సుందర్‌ 49, తిలక్‌ వర్మ 29, అభిషేక్‌ శర్మ 25, నాథన్‌ ఎలిస్‌ 3/36)

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -