Saturday, February 7, 2026
E-PAPER
Homeమానవికళను పేదలకు దగ్గర చేయాలి

కళను పేదలకు దగ్గర చేయాలి

- Advertisement -

ఫర్జోనా ఖానూన్‌… ఓ ఆర్టిస్ట్‌గా అందమైన చిత్రాలు గీయడమే కాదు.. అందులో మహిళల జీవితాన్ని చూపిస్తున్నారు. సమాజ మార్పు కోసం తనకు తెలిసిన కళను ఉపయోగిస్తున్నారు. ఓ ప్రెఫెషన్‌ కళాకారిణిగా తనలాంటి వాళ్లను తయారు చేసేందుకు తపిస్తున్నారు. భర్త కిరణ్‌ సహకారంతో ఓ స్డూడియోను ఏర్పాటు చేసి విద్యార్థులకు ఆర్ట్‌లో శిక్షణ ఇస్తున్నారు. ఇటీవల జరిగిన ఐద్వా అఖిల భారత మహాసభల్లో, ఓ ఆడపిల్ల పుట్టిన నాటి నుండి ఎలాంటి కష్టాలు ఎదుర్కొంటుందో తెలియజేస్తూ ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేసి ఎందరికో అవగాహన కల్పించారు. భవిష్యత్తులో ఆర్ట్‌ను పేదలకు దగ్గర చేయడమే తన లక్ష్యంగా పెట్టుకున్న ఆమె పరిచయం నేటి మానవిలో…

నేను గుంటూరులోని పొన్నూరులో పుట్టి పెరిగాను. చిన్నప్పటి నుండి డ్రాయింగ్‌ అంటే చాలా ఇష్టం. వారానికి ఒకసారి వచ్చే సండే బుక్‌లోని పిల్లల పేజీలో చుక్కలు కలపండి అనేది ఎంతో ఆసక్తిగా నింపేదాన్ని. అయితే మా ఫ్యామిలో ఆర్ట్‌లో ఎవ్వరూ లేరు. పెద్దగా ప్రోత్సహించేవాళ్లు కూడా లేరు. కానీ స్కూల్లో ఏ కాంపిటీషన్‌ పెట్టినా పోటీ చేసేదాన్ని, చిన్న చిన్న బహుమతులు వచ్చేవి. చాలా సంతోషంగా ఉండేది. మా అన్నయ్య వేసవి సెలవుల్లో రకరకాల కలర్‌ పెన్స్‌, పెన్సిల్‌ షేడింగ్‌ బుక్స్‌ తెచ్చేవాడు. అవన్నీ పూర్తి చేసేదాన్ని. అలాగే ఆటల్లో కూడా పాల్గొనేదాన్ని. మాది ముస్లిం ఫ్యామిలీ కావడంతో పెద్దగా ప్రోత్సహించలేదు. ఏడో తరగతిలోనే స్పోర్ట్స్‌ బంద్‌ చేయించారు. ఇక ఆర్ట్‌వైపు వెళ్లాను. డిగ్రీ బీఏ చదివాను. మా అన్నయ్య ఫ్రెండ్‌ సూచనతో జేఎన్‌టీయూలో ఆర్ట్స్‌ కోర్స్‌ కోసం చేరాను. నా వర్క్‌ చూసి వాళ్లు వెంటనే సీటు ఇచ్చారు. నా కోసం మా ఫ్యామిలీ మొత్తం హైదరాబాద్‌ వచ్చేశారు. అక్కడే నాకు కిరణ్‌ పరిచమయ్యారు. ఆయన్నే పెండ్లి చేసుకున్నాను.

టైం పాస్‌ కోసం నేర్పించను
ఇంట్లో ఒప్పించి పెండ్లి చేసుకున్నాం. అయితే ఒప్పుకోడానికి కాస్త టైం పట్టింది. ప్రస్తుతం మేమిద్దరం కలిసి వర్క్‌ చేస్తున్నాము. అంటే క్యూరెట్‌ చేస్తాము. రకరకాల ఆర్టిస్టుల కళారూపాలను ఒక దగ్గరకు చేర్చి అనేక షోలు ఏర్పాటు చేస్తున్నాం. కొత్త ఆర్టిస్టులకు శిక్షణ ఇస్తుంటాం. ఎక్కువగా విదేశాలకు వెళ్లే వారు మా దగ్గర ట్రైనింగ్‌ తీసుకుంటారు. ఏదో టైం పాస్‌ కోసం నేర్చుకోవాలనుకునేవాళ్లకు మేము నేర్పించం. ఆర్ట్‌ను ప్యాషన్‌గా, కెరీర్‌గా తీసుకోవాలి అనుకునేవాళ్లు మాత్రమే మా దగ్గరకు వస్తారు. ఎందుకంటే నా టైం అలాంటి వారికే సద్వినియోగం కావాలి అనేది నా ఆలోచన. మంచి ఆర్టిస్టును తయారు చేశాను అనే ఫీలింగ్‌ ఉండాలి. మాసబ్‌ట్యాంక్‌లో మా స్టూడియో ఉంది.

చైనా ఆర్టిస్ట్‌ స్ఫూర్తితో…
ఒక గ్రూప్‌గా కాకుండా సింగిల్‌గా ఒక్కొక్కకరికి మాత్రమే ట్రైనింగ్‌ ఇస్తాను. ఇప్పటి వరకు 15 మంది విద్యార్థులకు ట్రైనింగ్‌ ఇచ్చాను. ఐవీవీ అని గొప్ప చైనా ఆర్టిస్ట్‌ ఉన్నారు. ఈయన కమ్యూనిస్టు పార్టీ. సామాజిక అవగాహన కల్పించే చిత్రాలు వేస్తారు. వర్క్‌ కూడా కార్మికులతోనే చేయిస్తారు. కార్మికులతో వర్క్‌ చేయించి వాటిని ఎగ్జిబిషన్‌ పెడతారు. ఆయనే నాకు స్ఫూర్తి. ఆయన్ని ఆదర్శంగా తీసుకుని మన దగ్గర ఇప్పటి వరకు సామాజిక అవగాహన కల్పించే విధంగా నా భర్త కిరణ్‌ సహకారంతో కొన్ని షోలు ఏర్పాటు చేశాను. ఆర్ట్‌ పేదలకు కూడా దగ్గరవ్వాలి అనేది నా కోరిక. అలాంటి వారితో ఆర్ట్‌ వేయించి వాటిని అంతర్జాతీయ వేదికపై చూపించాలి, వారికి ఉపాధి చూపించాలి అనేది నా కల. ఇది ఎప్పటికైనా నేరువేరుతుందని ఆశిస్తున్నాను.

హింసపై అవగాహన కల్పించేందుకు
ఇటీవల ఐద్వా, 14వ అఖిల భారత మహాసభల సందర్భంగా మహిళల జీవితాన్ని ప్రతిబింబిస్తూ ఓ ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేశాము. ఐలమ్మ ఆర్ట్‌ గ్యాలరీ డైరెక్టర్‌ విజయరావు, ఐద్వా రాష్ట్ర కార్యదర్శి మల్లు లక్ష్మి ఈ కార్యక్రమం చేయాల్సిందిగా మమ్మల్ని కోరారు. నేనూ, నా భర్త కిరణ్‌ దీన్ని క్యూరెట్‌ చేశాము. మహిళలపై జరుగుతున్న హింసపై అవగాహన కల్పించే విధంగా ఈ ఆర్ట్‌ షో ఏర్పాటు చేశాము. మొత్తం 12 మంది ఆర్టిస్టులు ఇందులో పాల్గొన్నారు. బాల్యం నుండి యక్తవయసుకు వచ్చే వరకు ఈ సమాజంలో మహిళలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. వాటిన్నింటినీ ఈ ఎగ్జిబిషన్‌లో ఆర్ట్‌ రూపంలో పెట్టాము. కింది స్థాయి నుండి ఎంతో కష్టపడి పైకి వస్తున్న ఎంతో మంది కళాకారులు ఈ షోలో తమ కళలను చూపించారు. శ్రావణి అనే ఓ ఆర్టిస్ట్‌ ఎంబ్రయిడరీ ఆర్ట్‌ ద్వారా మహిళల బాధ, కష్టం, సంతోషం వంటి భావాలను చూపించారు. నేను మా అమ్మ పాత చీరతో తల్లీ బిడ్డలకు ఉండే రిలేషన్‌ను చూపించే ప్రయత్నం చేశాను.

మహిళల కష్టాలను చూపించేలా…
అచ్యుత అనే ఆర్టిస్ట్‌ బ్యాడ్‌ టచ్‌, గుడ్‌ టచ్‌పై అవగాహన కల్పిస్తూ ఆర్ట్‌ వేశారు. అలాగే నాతో పాటు దీన్ని క్యూరెట్‌ చేసిన ఆర్టిస్ట్‌ కిరణ్‌ కుమార్‌ ఒక మహిళ బాధను చూపిస్తూ ఓ చిత్రాన్ని గీశారు. మహిళ జీవితం ఎంత మెకానికల్‌గా ఉంటుందో చూపించేందుకు సింబాలిక్‌గా బ్యాక్‌ గ్రౌండ్‌లో ఆటో మొబైల్‌ పార్ట్స్‌ను కూడా పెట్టారు. శ్రీలక్ష్మి అనే ఆర్టిస్ట్‌ ఊలు ద్వారా మహిళల కడుపులో తొమ్మిది నెలల పాటు బిడ్డ ఎలా ఎదుగుతుందో చూపించారు. అలైఖ్య అనే గిరిజన ఆర్టిస్ట్‌ వాళ్లకు ఆర్థిక చేయూతనిచ్చే మెహందీతో పెయింటింగ్‌ చేశారు. అంకిత అనే మరో ఆర్టిస్ట్‌ తన తల్లి చనిపోతే అమ్మమ్మ దగ్గర పెరిగింది. ఆమె జీవితం మొత్తం త్యాగం చేసి ఈమెను చదివించింది. ప్రస్తుతం ఆమె హెచ్‌సీయూలో మాస్టర్స్‌ చేస్తుంది. తన కోసం తన అమ్మమ్మ జీవితాన్ని ఎలా త్యాగం చేసిందో చూపిస్తూ ఆర్ట్‌ వేసింది. అది కూడా తన అమ్మమ్మ చీరతోనే చేసింది. దారాలతో స్త్రీకి పురుషుడికి ఎలాంటి బంధం ఉంటుంది అనేది చూపించాము.

స్వయంగా అనుభవించిన బాధలే…
పేపర్‌ ఫోల్డింగ్‌ రూపంలో ఒక పెయింటింగ్‌ ద్వారా మహిళల భావోద్వేగాలు చూపించడానికి ప్రయత్నించారు. ఈ పెంయింటింగ్‌ అన్నీ వేయించి ఒక దగ్గరకు చేర్చడానికి సుమారు రెండున్నర నెలలు పట్టింది. ఐద్వా మహాసభల కోసమే ఈ ఆర్ట్స్‌ వేయించాము. వెన్నెల అనే అమ్మాయి పారిశుద్ధ కార్మికురాలి బొమ్మను క్రిష్టల్స్‌తో అందంగా డ్రాయింగ్‌ చేసింది. అలాగే ధనలక్ష్మి అనే ఆమె తన ఫ్యామిలీలో చాలా పోరాటం చేసింది. ఎలాంటి సపోర్ట్‌ తనకు ఉండేదికాదు అయినా చదువు కుంది. అన్నీ భరించి తన జీవితంలో ఎదిగేందుకు పోరాడింది. ఒక ఎనుగును మోస్తున్నట్టు చూపించి తాను జీవితంలో ఎలా ఎదిగిందో చూపించింది. ఇలా మహిళ తన జీవితంలో ఎన్ని రకాల పాత్రలు పోషిస్తుంది, ఎంత బాధను అనుభవిస్తుంది అన్నీ ఈ షోలో చూపించే ప్రయత్నం చేశాం. ఒక రకంగా మేమంతా మా జీవితంలో స్వయంగా అనుభవించిన కష్టాలను జయించి, కళాకారులుగా ఎలా ఎదిగామో ఈ ఎగ్జిబిషన్‌లో పెట్టాము. ఇంకా సమాజానికి ఉపయోగపడే ఇలాంటి షోలు చాలా చేయాలనుకుంటున్నాను.

  • సలీమా
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -