Sunday, March 29, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుఆశాల అరెస్టు

ఆశాల అరెస్టు

- Advertisement -

చలో హైదరాబాద్‌ ఉద్రిక్తం
ఇందిరాపార్క్‌ నలువైపులా పోలీసుల పహారా
అయినా ధర్నాచౌక్‌ వద్ద బైటాయింపు
ఆశాలపై నడిరోడ్డులో పోలీసుల దౌర్జన్యం
30న రాస్తారోకో : ఆశావర్కర్స్‌ యూనియన్‌ పిలుపు

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో ఆశా వర్కర్లకు ఫిక్స్‌డ్‌ వేతనం నెలకు రూ.18 వేలు నిర్ణయించాలనీ, ఇతర సమస్యలు పరిష్కరించాలనీ, గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆశా వర్కర్స్‌ యూనియన్‌ (సీఐటీయూ అనుబంధం) చేపట్టిన చలో హైదరాబాద్‌ కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. జిల్లాల్లో ఎక్కడికక్కడ ముందస్తుగా అరెస్టులు చేసినా పోలీసుల నిర్బంధాన్ని తప్పించుకుని వేలాది మంది ఆశావర్కర్లు హైదరాబాద్‌కు చేరుకున్నారు. వేరు వేరు మార్గాల్లో ఇందిరా పార్క్‌ వద్ద ధర్నాకు వచ్చేందుకు వారు చేసిన ప్రయత్నాలను అడుగడుగునా పోలీసులు అడ్డుకున్నారు. ఇందిరాపార్క్‌కు నలువైపుల నుంచి వచ్చే రహదారుల్లో పోలీసులు కాపు కాచి జిల్లాల వారీగా తరలి వచ్చిన వారిని అదుపులోకి తీసుకున్నారు.

సచివాలయం, లోయర్‌ ట్యాంక్‌ బండ్‌ కట్టమైసమ్మ దేవాలయం వద్ద, గోశాల వద్ద , ఇందిరాపార్క్‌ సమీపంలో, అశోక్‌ నగర్‌ చౌరస్తా వద్ద, గాంధీనగర్‌ ఎల్‌ఐసీ సమీపంలో ఇలా పలు చోట్ల గుంపులుగా చేరిన వారిని పోలీసులు అరెస్టు చేసి అక్కడ్నుంచి వాహనాల్లో తరలించారు. ఉదయం 11.30 గంటలకు ధర్నా చేపట్టాలని పిలుపునిచ్చిన నేపథ్యంలో హైదరాబాద్‌ కు ఉదయం 10 గంటల నుంచే ధర్నా స్థలానికి సమీపంలో ఆశావర్కర్ల రాక మొదలైంది. ఎప్పటికప్పుడు పోలీసులు అరెస్టు చేసి పోలీస్‌ స్టేషన్లకు తరలించడం, అంతలోనే మరో జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో వర్కర్లు రావడం కనిపించింది. అనంతరం డీబీఆర్‌ మిల్స్‌ రోడ్‌లోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (యూపీహెచ్‌సీ) నుంచి సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌, తెలంగాణ ఆశా వర్కర్స్‌ యూనియన్‌ (సీఐటీయూ అనుంబంధం) అధ్యక్షులు పి.జయలక్ష్మి తదితరుల నాయకత్వంలో నిరసనకారులు ఇందిరాపార్క్‌ వైపు ర్యాలీగా బయలుదేరారు.

ఆశావర్కర్ల పట్ల రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ హామీలిచ్చి మోసం చేసిందంటూ విమర్శలు గుప్పించారు. ఇందిరాపార్క్‌ సిగల్‌ వద్దకు చేరుకున్న ఉద్యమకారులను పోలీసులు అడ్డగించారు. దీంతో పోలీసులతో వారు వాగ్వాదానికి దిగారు. శాంతియుతంగా ధర్నాకు అనుమతి అడిగితే ఎందుకు ఇవ్వలేదని పోలీసులను నిలదీశారు. హామీలిచ్చిన సర్కారుకు వినతిపత్రం ఇచ్చేందుకు కూడా తమకు అర్హత లేదా? అంటూ విమర్శించారు. ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరితే నిర్బంధిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమను శాంతియుతంగా ధర్నా చేసేందుకు వెళ్లనివ్వాలని కోరినా పోలీసులు అనుమతించకుండా అడ్డుకోవడంతో వారు అక్కడే బెటాయించారు. దీంతో పోలీసులు వారిని బలవంతంగా లాక్కెళ్లి వాహనాల్లో తరలించే ప్రయత్నం చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఉడుంపట్టు మాదిరిగా కూర్చున్న వారిని బరాబరా లాక్కెళ్లి వాహనాల్లో అక్కడ్నుంచి తరలించారు. అనంతరం దశల వారీగా అన్నట్టుగా తరలివచ్చిన వందలాది మందిని పోలీసులు అరెస్టు చేసి నగరంలోని వివిధ పోలీస్‌ స్టేషన్లకు తరలించారు.

30న హైవేలపై రాస్తారోకోలు
రాష్ట్ర ప్రభుత్వ నిర్బంధాన్ని నిరసిస్తూ, ఆశావర్కర్లకు ఫిక్స్‌డ్‌ వేతనం రూ.18 వేలు నిర్ణయించాలని కోరుతూ మార్చి 30న ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా హైవే రహదారులపైన రాస్తారోకోలు నిర్వహించనున్నట్టు ఈ సందర్భంగా నాయకులు పిలుపునిచ్చారు. అప్పటికి ప్రభుత్వం స్పందించకపోతే వర్షాకాలంలో నిరవధిక సమ్మెకు సిద్ధమవుతామని వారు హెచ్చరించారు. ఆశాలపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రమైన నిర్బంధాన్ని ప్రయోగించిందనీ, ఈ దుర్మార్గ విధానాన్ని తీవ్రంగా ఖండించారు.

అధికారంలోకి రాకముందు కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతూ అనేక పోరాటాలు చేశామనీ, ఫిబ్రవరి 23న ఛలో హైదరాబాద్‌, మార్చి 16, 17 తేదీల్లో రెండు రోజులు 48 గంటల ధర్నా, వంటావార్పు కార్యక్రమాలను రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కలెక్టర్‌ ఆఫీసుల ముందు నిర్వహించినట్టు వారు గుర్తుచేశారు. అయినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడంతో ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కారించకపోవడంతో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ మార్చి 28న ఛలో హైదరాబాద్‌ ఇందిరాపార్క్‌ వద్ద ధర్నా చేయాలని ఆశా యూనియన్‌ సీఐటీయూ రాష్ట్ర కమిటీ నిర్ణయించిందని తెలిపారు. ధర్నాకు పోలీసుల అనుమతిని కోరామనీ, 27వ తేదీ రాత్రి వరకు అనుమతి ఇస్తున్నట్టు చెప్పి సంతకం తీసుకుని తిరస్కరిస్తున్నామని మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అన్ని రకాల నిర్బంధాలను చేధించుకుని ధర్నాను ఆశాలు విజయవంతం చేశారని తెలిపారు. ఆశాల ఫిక్స్‌డ్‌ వేతనం నిర్ణయించకుండా 10 ఏండ్లు బీఆర్‌ఎస్‌ మోసం చేసిందనీ, కాంగ్రెస్‌ సర్కారు కూడా అదే విధంగా ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తుందని విమర్శించారు. అరెస్ట్‌ అయిన వారిలో సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌, ఆశా యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షురాలు పి.జయలక్ష్మి, ప్రధాన కార్యదర్శి ఆర్‌ .నీలాదేవి, కోశాధికారి పి.గంగమణి, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్‌, రాష్ట్ర సహాయ కార్యదర్శులు శ్రీకాంత్‌, సుధాకర్‌ హైదరాబాద్‌ సెంట్రల్‌ కమిటీ నాయకులు దశరథ్‌, హైదరాబాద్‌ సౌత్‌ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మీనా, శ్రావణ్‌ కుమార్‌, ఆశా రాష్ట్ర నాయకులు టి. యాదమ్మ, పద్మ, సావిత్రి, రేవతి తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -