ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే కొండిగారి రాములు కన్నుమూత
1989, 1999 ఎమ్మెల్యేగా విజయం
సీపీఐ(ఎం), వామపక్ష, కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీల నేతల సంతాపం
నివాళి అర్పించిన ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, డీజీపి శివధర్‌రెడ్డి
నవతెలంగాణ-ఇబ్రహీంపట్నం
ఓ అరుణతార నేల రాలింది.. సీపీఐ(ఎం) ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే కొండిగారి రాములు(95) శుక్రవారం తుదిశ్వాస విడిచారు. కొద్దికాలంగా అనార్యోగంతో బాధపడుతున్న ఆయన పరిస్థితి విషమించి శుక్రవారం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని తన నివాసంలో కన్నుమూశారు. అతని భార్య ఇటీవలే చనిపోయింది. వీరికి ముగ్గురు కొడుకులు కాగా.. ఒకరు అనారోగ్యంతో చనిపోయారు. కొండిగారి రాములు మృతి పట్ల పలువురు సంతాపం తెలిపారు.
సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి పి.యాదయ్య, రైతు సంఘం రాష్ట్ర నాయకులు పి.జంగారెడ్డి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సామెల్, జగదీశ్, కె.జగన్, రాంచందర్, కవిత, ఏర్పుల నర్సింహా, జిల్లా కమిటీ సభ్యులు సంతాపాన్ని ప్రకటించారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డితో పాటు రాష్ట్ర డీజీపీ శివధర్‌రెడ్డి, మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పి.సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, పల్లా వెంకట్‌రెడ్డి, బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు క్యామ మల్లేష్ సంతాపం ప్రకటించారు. నివాళి అర్పించారు. అలాగే ఇతర వామపక్ష నేతలు, రాములు మృతదేహానికి నివాళి అర్పించి, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కొండిగారి రాములు నీతి, నిజాయితీకి మారుపేరుగా నిలిచారని కొనియాడారు.
ప్రజలే ఆస్తిగా..
కొండిగారి రాములుది ఆరుట్ల స్వగ్రామం. 1952-1957వరకు యువజన, విద్యార్ధి సంఘాల్లో పని చేశారు. ఆరుట్లలో 1967 మొదటగా ప్రారంభమైన భూ పోరాట సమితిలో కృష్ణమూర్తి నాయకత్వంలో పనిచేశారు. భూ పొరాటం సందర్భంగా రాములుపై 1989-2007 వరకు 52 కేసులు నమోదయ్యాయి. ఎర్రజెండా నాయకత్వంలో దున్నేవానికే భూమి దక్కాలని, వెట్టి చాకిరి పోవాలని సాగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంతో ఊరూరా ఉరకలేస్తున్న కాలం. అనేక విజయాలు సాధించిన రైతాంగం కమ్యూనిస్టుల వెన్నంటి సాగుతున్న పోరాటాలు. 1989 వరకు కమ్యూనిస్టులను తట్టుకునే పరిస్థితి నాటి కాంగ్రెస్ పాలకులకు సాధ్యం కాలేదు.
కామ్రేడ్ పాషా, నరహరి హత్య ఉదంతం తర్వాత వారి వారసులుగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో కొండిగారి రాములు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1989, 1994లో జరిగిన ఎన్నికల్లో రెండు పర్యాయాలు ఆయన విజయం సాధించారు. రెండు సార్లు ఎమ్మెల్యే అయినా సాధారణ జీవితం గడిపారు. రూపాయి కూడబెట్టుకోలేదు. ప్రజలే ఆస్తిగా.. వారి శ్రేయస్సు కోసమే పని చేశారు. ఒకానొకదశలో కుమారుడికి వైద్యం చేయించుకునే ఆర్థిక స్థోమత లేక దూరం చేసుకున్నాడు. తుదిశ్వాస వదిలే వరకూ ఓ చిన్న ఇంట్లో, తన పెన్షన్‌తోనే జీవితం గడిపి, నేటి తరం రాజకీయ నాయకులకు ఆదర్శంగా నిలిచారు.



