Sunday, August 24, 2025
E-PAPER
spot_img
Homeఎడిట్ పేజిఅరుణ సమరసేనాని

అరుణ సమరసేనాని

- Advertisement -

ఒక పీడిత జన బాంధవుడు నిష్క్రమించాడు. ఒక పోరాట స్వరం మూగబోయింది. అతడనేక ప్రజాసమరాలను నడిపించిన నాయకుడు. నిబద్ధ కమ్యూనిస్టు యోధుడు. మానవీయ విలువలకు, స్నేహ సంబంధాలకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన ఆశయ పథగామి, భారత కమ్యూనిస్టు పార్టీ జాతీయ నాయకుడు సురవరం సుధాకర రెడ్డి మరణం కమ్యూనిస్టు ఉద్యమానికి తీరనిలోటు. 84 సంవత్సరాల వయోభారపు అనారోగ్యంతో హైదరాబాదులో ఆయన తుది శ్వాస విడిచారు. చివరి శ్వాసవరకూ కమ్యూనిస్టు సైద్ధాంతిక నిబద్ధతను, అంకిత భావాన్ని కలిగి ఉన్న మహౌన్నత వ్యక్తిత్వం ఆయనది. ఆరుపదుల ఉద్యమ పయనంలో అలుపులేని పోరాట ధీరుడు. విద్యార్థి దశ నుండే కమ్యూనిస్టు భావాల ప్రేరణతో ఉద్యమబాట పట్టి, విద్యార్థి సంఘనేతగా మొదలయి భారత కమ్యూనిస్టు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎదిగిన అరుణ సమరసేనాని సురవరం. తెలంగాణ నేల నుండి జాతీయ స్థాయికి చేరుకున్న కమ్యూనిస్టు దిగ్గజం.

తెలంగాణ సాంస్కృతిక రంగ వైతాళికుడు, గోల్కొండ పత్రిక వ్యవస్థాపకుడు సురవరం ప్రతాపరెడ్డి సోదరుడు వెంకట రామిరెడ్డి తనయుడుగా వారి వారసత్వపు చైతన్యాన్ని పుణికి పుచ్చుకున్న వారు సుధాకరరెడ్డి. తండ్రి తెలంగాణా సాయుధ పోరాట యోధుడు కావటం వలన చిన్నతనంలోనే వీరిలో భావజాల ప్రభావం కలిగింది. మహబూబ్‌నగర్‌ జిల్లా కొడ్రావుపల్లి గ్రామంలో 1942 మార్చి 25న జన్మించిన సురవరం, కర్నూలులో విద్యనభ్యసించిన సమయంలోనే విద్యార్థుల సమస్యలపై ఉద్యమం చేపట్టారు. అఖిల భారత విద్యార్థి సంఘంలో నాయకునిగా అడుగులు వేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్ర విద్యను గరిపి విద్యార్థి సంఘ జాతీయ నాయకునిగా ఎదిగారు. ఆ తర్వాత యువజన సంఘ నాయకునిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. ఉమ్మడి రాష్ట్రానికి కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శిగానూ 2012 నుండి 2019 వరకు మూడు పర్యాయాలు సిపిఐకి జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించిన సురవరం నల్లగొండ లోక్‌సభ నియోజకవర్గం నుండి రెండుసార్లు గెలిచారు. కార్మిక పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీకి ఛైర్మన్‌గా, అనేక కమిటీలలో సభ్యులుగా సేవలందించారు. లోక్‌సభలో ప్రజా సమస్యలను వినిపించడంలో ముందుండేవారు. స్పష్టమైన అభిప్రాయాలతో అనర్గళంగా మాట్లాడగలిగిన ఉపన్యాసకుడు.

అంతర్జాతీయంగా సామ్రాజ్యవాదం చేస్తున్న యుద్ధాల గురించి, దోపిడీ గురించి, జాతీయంగా ముంచుకొస్తున్న మతోన్మాదం, కార్పొరేట్‌ దోపిడీ గురించి విడమరచి వివరించగల మేధోసంపన్నుడు సురవరం. నిత్య అధ్యయనశీలి, అనారోగ్య సమయాలలోనూ అధ్యయనాన్ని కొనసాగించి వామపక్ష, అభ్యుదయ శక్తులకు ప్రేరణను అందించిన చైతన్యశీలి. వామపక్ష ఉద్యమాల ఐక్యతను బలంగా కోరుకున్నారు. అందుకు తీవ్రంగా కృషి చేశారు. నేటి మతతత్వ శక్తుల విస్తరణను తిప్పికొట్టేందుకు సమష్టిగా కృషిచేయాలని తపనపడ్డారు. నేడు బీజేపీ నియోఫాసిస్టు ధోరణులతో దేశంలో ఉన్మాదాన్ని సృష్టిస్తూ, ప్రజాస్వామ్య లౌకిక వ్యవస్థలను ధ్వంసం చేస్తున్న తరుణంలో, దీనికి వ్యతిరేకంగా పోరాడుతున్న శక్తులందరికీ సురవరం మరణం ఒక లోటు. వారు, మనకందించిన పోరాట స్ఫూర్తితో మరింత పదునుగా ఉద్యమాలను ముందుకు తీసుకొనిపోవటమే ఆయనకు మనమందించే నిజమైన నివాళి. వ్యక్తిగతంగా సురవరం నాయకులతో, కార్యకర్తలతో కొనసాగించిన ఆత్మీయ సంబంధాలు, స్నేహం, ప్రేమ, గౌరవమర్యాదలు ఎంతో ఆకట్టుకునేవి. కమ్యూనిస్టులు అనగానే ఎంతో వాత్సల్యాన్ని చూపేవారు. ఆదరించేవారు. ప్రజాస్వామిక, మానవీయ విప్లవ విలువలతో బతికిన సురవరం జీవితం స్ఫూర్తిదాయకం. అందుకే ”వామపక్ష నేతగా ఆయన దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయమని, లౌకిక ప్రజాస్వామిక ఉద్యమాలకు ఆయన మరణం తీరని లోట”ని, సీపీఐ(ఎం) తీవ్ర సంతాపాన్ని తెలియజేసింది. సార్థకమైన జీవితాన్ని గడిపిన సురవరం ఆదర్శ కమ్యూనిస్టునేత. వారికి విప్లవ జోహార్లు!

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad