భక్త రామదాసు జయంతి ఉత్సవాల్లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
నవతెలంగాణ-కల్చరల్
సమాజ చైతన్యానికి కళాకారులు తమ కళల ద్వారా దోహదపడాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. తెలంగాణలో కళా వికాసం ఎన్నో సంవత్సరాలుగా వివిధ రూపాల్లో కొనసాగుతోందని తెలిపారు. దేవాలయాలు, పర్యాటకం, సాంస్కృతిక రంగాలను సమన్వయం చేస్తూ తెలంగాణ అభివృద్ధికి తోడ్పడే విధంగా ప్రణాళికలు రూపొందిస్తే తెలంగాణ సంగీత నాటక అకాడమీకి మరింత నిధులు పెంచి ప్రోత్సహిస్తామని అన్నారు. తెలంగాణ సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్‌లోని ఎల్‌బీ ఇండోర్ స్టేడియంలో వాగ్గేయకారుడు భక్త రామదాసు 393వ జయంతి మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ప్రముఖ తెలుగు సినీ సంగీత దర్శకులు సాలూరు కోటి జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. తెలంగాణకు చెందిన మహా వాగ్గేయకారుడు భక్త రామదాసు అని, శ్రీరామునిపై అపార భక్తి కలిగిన మహనీయునిగా విశేష ఖ్యాతి పొందారని తెలిపారు. కళల వ్యాప్తి, కళాకారుల అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కట్టుబడి ఉందన్నారు. డాక్టర్ పుంజాల అలేఖ్య నాయకత్వంలో తెలంగాణలో కళా వికాసం కొనసాగుతోందని, ప్రభుత్వం నుంచి అన్ని విధాలుగా సహకారం అందిస్తామని తెలిపారు. తెలంగాణ సంగీత నాటక అకాడమీ అధ్యక్షురాలు డాక్టర్ అలేఖ్య పుంజాల మాట్లాడుతూ.. రెండు నెలలుగా కృషి చేసి తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి రెండు వేల మందికి పైగా కళాకారులను సమీకరించి రామదాసు ఉత్సవాలను నిర్వహించినట్టు తెలిపారు.
గతేడాది సంగీత కళాకారులతో నిర్వహించగా, ఈసారి సంగీతంతోపాటు నాట్య కళాకారులను కూడా భాగస్వాములను చేసినట్టు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా సంగీతం, నృట్యం, నాటక వైవిధ్య కార్యక్రమాలు నిర్వహిస్తూ అనేక మంది కళాకారులను ప్రోత్సహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో పద్మశ్రీ డాక్టర్ యెల్లా వెంకటేశ్వరరావు, కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీతలు రాఘవాచారి, కళాకృష్ణ, హరిప్రియ, శేషులత, కమల, శ్వేతా ప్రసాద్, అయ్యగారి శ్రీదేవి, రోహిణి కందాల, మంథా శ్రీనివాస్, డాక్టర్ శ్రీకాంత్, ఆర్. నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.



