ఆవాజ్ రాష్ట్ర అధ్యక్షుడు యం.డి జబ్బార్
ఘనంగా అశ్ఫాకుల్లా ఖాన్ 125వ జయంతి
నవతెలంగాణ – వనపర్తి
భారత స్వాతంత్ర సమరయోధుడు, త్యాగధనుడు అశ్ఫాకుల్లా ఖాన్ స్వాతంత్ర సమరంలో ఎనలేని పాత్ర పోషించారని ఆవాజ్ రాష్ట్ర అధ్యక్షుడు యం.డి జబ్బార్ అన్నారు. ఆవాజ్ సంస్థ ఆధ్వర్యంలో అశ్ఫాకుల్లా ఖాన్ 125వ జయంతి సందర్భంగా బుధవారం వనపర్తిలో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆవాజ్ రాష్ట్ర అధ్యక్షుడు యం.డి జబ్బార్ ప్రధాన అతిథిగా పాల్గొని ప్రసంగించారు.“అశ్ఫాకుల్లా ఖాన్ భారత స్వాతంత్ర్య సమరంలో అపారమైన పాత్ర పోషించారన్నారు. రామ్ ప్రసాద్ బిస్మిల్ తో కలిసి ఆజాదీ కోసం సాహసోపేతమైన పోరాటం చేశారన్నారు. మత భేదాలు, కుల భేదాలు అనే తేడాలు లేకుండా దేశం కోసం త్యాగం చేసిన అశ్ఫాకుల్లా ఖాన్ నిజమైన దేశభక్తుడన్నారు. కేవలం 27 ఏళ్ల వయస్సులోనే ఉరి కంభం ఎక్కి ప్రాణాలు అర్పించిన ఆయన త్యాగం యువతకు స్ఫూర్తిదాయకమన్నారు. అశ్ఫాకుల్లా ఖాన్ ఆశయాలను కొనసాగిస్తూ, సమాజంలో ఐక్యత, సౌభ్రాతృత్వం నెలకొల్పడానికి అందరం కృషి చేయాలని పిలుపునిచ్చారు.
సమాజంలో మత భిన్నతలను రెచ్చగొట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయన్నారు. అలాంటి సందర్భాల్లో అశ్ఫాకుల్లా ఖాన్ వంటి వీరుల త్యాగాలను గుర్తు చేసుకోవాలన్నారు. ఆయన కలలలోని స్వాతంత్ర, సమానత్వ, సోదరభావ భారతదేశాన్ని నిర్మించడానికి యువత ముందుకు రావాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆవాజ్ జిల్లా అధ్యక్షుడు మునీర్, నాయకులు ఖలీమ్, ఖలీల్, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు గోపాల దేవేందర్, అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) జిల్లా అధ్యక్షురాలు సాయిలీల, డివైఎఫ్ఐ కార్యదర్శి మహేష్, టీపీటీఎల్‌ఎఫ్ నాయకులు విజయ్ కుమార్, ధర్మేందర్, రాణి తదితరులు పాల్గొన్నారు.