కివీస్‌పై 4 వికెట్ల తేడాతో భారత్ గెలుపు
ఛేదనలో రాణించిన శ్రేయస్, శుభ్‌మన్
వడోదర ఏకపక్షం అనుకుంటే.. ఆఖరు వరకు ఉత్కంఠరేపింది. 301 పరుగుల ఛేదనలో విరాట్ కోహ్లి (93), శుభ్‌మన్ గిల్ (56) రాణించటంతో భారత్ గెలుపు లాంఛనమే అనిపించింది. శ్రేయస్ అయ్యర్ (49), విరాట్ కోహ్లి స్వల్ప వ్యవధిలో పెవిలియన్‌కు చేరగా.. భారత్ ఒత్తిడిలో పడింది. ఆఖర్లో కెఎల్ రాహుల్ (29 నాటౌట్) సమయోచిత ఇన్నింగ్స్‌తో భారత్‌ను గెలుపు తీరాలకు చేర్చాడు. తొలి వన్డేలో భారత్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. మూడు వన్డేల సిరీస్‌లో 1-0తో ఆధిక్యం సాధించింది.
నవతెలంగాణ-వడోదర
విరాట్ కోహ్లి (93, 91 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్) మరోసారి ఛేదనలో చెలరేగాడు. భీకర ఫామ్‌లో ఉన్న కోహ్లి మరో సెంచరీ సాధించేలా కనిపించినా.. మైలురాయికి ఏడు పరుగుల దూరంలో ఆగిపోయాడు. విరాట్ కోహ్లికి తోడు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (56, 71 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (49, 47 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌లు) రాణించారు. దీంతో న్యూజిలాండ్‌తో తొలి వన్డేలో భారత్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. కెఎల్ రాహుల్ (29 నాటౌట్, 21 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) మెరిశాడు.
అంతకుముందు న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 300 పరుగులు చేసింది. డార్లీ మిచెల్ (84, 71 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లు), డెవాన్ కాన్వే (56, 67 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్), హెన్రీ నికోల్స్ (62, 69 బంతుల్లో 8 ఫోర్లు) అర్థ సెంచరీలు సాధించారు. భారత బౌలర్లలో మహ్మద్ సిరాజ (2/40), హర్షిత్ రానా (2/65), ప్రసిద్ కృష్ణ (2/60) రెండేసి వికెట్లు పడగొట్టారు. ఛేదనలో చెలరేగిన విరాట్ కోహ్లి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. భారత్, న్యూజిలాండ్ రెండో వన్డే బుధవారం రాజ్‌కోట్‌లో జరుగుతుంది.
విరాట్ మెరువగా
దక్షిణాఫ్రికాపై రెండు సెంచరీలు, ఓ అజేయ ఫిఫ్టీ సాధించిన విరాటన కోహ్లి.. అదే జోరు న్యూజిలాండ్‌పై కొనసాగించాడు. న్యూజిలాండ్ బౌలర్లను అలవోకగా ఎదుర్కొన్న కోహ్లి.. మరో సెంచరీ సాధించేలా కనిపించాడు. ఆరు ఫోర్లతో 44 బంతుల్లోనే అర్థ సెంచరీ సాధించిన కోహ్లి… ఆతిథ్య జట్టును గెలుపు దిశగా నడిపించాడు. కోహ్లికి వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (49), కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (56) చక్కటి సహకారం అందించారు. విరాట్ కోహ్లి, శుభ్‌మన్ గిల్ రెండో వికెట్‌కు 118 పరుగులు జోడించగా… మూడో వికెట్‌కు కోహ్లి, శ్రేయస్ అయ్యర్‌లు 77 పరుగులు జత చేశారు. కోహ్లి క్రీజులో ఉండగా న్యూజిలాండ్‌కు మ్యాచ్‌పై ఎటువంటి ఆశలు లేవు. కానీ అతడు నిష్క్రమించగానే కివీస్ రేసులోకి వచ్చింది.
శ్రేయస్ అయ్యర్, రవీంద్ర జడేజా (4)లను సైతం సాగనంపిన కివీస్ బౌలర్లు.. భారత్‌ను ఒత్తిడిలో పడేశారు. కెఎల్ రాహుల్ (29 నాటౌట్), హర్షిత్ రానా (29) ఈ సమయంలో కీలక భాగస్వామ్యం నమోదు చేశారు. వాషింగ్టన్ సుందర్ (7 నాటౌట్) తోడుగా కెఎల్ రాహుల్ లాంఛనం ముగించాడు. ఇన్నింగ్స్ 49వ ఓవర్లో వరుసగా రెండు బౌండరీలు, ఓ సిక్సర్‌తో భారత్‌కు మరో 6 బంతులు ఉండగానే విజయాన్ని అందించాడు. ఓపెనర్లు రోహిత్ శర్మ (26, 29 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), శుభ్‌మన్ గిల్ తొలి వికెట్‌కు 39 పరుగులే జోడించారు. అయినా, కోహ్లి మేనియాతో భారత్ మెరుపు విజయం అందుకుంది. న్యూజిలాండ్ పేసర్ కైల్ జెమీసన్ (4/41) నాలుగు వికెట్లు పడగొట్టాడు.
ఆ ముగ్గురు రాణించగా
న్యూజిలాండ్‌కు ఓపెనర్లు డెవాన్ కాన్వే (56), హెన్రీ నికోల్స్ (62) అదిరే ఆరంభం అందించారు. అర్థ సెంచరీలు సాధించిన ఓపెనర్లు తొలి వికెట్‌కు 117 పరుగులు జోడించారు. పేసర్ హర్షిత్ రానా వరుస ఓవర్లలో ఓపెనర్లను సాగనంపటంతో కివీస్ దూకుడుకు కళ్లెం పడింది. మిడిల్ ఆర్డర్‌లో విల్ యంగ్ (12), గ్లెన్ ఫిలిప్స్ (12) విఫలమైనా… డార్లీ మిచెల్ (84) అర్థ సెంచరీతో మెరిశాడు. లోయర్ ఆర్డర్‌లో క్రిస్టియన్ క్లార్క్ (24 నాటౌట్, 17 బంతుల్లో 3 ఫోర్లు), మిచెల్ హే (18), మైకల్ బ్రాస్‌వెల్ (16) మెరిశారు. ఫలితంగా ఆ జట్టు 50 ఓవర్లలో 8 వికెట్లకు 300 పరుగులు చేసింది.
సంక్షిప్త స్కోరు వివరాలు :
న్యూజిలాండ్ ఇన్నింగ్స్ : 300/8 (డార్లీ మిచెల్ 84, హెన్రీ నికోల్స్ 62, డెవాన్ కాన్వే 56, సిరాజ్ 2/40)
భారత్ ఇన్నింగ్స్ : 306/6 (విరాట్ కోహ్లి 93, శుభ్‌మన్ గిల్ 56, శ్రేయస్ అయ్యర్ 49, జెమీసన్ 4/40)



