Friday, April 10, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంరెండో రోజు ఆర్టిజన్ల సమ్మె ప్రశాంతం

రెండో రోజు ఆర్టిజన్ల సమ్మె ప్రశాంతం

- Advertisement -

– రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డివిజన్‌ కేంద్రాల వద్ద నిరసన
– విద్యుత్‌ సంస్థల దిన చర్యలపై ప్రభావం
– నేడు కార్మిక సంఘాలతో సర్కార్‌ చర్చలు


నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
తెలంగాణ విద్యుత్‌ ఆర్టిజన్‌ ఉద్యోగుల సంయుక్త కార్యాచరణ కమిటీ (జేఏసీ) తమ దీర్ఘ కాలిక సమస్యల పరిష్కారం చేపట్టిన సమ్మె రెండో రోజు ప్రశాతంగా కొనసాగింది. ఆర్టిజన్లను రెగ్యులర్‌ చేయాలనీ, నిలిచిపోయిన వేతన సవరణను వెంటనే అమలు చేయాలనీ, ప్రమాదకరమైన విధుల్లో పాల్గొనే తమకు మెరుగైన ఈహెచ్‌ఎస్‌ సౌకర్యం కల్పించాలని ప్ల కార్డులు, జెండాలు పట్టుకుని కార్మికులు నిరసనలో పాల్గొన్నారు. విద్యుత్‌ సంస్థల్లో పని చేస్తున్న ఇతర విభాగాలకు చెందిన పలు యూనియన్లు సమ్మెకు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. చాలా చోట్ల మెజార్టీ కార్మికులు సమ్మెలో పాల్గొనడంతో తెలంగాణ జెన్‌కో, ట్రాన్స్‌కోతో పాటు ఎస్పీడీసీఎల్‌, ఎన్పీడీసీఎల్‌ సంస్థల రోజు వారి దిన చర్యలపై ఆర్టిజన్ల సమ్మె ప్రభావం పడింది. అయితే ఆయా విద్యుత్‌ సంస్థలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్టు సమాచారం.

నేడు జేఏసీతో చర్చలు
సమ్మె ఉదృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలుస్తోంది. సమ్మె పాల్గొంటున్న ఆర్టిజన్లతో శుక్రవారం ప్రభుత్వం చర్చలు జరపాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. విద్యుత్‌ సంస్థల సీఎండీలకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఇప్పటికే పలు సూచలను చేసినట్టు సమాచారం. కార్మికుల న్యాయమైన డిమాండ్లు ప్రభుత్వం దృష్టికి తీసుకు రావాలే తప్ప ఇలా చేయడం తగదని తనను కలిసిన విద్యుత్‌ ఉద్యోగ సంఘాల నాయకులతో భట్టి అన్నట్టు సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా సీఈ స్థాయి అధికారులు సమ్మెలో పాల్గొంటున్న ఆర్టిజన్లతో గురు వారం చర్చలు జరిపి బుజ్జగించినట్టు సమాచారం.

సమ్మెలో పాల్గొంటున్న ఆర్టిజన్లకు వైద్య సేవలు బంద్‌
సర్క్యూలర్‌ జారీ చేసిన తెలంగాణ జెన్కో

తెలంగాణ విద్యుత్‌ ఆర్టిజన్‌ ఉద్యోగుల సంయుక్త కార్యాచరణ కమిటీ (జేఏసీ) పిలుపు మేరకు ఈనెల 8 నుంచి సమ్మెలో పాల్గొంటున్న ఆర్టిజన్లకు వైద్యసేవలు నిలిపి వేస్తున్నటు తెలంగాణ జెన్కో ప్రకటించింది. ఈ మేరకు సంస్థ డైరెక్టర్‌ ఎస్‌వీ.కుమార్‌ రాజు గురువారం సర్క్యూలర్‌ జారీ చేశారు. ఆర్టిజన్లతో పాటు వారిపై ఆధారపడిన వారికి మెడికల్‌ క్రెడిట్‌ కార్డ్‌ జారీ, బిల్లుల రీయింబర్స్‌మెంట్‌ వంటి అన్ని వైద్య సౌకర్యాలను నిలిపివేయాలని యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌లోని జెన్కో ప్రధాన కార్యాలయంలోని విభాగాల అధిపతులు సమ్మెలో లేనిఆర్టిజన్ల వైద్య ఖర్చులకు సంబంధించి బిల్లులను మాత్రమే పంపాలని సర్క్యూలర్‌లో పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -