– సంఘం మహిళా నేత భారతి
నవతెలంగాణ – అశ్వారావుపేట
ఆశా వర్కర్ లకు బకాయి వేతనాలు వెంటనే విడుదల చేయాలని,నిర్ణీత వేతనం రూ.18 వేలు నిర్ణయించి అమలు చేయాలని,కాంగ్రెస్ ప్రభుత్వం ఆశాలకు ఇచ్చిన ఎన్నికల హామీలను అమలు చేయాలని కోరుతూ మండల పరిధిలోని వినాయకపురం (అశ్వారావుపేట) ప్రభుత్వ ప్రాధమిక ఆరోగ్య కేంద్రం ఎదుట సీఐటీయూ అనుబంధ ఆశ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆశ వర్కర్స్ యూనియన్ జిల్లా కమిటీ సభ్యురాలు భారతి మాట్లాడుతూ ఆశ వర్కర్ల న్యాయమైన డిమాండ్లను పరిష్కరిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు హామీ ఇచ్చి పూర్తిగా మరిచిందని అన్నారు.గతంలో ఇచ్చిన హామీ ప్రకారం ఆశా లకు జీవిత భీమా రూ.50 లక్షల,ఏదో ఓక కారణం తో మృతి చెందిన కార్యకర్తలకు దహన సంస్కారానికి ( మట్టి ఖర్చులకు)రూ.50 వేల ఇచ్చేలా వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని,నిర్ధిష్ట వేతనంతో పాటు ఉద్యోగ భద్రత,పీఎఫ్,ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తిరుపతమ్మ,చిలకమ్మ,విష్ణు, రత్నకుమారి,శుభాని,రాధా, రమణ,వెంకాయమ్మ తదితరులు పాల్గొన్నారు.