– రెగ్యులరైజ్ చేయాలని ఆందోళన
– సర్కార్ స్పందించకుంటే త్వరలో సమ్మె నోటీస్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఆర్టిజన్లను రెగ్యులరైజ్ చేయాలని తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్టాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో వేలాది మంది కార్మికులు హైదరాబాద్ మింట్ కాంపౌండ్‌లోని దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థ (ఎస్పీడీసీఎల్) కార్యాలయాన్ని మంగళవారం ముట్టడించారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు 3 వేల మందికి పైగా ఆర్టిజన్లు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. ప్ల కార్డులు, జెండాలు, బ్యానర్లు పట్టుకుని నినాదాలు చేశారు. సచివాలయం నుంచి మింట్ కాంపౌండ్ మీదుగా ఖైరతాబాద్ వెళ్లే రహదారి మొత్తం నిరసన కారులతో నిండిపోవడంతో బారికెడ్లు ఏర్పాటు చేసి పోలీసులు రహదారిని మళ్లించారు. ఈ సందర్భంగా జేఏసీ కన్వినర్ ఎస్.చంద్రారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో నాణ్యమైన నిరంతర విద్యుత్ సరఫరా కోసం ప్రమాదాలను లెక్క చేయకుండా విధులు నిర్వహిస్తున్న ఆర్టిజన్లను విద్యుత్ సంస్థలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఆర్టిజన్ కార్మికులకు ఏపీఎస్‌ఈబీ రూల్స్ వర్తింపజేయాలనీ, విద్యార్హతల ఆధారంగా కన్వర్షన్ చేయాలనీ, కార్మికులందరినీ రెగ్యులర్ చేసి ఒకే రూల్ అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యుత్ సరఫరా సంస్థల్లో జీఓ నెం.11 ప్రకారం పీస్ రేట్ కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వాలనీ, 2026 పీఆర్‌సీ అమలు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని చేసిన వినతులను యాజమాన్యం, ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించకుంటే సమ్మె నోటీసు ఇస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్మ్రంలో తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మెన్ ఎస్.సతీశ్‌రెడ్డి, కో చైర్మెన్ ఎస్. శ్రీధర్‌గౌడ్, కన్వీనర్ ఎస్.సాయిలు, కో కన్వీనర్ చందర్ సింగ్ ఠాకూర్, వైస్ చైర్మెన్లు సంతోశ్ నాయక్, చింత ఎల్లయ్య, జాయింట్ సెక్రటరీ అలీఖాన్, కోశాధికారి ఎం.పరుశురాములు తదితరులు పాల్గొన్నారు.
ఎస్పీడీసీఎల్‌ను ముట్టడించిన ఆర్టిజన్లు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



