ఐటీడీఏ పీఓ యువరాజ్ మార్మాట్
నవతెలంగాణ-ఆదిలాబాద్ టౌన్
ఆశ్రమ పాఠశాలల విద్యార్థులకు మెరుగైన విద్యనందించాలని అర్థమయ్యే రీతిలో భోదించాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి యువరాజ్ మార్మాట్ ఉపాధ్యాయులను ఆదేశించారు. మంగళవారం ఆదిలాబాద్ రూరల్ లోని చించుఘాట్, వన్వాట్ గిరిజన ఆశ్రమ పాఠశాలలు, స్టార్ ఫిఫ్టీ కళాశాల ను ప్రాజెక్ట్ అధికారి సందర్శించారు. విద్యార్థులకు అందిస్తున్న విద్య, వైద్యం, భోజనంపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో మాట్లాడుతూ ఏమైనా సమస్యలు ఉన్నాయా సమయానికి భోజనాన్ని అందిస్తున్నారా మెనూ ప్రకారంగా అందిస్తున్నారా భోజనాలు రుచికరంగా ఉన్నాయా అని తెలుసుకొని క్లాస్ రూమ్ లో విద్యార్థులతో ముచ్చటించి వారికి పాటలను బోధించారు విద్యార్థులకు వండిన ఆహారాన్ని రుచిని ఆస్వాదించారు.
అలాగే కంప్యూటర్ ల్యాబ్ ను పరిశీలించారు. ఐటీడీఏ పల్స్ యాప్ పనితరుపై ఆరా తీశారు, పదవ తరగతి విద్యార్థులకు 100% ఉతిర్ణత వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పల్స్ యాప్ పై ఏమైనా సమస్య ఉంటే తమ దృష్టిలోకి తీసుకురావాలని పేర్కొన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ప్రతిరోజూ మెనూ ప్రకారం పోషక విలువలు గల ఆహారాన్ని అందించాలన్నారు. సబ్జెక్టుల వారీగా విద్యార్థులకు అర్ధమయ్యే రీతిలో విద్యాబోధన చేయాలన్నారు. దోమల వలన వ్యాపించే డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు ప్రబలకుండా, వసతి గృహ పరిసరాలలో నిత్యం పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.
ప్రతిరోజు వంటగది, స్టోర్ రూమ్, తాగునీరు, మరుగుదొడ్లు శుభ్రంగా ఉండేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అనంతరం తరగతి గదిలో విద్యార్థులకు పాఠాలు భోదించారు. సబ్జెక్టుల వారీగా ప్రశ్నలు అడిగి తెలుసుకున్నారు. ప్రతి విద్యార్థికి చదవడం, రాయడం తప్పనిసరిగా రావాలని ఉపాధ్యాయులకు సూచించారు. గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఉపాధ్యాయులు మరియు పనిచేసే వర్కర్లు సమయానికి లేనందున వారిపై అగ్రం వ్యక్తం చేసి సోకాసు నోటీసు జారీ చేయమని ఆదేశించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.



