అంకితభావంతో పనిచేయడం అందరికీ ఆదర్శప్రాయం
ఐద్వా, పార్టీ నిర్మాణంలో కీలక పాత్ర ఆమెది..
ఐద్వా లీగల్‌సెల్ ద్వారా బాధిత మహిళల సమస్యలకు పరిష్కారం
కమ్యూనిస్టు విలువలు పాటిస్తూ.. సమాజానికి ఆదర్శంగా నిలిచిన దంపతులు అరుణ, సాంబిరెడ్డి
ఆమెను కంటికిరెప్పలా కాపాడిన కుటుంబ సభ్యుల సేవలు మరువలేనివి
దేశానికి కమ్యూనిస్టులు ఎంతో అవసరం : ఐద్వా జాతీయ కోశాధికారి పుణ్యవతి
ఐద్వా ఆధ్వర్యంలో సీనియర్ నాయకురాలు
సి.అరుణ సంస్మరణ సభ
నవతెలంగాణ-సిటీబ్యూరో
క్రమశిక్షణ, నిబద్దత, అంకితభావంతో కూడిన వ్యక్తి ఐద్వా సీనియర్ నాయకురాలు సి.అరుణ్ అని, అంకితభావంతో పనిచేయడం అందరికీ ఆదర్శమని ఐద్వా జాతీయ కోశాధికారి పుణ్యవతి అన్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం దొడ్డి కొమురయ్య హాల్‌లో అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం(ఐద్వా) ఆధ్వర్యంలో అరుణ సంస్మరణ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా అరుణ చిత్రపటానికి ఐద్వా, సీపీఐ(ఎం) నాయకులు పూలమాలలు వేసి నివాళుర్పించారు. ఐద్వా నగర కార్యదర్శి నాగలక్ష్మి అధ్యక్షతన జరిగిన ఈ సభలో పుణ్యవతి మాట్లాడుతూ.. అరుణ అనంతరపురం నుంచి హైదరాబాద్ వచ్చిన తర్వాత ఐద్వా జిల్లా కోశాధికారి, అధ్యక్షురాలు, కార్యదర్శిగా సుదీర్ఘకాలం పనిచేశారన్నారు. కార్యకర్తల తయారీతోపాటు మహిళల హక్కుల కోసం, వారి సమస్యల పరిష్కారం కోసం అనేక ఉద్యమాల్లో పాల్గొన్నదని గుర్తుచేశారు. కార్యకర్తల అందరితో అప్యాయంగా ఉంటూ.. వారందరిని పనిలో ఉండేలా ఉత్సాహపరిచేవారన్నారు. సాంబిరెడ్డి లెక్చరర్‌గా ఉద్యోగం వదిలేసిన వచ్చిన ఆయన ఆశయాల బాటలో నడుస్తూ.. ఎన్నో సౌకర్యాలు పొందే అవకాశం ఉన్నా ఎస్వీకే కాంప్లెక్స్‌లో రెండు చిన్న గదుల్లో సాధారణ జీవితం గడుపుతూ.. చుట్టుపక్కల ఐద్వా, పార్టీ నిర్మాణానికి నిర్విరామంగా కృషి చేశారని తెలిపారు. సీపీఐ(ఎం) పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ.. సాంబిరెడ్డి, అరుణ ఆదర్శదంపతులని అన్నారు. కమ్యూనిస్టు విలువలు కచ్చితంగా పాటిస్తూ.. జీవిత కాలం పార్టీ కోసమే అంకితమై కృషి చేయడం చాలా కష్ట సాధ్యమనీ.. కానీ వారు అటువంటి కమ్యూనిస్టు విలువలు పాటిస్తూ.. సమాజానికి ఎంతో ఆదర్శంగా నిలిచారన్నారు. సోషలిజమే దేశానికి ప్రత్యామ్నాయమనీ.. దేశానికి కమ్యూనిస్టుల అవసరం ఇప్పుడు చాలా ఉందన్నారు.
ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షులు టి.జ్యోతి మాట్లాడుతూ.. సాధారణ మహిళలను సంఘ కార్యక్రమాల్లో మమేకం చేయడంలో, బస్తీల్లో స్థానిక సమస్యలైన రేషన్ కార్డులు, ఇండ్లు, ఇంటి స్థలాలు, తాగునీరు, మరుగుదొడ్లు, మద్యం, మహిళలపై పెరుగుతున్న హింస, పొదుపు గ్రూపులు వంటి అన్ని రకాల దైనందిన సమస్యలపై వారిని కదిలించి.. ఫలితాలు వచ్చేవరకు పోరాటం నడిపిందన్నారు. పార్టీ సభ్యత్వాల కోసం ఎక్కని మెట్లు, ఇండ్లు లేవన్నారు. 20 ఏండ్ల పాటు లీగల్ కౌన్సెలింగ్ సెంటర్‌ను నడిపి.. ఎంతో మంది బాధిత మహిళల సమస్యలకు పరిష్కారం చూపారని తెలిపారు. సంఘం అకౌంట్స్‌ను చాలా పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించారని, ప్రతి పైసాకూ జవాబుదారీతనం ఉండేదన్నారు. అరుణ చాలా నిరాండబర జీవితం గడిపేవారన్నారు. తను నమ్మిన ఆశయం కోసం ఎంతో కష్టపడి పనిచేసిందన్నారు.
అనారోగ్యానికి గురైన అరుణను మూడేండ్ల కాలంలో కంటికి రెప్పలా కాపాడిన ఆమె కుటుంబ సభ్యులు సమాజానికి ఆదర్శప్రాయులు అని అన్నారు. పోరాటాలు ఉన్నంతకాలం అరుణ జ్ఞాపకాలు ఉంటాయని, ఆమె ఆశయాలు ముందుకు తీసుకువెళ్దామని తెలిపారు. పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు వీరయ్య, సిటీ పార్టీ మాజీ కార్యదర్శి పీఎస్‌ఎన్ మూర్తి, ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి, ఎస్‌ఎఫ్‌ఐ మాజీ ప్రధాన కార్యదర్శి ఎం.శ్రీనివాస్, రామసుబ్బారెడ్డి, అబ్దుల్ ఖాదర్, కొండారెడ్డి(అనంతరపురం), వెంకట సుబ్బయ్య తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎస్వీకే మాజీ మేనేజింగ్ సెక్రటరీ సాంబిరెడ్డి, ఐద్వా రాష్ట్ర అధ్యక్షులు అరుణజ్యోతి, సీపీఐ(ఎం) గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కార్యదర్శి ఎం.వెంకటేష్, నాయకులు మూర్తినాయుడు, ఐద్వా నాయకులు వినోద, శశికళ, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.
క్రమశిక్షణ, నిబద్ధత గల వ్యక్తి అరుణ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES