ప్రపంచంలోని బాగా ధనవంతులు, అధికారం చెలాయిస్తున్నవాళ్లు అందరూ ఈ మధ్య దావోస్‌లో ఒక దగ్గర చేరారు. ఇది ప్రతీయేడూ జరిగే అట్టహాసమే. అక్కడ కృత్రిమ మేథ గురించి ఎక్కువ ఉత్తేజ పూరితంగా చర్చలు జరిగాయి. ఎ.ఐని ప్రవేశపెట్టడం ఇప్పటికి ఇంకా అంత లాభసాటి వ్యవహారంగా లేదు. కాని దావోస్‌లో చేరిన పెట్టుబడిదారులు, వారిని సమర్ధించేవాళ్లు మాత్రం ఆ పరిస్థితి త్వరలోనే వస్తుందన్న విశ్వాసంతో ఉన్నారు. దాని వలన కలిగే నిరుద్యోగం గురించి చర్చ జరిగింది. కానీ, దాన్ని కొట్టిపారేస్తున్నారు. ఎ.ఐ వలన కలిగే నిరుద్యోగం ఎంత ఉంటుందో ఆ మేరకు రిపేర్లు, నిర్వహణలో కొత్త ఉపాధి అవకాశాలు వస్తాయని అభిప్రాయపడినవారు కూడా లేకపోలేదు. ఈ అభిప్రాయం బొత్తిగా నిరాధారం. దక్షిణాఫ్రికా – కెనడా-అమెరికా వాణిజ్యవేత్త ఎలన్ మస్క్ ఎ.ఐ వలన నిరుద్యోగం పెరుగుతుందని అంగీకరించాడు. ఎ.ఐని ప్రవేశపెట్టినందు వలన ఉద్యోగాలు కోల్పోయేవారికి వేరేచోట్ల ఉద్యోగాలు కల్పించడానికి లేదా వారికి నష్ట పరిహారం చెల్లించడానికి కావలసిన ఆర్థిక వనరులను సమకూర్చడానికి అతగాడు ఎ.ఐని వినియోగించేవారి నుండి పన్ను అదనంగా వసూలు చేయాలని సూచన చేశాడు.
ఎలన్ మస్క్ సైతం అంగీకరించినట్టు, ఎ.ఐని ప్రవేశపెట్టడం వలన నిరుద్యోగం పెరగుతుందనడంలో ఎటువంటి సందేహమూ లేదు. కాని ఇక్కడ సమస్య ఉన్నది ఎ.ఐ వలన కాదు, పెట్టుబడిదారీ వ్యవస్థ ఉన్నందువలన. ఎలన్ మస్క్ సూచననే పరిశీలిద్దాం. ఒకానొక పనిలో వంద మందిని నియమించారనుకుందాం. ఎ.ఐని ప్రవేశ పెట్టడం వలన అందులో యాభై మంది నిరుద్యోగులుగా మారారనుకుందాం. అలా ఉద్యోగాలు పోగొట్టుకున్న వారికి అంతవరకూ వస్తున్న జీతాలతో సరిసమానంగా ఇప్పుడు నష్టపరిహారం చెల్లించారనుకుందాం. అప్పుడు ఎ.ఐ ని ప్రవేశపెట్టడం వలన వేతనాల కోసం చేసే ఖర్చు తగ్గదు కదా. ఆ పరిస్థితుల్లో ఎ.ఐ వలన ఉత్పత్తి లేదా టర్నోవర్ పెరిగితేనే అది లాభసాటి అవుతుంది (ఒకవేళ పనులు పోయినవారికి చెల్లించే నష్టపరి హారం అంతవరకూ వారికి వచ్చిన వేతనం కన్నా తక్కువగా ఉంటే అప్పుడు నిరుద్యోగ సమస్య ప్రభావం సమాజం మీద ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుంది. అంటే ఎ.ఐ సామాజిక సమస్యకు కారణభూతం అవుతుంది). టర్నోవర్ పెరిగితే, అప్పుడు వేతనాల కోసం చేసే ఖర్చు తగ్గకపోయినా, లాభసాటి అవుతుంది.
కాని, టర్నోవర్ పెరుగుదల తోబాటు సాధారణంగా పెరగవలసిన ఉపాధి అవకాశాలు ఎ.ఐ ప్రవేశం వలన హరించుకు పోతాయి. అంటే ఎ.ఐ మామూలుగా విస్తరించ వలసిన ఉపాధి అవకాశాలను కుదించి వేస్తుంది. అలా మామూలుగా ఉపాధి పొందవలసిన వారు ఎ.ఐ కారణంగా పొందలేకపోతారు. వారలా మిగిలిపోడానికి కారణం ఎ.ఐ ప్రవేశమే. కాని వారికి ఎటువంటి నష్టపరిహారమూ ఉండదు. వారేమీ ఉద్యోగాలు కోల్పోలేదు కదా. రావలసిన ఉద్యోగాలు రాలేదు అంతే. అంటే నిరుద్యోగం అనే సామాజిక సమస్య వెంటాడుతూనే వుంటుంది. పెట్టుబడి దారీ వ్యవస్థ తర్కాన్ని పరిశీలిస్తే మనకొక విషయం స్పష్టం అవుతుంది. ఈ వ్యవస్థలో కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశపెడితే అది నిరుద్యోగానికి దారితీస్తుంది.
దానితోబాటు ముడిపడి వున్న సామాజిక సమస్యలకూ కారణమౌతుంది. ఉద్యోగాలు పోగొట్టుకున్న వారికి నష్టపరిహారాన్ని చెల్లించినా, చెల్లించకపోయినా అదే పరిస్థితి. 19వ శతాబ్దం తొలి కాలంలో కొత్త యంత్రాల ప్రవేశం కారణంగా తమ ఉపాధి దెబ్బతిందన్న కోపంతో ఆ కొత్త యంత్రాలను ధ్వంసం చేయడానికి పూనుకున్న ‘లడ్డైట్’లు కొత్త యంత్రాలే తమ ఉద్యోగాలను పొట్టన పెట్టుకున్నాయని భావించారు. ఇప్పుడు కొత్త టెక్నాలజీని ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకించేవారు ఆనాటి పరిస్థితులను గుర్తు చేసేలా వ్యవహరిస్తున్నారని మనకు అనిపించవచ్చు. కాని వారి వ్యతిరేకతకు ఒక బలమైన కారణం ఉంది. ఆ కొత్త టెక్నాలజీ ప్రవేశం కారణంగానే వారి ఉద్యోగాలకు ఎసరు వచ్చింది.
ఇదే కొత్త టెక్నాలజీ ఒక సోషలిస్టు వ్యవస్థలో ప్రవేశించిందనుకోండి. అప్పుడు పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? ఇలా కొత్త టెక్నాలజీని ప్రవేశపెట్టినప్పుడు సోషలిస్టు వ్యవస్థలో నిరుద్యోగం తలెత్తదు. పనులలో వినియోగించబడినవారు ఉద్యోగాలను కోల్పోరు. దానికి బదులు వారి విశ్రాంతి సమయం పెరుగుతుంది. అప్పుడు వారికి చెల్లించే వేతనాల ఖర్చు ఏమీ తగ్గదు. అంటే కార్మికుల వేతనస్థాయి ఏమాత్రమూ తగ్గదు. సోషలిస్టు వ్యవస్థలో కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశపెట్టడం వలన అందరి జీవితాలూ మరింత మెరుగుపడతాయి. పని చాకిరీ నుండి విముక్తి దొరుకుతుంది. అప్పుడు ఆ కార్మికులు తమలో నిబిడీకృతమైవున్న సృజనాత్మకతను వ్యక్తం చేయగల సమయం వారికి లభిస్తుంది. ఇంతకు ముందు పేర్కొన్న ఉదాహరణ ప్రకారం కొత్త టెక్నాలజీ ప్రవేశం కారణంగా పెట్టుబడిదారీ విధానంలో వంద మందిలో యభై మంది పనులు పోయాయి. అదే సోషలిస్టు వ్యవస్థలోనైతే ఆ వంద మందికీ పనులు ఉంటాయి. కాని వారి పనిగంటలు సగానికి తగ్గిపోతాయి. అప్పుడు వారి వేతనాల బిల్లు ఏమాత్రమూ తగ్గదు. ఉత్పత్తిలో వారికి లభించే వాటా ఏమాత్రమూ తగ్గదు. అంటే సోషలిజంలో కొత్త టెక్నాలజీ వలన జీవితాలు మరింత సుఖవంతం అవుతాయే తప్ప కొద్దిమంది దగ్గర మరింత ఎక్కువ లాభాలు పోగుబడే పరిస్థితి రాదు.
ఇటువంటి పరిస్థితి పెట్టుబడిదారీ వ్యవస్థలో ఎన్నటికీ ఉత్పన్నం కాదు. ఇక్కడ పెట్టుబడులు పెట్టేది ఎప్పుడూ మరింత ఎక్కువ లభాలను పోగేసుకోడానికే. అలా లాభాలను పెంచుకోడానికి తోడ్పడేలా, కార్మికుల సంఖ్య తగ్గిపోయేలా, వారి వేతనాల ఖర్చు తగ్గిపోయేలా ఉంటేనే కొత్త టెక్నాలజీని తీసుకు రావడానికి పెట్టుబడిదారులు పెట్టుబడులు పెడతారు. ఈ కొత్త టెక్నాలజీ ప్రవేశం కారణంగా నిరుద్యోగం పెరుగుతుంది. అప్పుడు పని చేస్తున్న కార్మికులకు కూడా వేతనాలలో పెరుగుదల ఉండకుండా పోతుంది. అటు కార్మికుల సంఖ్యా తగ్గి, ఇటు వారికి చెల్లించవలసిన వేతనాలు కూడా తగ్గి, ఉత్పాదకత కూడా పెరగడం వలన పెట్టుబడిదారులకు ఉత్పత్తిలో మిగిలే వాటా చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే వారు కొత్త టెక్నాలజీ పట్ల ఉత్సాహం ప్రదర్శిస్తారు. పనిని ఉమ్మడిగా పంచుకుంటూ, ఉత్పత్తిని కూడా ఉమ్మడిగా పంచుకునే నైతిక విలువను పాటించే సమాజానికి, లాభాలను పెంచుకోవాలనే కాంక్షతో నడిచే సమాజానికి మౌలికంగానే తేడా ఉంది. సోషలిస్టు వ్యవస్థలో ఉత్పత్తి సాధనాలన్నీ సమాజపు ఉమ్మడి యాజమాన్యం కిందే ఉండాలని అంటూనే, వాటిని నిర్వహించే పద్ధతి మాత్రం లాభాలను ఎక్కువగా ఆర్జించాలనే లక్ష్యంతోనే ఉండాలని కొందరు సిద్ధాంతాలు చెప్తూంటారు.
ఇవి పూర్తిగా తప్పు. ప్రభుత్వ యాజమాన్యం కింద ఉంటూనే, లాభాలను ఆర్జించే లక్ష్యంతో నడిచే సంస్థలు చాలానే ఉన్నాయి. కాని వాటిని పెట్టుబడిదారీ ఆర్థిక సూత్రాలకు అనుగుణంగా నడపాలను కోవడం సోషలిజానికి పూర్తి వ్యతిరేకం. ఒకప్పుడు యుగోస్లావియాలో సోషలిస్టు ఆర్థిక వ్యవస్థ ఇదేమాదిరిగా లాభార్జన లక్ష్యంగా నడిచింది. దాని ఫలితంగా అక్కడ నిరుద్యోగం ఏర్పడింది. ఆ ఒక్క దేశమే కాదు, తూర్పు యూరప్ లోని పలు సోషలిస్టు దేశాల్లో కూడా ఇదే పరిస్థితి ఉండేది. ప్రపంచంలోని ప్రధాన శాస్త్ర, సాంకేతిక పరిశోధనల, విజయాల ప్రయోజనాలను మానవాళి పూర్తిగా వినియోగించుకోవాలంటే అది సోషలిజంలో మాత్రమే సాధ్యం. అవే సాంకేతిక పద్ధతులను పెట్టుబడిదారీ వ్యవస్థలో ప్రవేశపెడితే అప్పుడు దానివలన పెట్టుబడిదారులకు లాభాలు పెరుగుతాయి కాని మెజారిటీ కార్మికులు, వారి కుటుంబాలు దీనావస్థలోకి నెట్టబడతాయి.
కార్మికులను మరిన్ని కష్టాలలోకి నెట్టే విధంగా నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశపెట్టే పెట్టుబడిదారీ వ్యవస్థ వికృత రూపాన్ని మార్క్స్ ఇలా వర్ణించాడు: ”తాను వధించిన వ్యక్తుల కపాలాలనే పాత్రలుగా చేసుకుని వాటి నుంచి అమృతాన్ని సేవించే అత్యంత క్రూరుడైన వ్యక్తి వంటిది పెట్టుబడిదారీ వ్యవస్థ.” (భారతదేశం మీద బ్రిటిష్ పాలన భావి ఫలితాలు’ అన్న రచన నుండి).
అందుచేత మానవ సమాజం చాలా గొప్ప శాస్త్ర, సాంకేతిక ఆవిష్కరణలను చేసే ముంగిట్లో ఉంటే, అప్పుడు సోషలిజం అవసరం మరింత ఎక్కువగా ఉంటుంది. సోషలిజం ఉంటేనే అటువంటి శాస్త్ర, సాంకేతిక విజయాలను మానవాళి పూర్తిగా వినియోగించు కోగలుగుతుంది. దాని ఫలితాలు అద్భుతంగా పరిణమిస్తాయి. సోషలిజం అనేది సమానత్వం మీద ఆధారపడిన సమాజం మాత్రమే కాదు. మానవ జాతికి ఉన్న సృజనాత్మకతకు పూర్తి న్యాయం చేసి సాంకేతికంగా ముందుకు పురోగమించగల సమాజం అది.
ఆ పురోగమనం ప్రయోజనాలు కూడా అందరికీ సమానంగా అందుతాయి. శాస్త్ర పురోగతి ఎంత గొప్పగా ఉంటే అంత అర్జెంటుగా సోషలిజం ఆవశ్యకత ముందుకొస్తుంది. అందుచేత పెట్టుబడిదారీ వ్యవస్థలో ఎ.ఐ ప్రవేశం వినాశకర ఫలితాలకు దారితీస్తుంది. ఎ.ఐ సాంకేతికతకు ఉన్న అద్భుత శక్తి సామర్ధ్యాలు సోషలిస్టు వ్యవస్థలోనైతే గొప్ప ఫలితాలను ఇవ్వగలుగుతాయి. ఇటువంటి గొప్ప సాంకేతిక పురోగమనం మన ముందు ఉండడం అంటే అంత బలంగా సోషలిజం ఆవశ్యకతను మనం గుర్తించగలగాలి. అయితే ఎ.ఐ సాంకేతికతలో కొన్ని ప్రమాదకర ధోరణులు సమాజాన్ని వెర్రితలలు వేసే దిశగా నెట్టవచ్చు. అందుచేత సోషలిస్టు వ్యవస్థలో కూడా తగు విజ్ఞతతో దానిని వినియోగంలోకి తేవాలి. ఒక్క సోషలిజంలో మాత్రమే ఎ.ఐ కి ఉన్న ఉపాధిని మింగివేసే ప్రమాదకర ధోరణికి మందు ఉంది అన్నది ఇక్కడ ప్రధాన అంశంగా గుర్తించాలి.
(స్వేచ్ఛానుసరణ)
ప్రభాత్ పట్నాయక్



