మే 2 ఉదయం 10 గంటలకు ఐద్వా (అఖిల భారత ప్రజాతంత్ర మహిళాసంఘం) సీనియర్‌నేత కామ్రేడ్ అరుణ (అందరికీ అరుణాంటీ) మరణవార్త విని అచేతనురాలినయ్యాను. కొద్దిసేపటి తర్వాత తేరుకుని, అవునూ! ఆంటీ దాదాపుగా రెండున్నరేండ్ల నుండి అనారోగ్యంతో బెడ్‌పైనే ఉండి అలవికాని శారీరక, మానసిక బాధ అనుభవిస్తున్నది కదా! అది చూసినప్పుడుల్లా నేను కూడా వేధనపడ్డాను కదా! మరి ఇప్పుడు ఆ బాధ నుండి ఆంటీకి విముక్తి దొరికిందని నేను స్వాంతన పొందాలి గాని, మనుసును నులిపెడుతున్న ఈ బాధేమిటి?
హైదరాబాదు నగర మహిళా ఉద్యమంలో ఆంటీతో పాటు, సుదీర్ఘకాలం పనిచేసిన అనుభవాలు, జ్ఞాపకాలు నన్ను చుట్టుముట్టుతున్నాయి. ఆ రీల్స్ అన్నీ నా కళ్ళముందు కదులుతున్నాయి. 1991లో హైదరాబాదు నగర కార్యదర్శిగా నేను, అధ్యక్షురాలుగా పి.అరుణ, కోశాధికారిగా ‘అరుణాంటీ’ బాధ్యతల్లోకి వచ్చాము. అది మొదలు నగర మహిళా ఉద్యమంలో అడుగడుగునా ఆంటీ తన పాత్ర నిర్వర్తించింది. హైదరాబాదు నగర కోశాధికారిగా, కార్యదర్శిగా, అధ్యక్షురాలిగా, ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ కన్వీనర్‌గా, రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా, సీపీఐ(ఎం) నగర కమిటీ సభ్యులుగా చాలా సమర్ధవంతంగా బాధ్యతలు నిర్వర్తించింది. బాగ్‌లింగంపల్లితో పాటు, చుట్టు పక్కల బస్తీల్లో మహిళా ఉద్యమ నిర్మాణంలో కీలకపాత్ర పోషించింది. కార్యకర్తల తయారీతో పాటు, మహిళల హక్కులకోసం, వారి సమస్యల పరిష్కారంకోసం అనేక ఉద్యమాల్లో పాల్గొన్నది.
చిక్కడపల్లి డివిజన్‌లో మహిళలను సంఘంలో చేర్పించడానికి ఎస్వీకేలో పనిచేస్తున్న మహిళా సిబ్బంది లక్ష్మి, కృష్ణకుమారి, ఎల్లమ్మలతో పాటు, లోకల్ ఏరియా సభ్యులను కలుపుకుని పనిచేసింది. సంఘం ఆశయాలు, కర్తవ్యాలు వివరించడంతో పాటు, ఐద్వా కార్యక్రమాలకు నిధి వసూలు చేసేది. బాధ్యత తీసుకున్న కమిటీని పనిచేయించడంలో, సాధారణ మహిళలను సంఘ కార్యక్రమాల్లో మమేకం చేయడంలో, బస్తీల్లో స్థానిక సమస్యలైన రేషన్‌కార్డులు, ఇండ్లు, ఇంటి స్థలాలు, మంచినీరు, మరుగుదొడ్లు, మద్యం, మహిళలపై పెరుగుతున్న హింస, పొదుపు గ్రూపులు… ఒకటా రెండా అన్ని రకాల దైనందిన సమస్యలపై వారిని కదిలించి, ఫలితాలు వచ్చే వరకు పోరాటం నడిపేది. మిర్యాలగూడ ఎంపీగా మల్లు స్వరాజ్యం, ఇబ్రహీంపట్నం ఎంఎల్‌ఏగా కొండిగారి రాములు, భువనగిరి ఎంఎల్‌ఏగా మందుల సువర్ణ తదితరులు పోటీ చేస్తున్నప్పుడు నెల రోజులపాటు అక్కడే ఉండి ఎన్నికల క్యాంపెయిన్‌లో పాల్గొని, ప్రజాతంత్ర ఉద్యమమిచ్చిన కర్తవ్యాన్ని అమలు చేసారు. కుటుంబ న్యాయ సలహా కేంద్రం కన్వీనర్‌గా దాదాపు 20ఏండ్ల పాటు కొనసాగారు. ఉమా, రాధిక (అడ్వకేట్), నర్సమ్మ, గౌరి, భారతి తదితరులు సభ్యులుగా ఈ సెంటర్‌ను నిరంతరాయంగా నడిపింది. గోల్కొండ చౌరస్తాలో ఉన్న ఆఫీస్ కేంద్రంగా నడిచిన ఈ సెంటర్ ఎందరో బాధిత మహిళలకు అండగా నిలబడింది. సరళీకృత ఆర్థిక విధానాల నేపథ్యంలో మహిళలపై బహుముఖాలుగా పెరుగుతున్న హింస, వివిధ ధోరణులను అధ్యయనం చేయడానికి, విశ్లేషించుకోవడానికి, అందులో నుండి డిమాండ్లు రూపొందించుకోవడానికి కౌన్సిలింగ్ సెంటర్ నివేదికలు చాలా తోడ్పడ్డాయి. ఈ సెంటర్ నుండి రూపొందించిన రిపోర్టు రాష్ట్ర మహిళా కమిషన్ ముందుంచి సాధికారికంగా చర్చించడానికి తోడ్పడింది. నేటికీ గోల్కొండ చౌరస్తాలో ఐద్వా ఆఫీస్ నుండి నడుస్తున్న ఈ సెంటర్ అదే పద్ధతుల్లో అప్రతిహతంగా కొనసాగుతోంది.
ఐద్వా నగర కమిటీకి దాదాపు 15 ఏండ్లు కోశాధికారిగా ఉన్నారు. సంఘం అకౌంట్స్‌ను చాలా పకడ్బంధీగా, పారదర్శకంగా నిర్వహించేవారు. అక్కౌంట్స్ విషయంలో చాలా కచ్చితంగా ఉండేవారు. ప్రతి పైసాకు జవాబుదారీతనం ఉండేది. లెక్కలు రాయడంలో తాను ఆచరిస్తూ, కేడర్ అనుసరించేట్టు చేసింది. ఆంటీ అక్కౌంట్స్ రాసే పద్ధతి చూసి సోదర సంఘాల నాయకులు ఆశ్చర్యపోయేవారు. ప్రతి ఏడాది ఆడిట్ చేయించి, కమిటీ ముందుంచి ఆమోదం తీసుకునేవారు.
ఆంటీ చాలా నిరాడంబర జీవితం గడిపేవారు. సాదాసీదా కాటన్ చీరలు ధరించడంతో పాటు, బస్సులోనే నిత్యం ప్రయాణం చేసేవారు. డైరెక్ట్ బస్సు సౌకర్యం లేకపోవడంతో బాగ్‌లింగంపల్లిలో బస్ ఎక్కి, వీఎస్‌టీ దగ్గర దిగి గోల్కొండ చౌరస్తాలోని ఐద్వా ఆఫీస్‌కు నడిచివచ్చేది. తనతో పాటు, మధ్యాహ్న భోజనం ఇంటినుండి తెచ్చుకుని, కేడర్‌ను కూడా టిఫిన్ బాక్స్ బ్యాగులో పెట్టుకోవాలని, సమయానికి తిని, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చెప్పేది. తాను వచ్చిన కుటుంబ నేపథ్యం అనేక సౌకర్యాలు పొందే అవకాశాలున్నప్పటికీ నిరాడంబర జీవితాన్నే ఆంటీ ఇష్టపడేది.
బాగ్‌లింగంపల్లితో పాటు అంబర్‌పేట, బతుకమ్మ కుంట, ముషీరాబాదు, కవాడీగూడ, రాంనగర్, అడ్డగుట్ట, ఉప్పుగూడ.. ఇలా చెప్పుకుంటూ పోతే నగరంలో అన్ని బస్తీలు, కాలనీలు ఆంటీకి కొట్టిన పిండి. కేడర్‌తో మమేకమయ్యేది.
మేము సంఘ బాధ్యతల్లోకి వచ్చాక నగరంలో మహిళా ఉద్యమ నిర్మాణంలో నేను, ఆంటీ, ప్రసన్న, పద్మశ్రీ, గౌరి, నాగలక్ష్మి, లక్ష్మమ్మ, విమల, పద్మ, అరుణజ్యోతి, లీలావతి, శారద, మీన, భవాని, నాగమణి, శశికళ తదితరులం కలిసి మహిళల్లోకి వెళ్ళడానికి అనేక శోధనలు చేసాం. నగరంలో 10లక్షలుగా ఉన్న ఇంటి పనివాళ్ళను సంఘటితం చేసేందుకు ‘స్నేహ ఇంటి పనివారల సంక్షేమ సంఘం’ ఏర్పాటు చేసి, నగర వ్యాపితంగా నిర్మించి, కనీస వేతన చట్టం సాధించాం. ప్రసార మాధ్యమాల్లో మహిళల అస్థిత్వాన్ని కించపరచడాన్ని వ్యతిరేకిస్తూ పద్మశ్రీ కన్వీనర్‌గా మీడియా సబ్ కమిటీని ఏర్పాటు చేసి మధ్యతరగతి మహిళల్లో పనిచేయడం, ప్రసన్న కన్వీనర్‌గా లక్షలాది మంది మహిళలు సంఘటితంగా ఉన్న డ్వాక్రా గ్రూపులను నిర్మించి ఆర్గనైజ్ చేయడం, కౌన్సిలింగ్ సెంటర్ ద్వారా మహిళలకు భరోసా కల్పించడం, స్థానిక సమస్యలపై చివరికంట వివిధ రూపాల్లో పోరాటాలు నిర్వహించడం, బహుళవర్గ సంఘమైన ఐద్వా విస్తరణకు, ప్రజా పునాది పెంచుకోవడానికి చాలా తోడ్పడ్డాయి.
ఆంటీ సుదీర్ఘకాల జీవితం మహిళా ఉద్యమంతో పెనవేసుకుంది. అనారోగ్య సమయంలో కూడా కార్యకర్తల పేర్లు గుర్తుపెట్టుకొని పదేపదే ప్రస్థావించింది. ఫిజియోథెరపీ డాక్టర్ మీ క్లోజ్ ఫ్రెండెవరు? పిలిపిస్తామని ఆంటీని అడిగితే ‘జ్యోతి’ అని చెప్పిందట. ఆంటీ భర్త సాంబిరెడ్డి అంకుల్ వెంటనే నాకు ఫోన్ చేసి ‘అమ్మా జ్యోతి.. డాక్టర్ అడిగినప్పుడు మీ ఆంటీ నీ పేరు చెప్పిందమ్మా, ఒకసారి వచ్చి ఆంటీని కలువమ్మా’ అని చెప్పారు. వెంటనే ఆంటీ దగ్గరకు వెళ్ళి రెండుమూడు గంటలు గడిపాను. సంఘంతో పాటు, కేడర్ విషయాలు చాలా ప్రస్థావించింది. కానీ ఆంటీని ఆ పరిస్థితుల్లో చూసి తట్టుకోవడం కష్టమైంది. ఆ తర్వాత మూడునాలుగు సార్లు ఆంటీని కలిసినప్పటికీ ఆంటీ పడే వేదన చూసి చాలా బాధనిపించేది.
సాంబిరెడ్డిగారు సుందరయ్య విజ్ఞానకేంద్రం ట్రస్ట్ బాధ్యతల్లోకి వచ్చాక, ఆ కాంపౌండ్‌లోనే నివాసముండేవారు. ఇక మా అందరికీ ఆ ఇల్లు ఒక సెంటర్. ఎన్నో మీటింగులు అక్కడే జరిగేవి. ఆంటీ చేతివంట తినని కేడర్ లేదు. ఎస్వీకే వెనకాలే ఎల్‌ఐజీలో ఉంటూ ఆంటీ చేతి రుచికరమైన వంటను అత్యధికంగా ఆస్వాదించింది నేనేనేమో. నగర ఉద్యమ నిర్మాణం, పోరాటాలు, కేడర్‌తో అనుబంధం అన్నింటిలో అడుగడుగునా ఆంటీ నాతో పాటు ఉంది. కళ్ళు నీటితో మసకబారుతున్నాయి. పెన్ను ముందుకు సాగడంలేదు. ఆంటీలాంటి సహచరులుంటే ఉద్యమంలో కేడర్ కచ్చితంగా నిలబడతారు కదా!
ఆంటీ చాలా ఓపికతో నిరంతరం మహిళల్లో ఉంటూ, వారి కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ, సమస్యల ఆధారంగా వారిని కదిలిస్తూ ఉద్యమాలు నిర్మించింది. తాను నమ్మిన సిద్ధాంతం, ఎంచుకున్న లక్ష్యం పట్ల పూర్తి విశ్వాసం, అంకితభావంతో పనిచేసింది. అందుకే ఆంటీ అనుసరించిన క్రమశిక్షణ, కష్టపడే స్వభావం, నిబద్ధత, నిరాడంబరత, నిక్కచ్చి స్వభావం, తీసుకున్న బాధ్యత పూర్తిచేయడం తదితరాలన్నీ నేడు కార్యకర్తలకు అనుసరణీయాలు, స్ఫూర్తిదాయకాలు.
ఇక చివరలో నేను చెప్పేదొకటుంది. దాదాపుగా మూడేండ్లపాటు ఆంటీ అనారోగ్యంతో బెడ్‌పైనే ఉంటే, భర్త సాంబిరెడ్డి గారు, కుమారుడు డాక్టర్ అంజిరెడ్డి, కోడలు రాధిక, మనవళ్ళు రిషీ, సుహాస్ పూర్తిగా ఆమె ఆరోగ్యంపైనే కేంద్రీకరించి ఒక పసిపాపలా చూసుకున్న తీరు ఎనలేనిది. ఇది కదా కుటుంబం నుంచి కావాల్సింది. ప్రజాతంత్ర ఉద్యమంలో పనిచేసే మహిళా కార్యకర్తలకు ఇటు కుటుంబం, అటు ఉద్యమం రెండింటినీ సమన్వయం చేసుకోవడం కత్తిమీద సాములాంటిది. మహిళలు సంఘంలో పనిచేయ డం, నాయకురాలిగా ఎదగడం, జీవిత సహచరుడైన భర్త, కుటుంబం అందించే సహకారంపైనే ఆధారపడి ఉంటుంది. అటువంటి అద్భుతమైన సహకారం ఆంటీకి అందింది. వారి కుటుంబ సభ్యులందరికీ పేరుపేరున ధన్యవాదాలు.
వివక్ష, అణచివేత, దోపిడీ కొనసాగినంతకాలం వాటిని రూపుమాపేందుకు పోరాటాలుంటాయి. అవి ఉన్నంతకాలం ఆంటీ జ్ఞాపకాలు సజీవంగా ఉంటాయి. ఆంటీ… మీరిచ్చిన స్ఫూర్తే మాకు ఆదర్శం. కడవరకూ కొనసాగిస్తాం.
రెడ్ సెల్యూట్ అరుణాంటీ…
- టి.జ్యోతి
ఐద్వా, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు