Sunday, August 31, 2025
E-PAPER
spot_img
Homeఎడిట్ పేజిరచనా రాక్షసుడు, పరిశోధనా సముద్రుడు ఆరుద్ర

రచనా రాక్షసుడు, పరిశోధనా సముద్రుడు ఆరుద్ర

- Advertisement -

ఆరుద్ర శతజయంతి ముగింపుకొస్తున్న సందర్భం. ఈ ఏడాది పొడుగునా అనేకచోట్ల ఆయనకు నివాళులర్పిస్తూ సాహిత్యలోకం అనేక సభలు, సదస్సులు, చర్చాగోష్టులు జరిపింది. ఆరుద్ర అనగానే అధ్యయనపరులకు సమగ్రాంధ్ర సాహిత్యం గుర్తుకురావడం ఒకటైతే సమగ్రత అన్న పదం ఆయన జీవితమంతటికీ వర్తిస్తుంది. సమగ్రత, శాస్త్రీయత, స్పష్టత, వినమ్రత అన్న సూత్రాలు ఆయన మార్గదర్శకాలుగా పాటించారు.వాటితో పాటే నూతనత్వం, వైవిధ్యం అన్నవీ సొంతం చేసుకున్నాడు. అందుకు ఆయన పేరు వినగానే కొందరికిి కొండగాలి తిరిగింది లాంటి సినిమా పాటలు గుర్తుకురావచ్చు. మరొకరికి వేమన నుంచి తిరుక్కలర్‌ దాకా వున్న సామాజిక వారసత్వం కండ్ల ముందు కదలాడవచ్చు. కవులకు త్వమేవాహం, కూనలమ్మ పదాలు వంటివి మదిలో మెదలొచ్చు. ఇంకా కొందరిని తమ నృత్యరీతులు, ఇంద్రజాలం, చదరంగంలోకి తీసుకుపోవచ్చు.1925 ఆగష్టు 1న భాగవతుల శంకరశాస్త్రిగా పుట్టిన ఆరుద్రను ఆరోరుద్రుడుగా అభివర్ణించారు శ్రీశ్రీ ఓసారి. నిజంగానే అనితర సాధ్యమైన ముద్ర ఆయనది. అందుకోసం అనవరతం శ్రమించారు. మార్క్సిస్టు దృక్పథంతో అనేక రంగాల్లో సామాజిక పరిణామ చరిత్రను అక్షరబద్దం చేయడానికి ఆఖరిదాకా అంకితమయ్యారు. ఆ విధంగా ఆయన పరిశోధనా సముద్రుడు. రచనా రాక్షసుడు. ఈ క్రమంలో ఆది నుంచి ఆయన ప్రజాశక్తితోనూ ప్రజా ఉద్యమాలతోనూ మమేకమయ్యారు.మార్క్సిజానికి తన నిబద్దతను ప్రకటించుకున్నారు. నా జీవితం కమ్యూనిజానికే అంకితం పేరుతో ఆరుద్ర జ్ఞాపకాలను, ఆయన భార్య రామలక్ష్మి ఇంటర్వ్యూలు లేఖలను శతజయంతి కానుకగా ప్రజాశక్తి ప్రచురించింది. వాటినోసారి వీక్షిస్తే 1940లలో కవిగానేగాక కమ్యూనిస్టు కార్యకర్తగా పనిచేస్తూ రచనలు ప్రజాశక్తికి పంపిన వైనం కండ్లకు కడుతుంది. (బాక్సు చూడండి)
క్రమశిక్షణ, శ్రమశిక్షణ
ఆరుద్ర రచనలూ, జీవిత విశేషాలు చాలాసార్లు చెప్పుకున్నవే. ఆయన అంత కృషి చేయడానికి అనుసరించిన క్రమశిక్షణ,శ్రమశిక్షణ ఏమిటో చూద్దాం. సినిమా పాటలు రాస్తూ వచ్చిన ఆదాయాన్ని పుస్తకాలు కొనడానికి పరిశోధన చేయడానికి ఉపయోగించారు. గొప్ప దర్శకుడు బిఎన్‌రెడ్డి ఖడ్గతిక్కన చిత్రం తీయాలని తలపెట్టి సమాచారం అడిగితే ఖడ్గతిక్కన కవితిక్కన పూర్వాపరాలేమిటి లోతుగా తవ్వితీశారు.ఆ చిత్రం తీయలేదు గానీ తెలుగు సాహిత్య చరిత్రకు పునాదులు పడ్డాయి. అంతకుముందు కవుల చరిత్రలు కేవలం సాహిత్యకారులకే పరిమితమైనాయి. ఆరుద్ర వంటి వ్యక్తి రాయడం వల్లనే ఈ చరిత్ర గురించి కాస్త ఆసక్తివున్న చదువరులందరూ మాట్లాడుకునే అవకాశం కలిగింది. దాంట్లో సాహిత్య చరిత్రతో పాటు సామాజిక పరిణామం కూడా ఆయన నిక్షిప్తం చేశారు. మొదటి ముద్రణకు విశ్వనాథ సత్యనారాయణ, దివాకర్ల వెంకటావధాని, రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ వంటి పాతవారితో పీఠికలు రాయించిన ఆరుద్ర ప్రజాశక్తి మలిముద్రణలో ఆ పనిచేయలేదు. ఈ కాలమంతటా అధ్యయనం చేయడం వల్ల విషయాలపై మరింత స్పష్టత వచ్చిందనీ, నేరుగా విషయంలోకి వెళ్లడమే మంచిదని భావించానని వివరణ ఇచ్చారు. మార్క్సిస్టు దృక్పథంతో అగాధ అధ్యయనం చేసి సముద్రమంత సమాచారం విశ్లేషణ అందించినా ప్రత్యేకించి దాన్ని చాటుకోలేదు.రామాయణం,భారతం సహా ప్రాచీన కావ్యాల పట్ల సాహిత్యం పట్ల ఎలాంటి దృక్పథం అనుసరించాలనే దానికి ఆరుద్ర ప్రత్యక్ష ఉదాహరణ. తరతరాలుగా అల్లుకుపోయిన పురాణలు ఇతిహాసాల పట్ల అవహేళన కాదు, అవగాహన ముఖ్యం అని ఆయన చెబుతుండేవారు. ఈ రోజటి పాలకవర్గాలపై, దోపిడీదారులపై ఉపయోగించే భాష గతంపై వాడితే గాయపర్చడమా లేక జ్ఞానం పెంచడమా అనేది చూసుకోవాలన్నారు.మానవుడే మహనీయుడు అనడంలో ఆంతర్యం స్పష్టం. దేవాలయల మీద బూతు బొమ్మలెందుకు? అన్న తాపీ ధర్మారావుగారి రచనను స్మరిస్తూనే ‘గుడిలో సెక్సు’ అని కాలానుగుణంగా శీర్షిక మార్చి విషయం వివరాలు పెంచడం ఆరుద్ర పద్ధతి. తెలుగునాట ప్రసిద్ధ సామెత తీసుకుని ‘రాముడికి సీత ఏమవుతుంది’ వంటి రచనలతో సామాజిక పరిణామం చెబుతారు. ఇంద్రుడిని సవాలు చేసి గోవర్ధనగిరి నెత్తిన శ్రీకృష్ణుడు నాస్తికుడనీ, ఇంద్రుడు ప్రధాన దేవుడుగా ఉన్నప్పుడు ఉపేంద్రుడుగా ఉన్న విష్ణువు తర్వాత తనే దశావతారాలు దాల్చి దేవదేవుడై వెలసిన తీరు ఏమిటో ఆయన విశదీకరించినప్పుడు చాలామంది ఆశ్చర్చపోయారు.
పాటల్లోనూ అదే బాట
అన్ని చారిత్రిక ఆధారాలతో ఎవరూ ఆక్షేపించే అవకాశం లేకుండా జాగ్రత్త తీసుకునేవారు ఆరుద్ర. సినిమా పాటల్లో కూడా నమ్మకాలకూ చరిత్రకూ తేడా కూడా తప్పక పాటించేవారు. బాలరాజుకథలో ”మహాబలి పురం మహాబలిపురం..” అన్న పాటలో ”పాండవుల రథాలనీ పేరుబడ్డవి..” అని మాత్రమే అంటారు. అదే సినిమాలో మరోపాటలో ‘ఎక్కడ బడితే అక్కడ ఉంటే ఇక్కడికెందుకు వచ్చారని’ దేవుడి గురించి సన్యాసిని ప్రశ్నిస్తారు.” వేదంలా ప్రవహించే గోదావరి” అన్న పాటలో ”ఆది కవిత నన్నయ్య రాసెనిచ్చట” అన్నారే గానీ ఆదికవి నన్నయ్య అనకపోవడం గమనించదగ్గది, ”కట్టుకథల చిత్రాంగి కనకమేడలు” అంటూ ఆమె కథ కల్పనేనని సూచిస్తారు,”శ్రీకారం చుట్టుకుంది పెండ్లిపుస్తకం” పాట వింటే కూడా ”మనసు మనసు కలవడమే మంత్రం పరమార్థం” అన్నారే గానీ నమ్మకాలు ఆపాదించలేదు. ఈ మధ్య వీరంగం చేసిన హరిహరవీరమల్లు చిత్రం కోహినూర్‌ వజ్రం కథ అన్నారు గానీ ఆరుద్ర వ్యాసపీఠం చదివితే దాని అసలు కథ తెలుస్తుంది.
శ్రమజీవికి; స్త్రీలకూ గౌరవం
కమ్మరి చక్రం, సాలెల మగ్గం అని సహస్త్ర వృత్తుల సమస్త చిహ్నాలు అని శ్రీశ్రీ చెబితే ఆరుద్ర పంచాణం వారు అంటూ అయిదు వృత్తుల పరిణామక్రమాన్ని ఎప్పుడూ చెబుతూ వచ్చారు. ఏ సమాజంలోనైనా ఉత్పత్తి కులాల శ్రమజీవుల దళితుల జీవనక్రమం చూస్తేనే చరిత్ర అర్థమవుతుందనేవారు. స్త్రీలు ఏవైపున పమిట వేసు కుంటారనే దానికి కూడా ఈ పరిణామంతో సంబంధం ఉందని ఆయన చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తుంది. స్త్రీ పురుషులు, ఆడ మగ అని గాక ఆయన మనిషి ఆడమనిషి అని కావ్యం రాయడం అందుకే.మనిషి అన్న మాట పురుషులకే గనక ఆడమనిషి అనాలన్నది మానవుడు మానవి అనాలన్న భావనలాంటిదే. ఆయన విదేశీ పర్యటనలలో కూడా మార్క్సిస్టు సిద్ధాంతకర్తల చరిత్రకారులకు సంబంధించిన ఆధారాలు తీసుకురావడానికి పరితపించేవారు. దేశమంతటా మాత్రమే గాక ప్రపంచవ్యాపితంగా ప్రజాసాంసృతికోద్యమం ఏ విధంగా జరిగిందో గ్రంధస్తం చేయడం ఆయన లక్ష్యం.గురజాడ అప్పారావుకూ, పంజాబీ పూరణ్‌ సింగ్‌కూ సంబంధమేమిటో తెలంగాణకూ, గీతగోవిందానికి అనుబంధమేమిటో ఆయన వ్యాసాల్లో చూస్తాం. తనకన్నా ముందు రచనలు చేసిన ఆయన ఎప్పుడూ స్మరించేవారు. అంతర్జాతీయ గీతం అనువదించిన బాలాంత్రపు నళినీ కాంతారావుకే తన షష్టిపూర్తి సభలో ”ప్రజాకళలు ప్రగతివాదులు” సమర్పించారు. త్వమేవాహం అంటే నీవే నేను అని అర్థం. తెలంగాణ సాయుధ పోరాటంపై ఆ కావ్యం రాసిన ఆరుద్ర వ్యక్తిపూజకన్నా వ్యవస్థాగత మార్పు కీలకమనీ, అందుకు ఉద్యమించే శక్తులతో గొంతుకలిపి కదలడం రచయితల బాధ్యతనీ గుర్తించి ఆఖరుదాకా ప్రజాశక్తులతోనే నడిచారు. సోవియట్‌ విచ్ఛిన్నం తర్వాత కూడా మరో ప్రపంచం మారి మనీ ప్రపంచం గెలవలేదనీ, శ్రీశ్రీ పాటలో మహాప్రస్థానం సాగిద్దామనీ పిలుపునిచ్చారు. ”కలను నిజంచేసేది కాదు కవిత్వం/నిజాన్ని కలగనడం కవిత్వతత్వం” అంటూ వాస్తవికతకు పట్టం కట్టారు. సమసమాజం కోసం శాస్త్రీయ అధ్యయనం ఆచరణకు నిరంతరం ప్రేరణగా నిలిచే ఆరుద్ర మార్గంలో ముందుకుసాగుదాం. ఆయన మొదట్లోనే రాసినట్టు.
నీలాల నింగిలో
ఎర్రజండాలతో
ఎర్రజండాలతో
నీలాల నింగిలో
కదలవే కదలవే
కొత్తమార్గాలకై

తెలకపల్లి రవి

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad