నవతెలంగాణ – అశ్వారావుపేట
అశ్వారావుపేట అభివృద్ధి బీఆర్ఎస్ హయాం మా ఆధ్వర్యంలోనే జరిగిందని మాజీ ఎమ్మెల్యేలు తాటి వెంకటేశ్వర్లు, మెచ్చా నాగేశ్వరరావులు అన్నారు. బీఆర్ఎస్ ఛైర్పర్సన్ అభ్యర్థిని కాసాని నాగశేషపద్మ విజయాన్ని కాంక్షిస్తూ శుక్రవారం పలు వార్డుల్లో ప్రచారం చేసిన అనంతరం స్థానిక కెమిలాయిడ్స్ అతిథి గృహంలో మెచ్చా నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రచారం చేసుకుంటున్న అభివృద్ధి కి మొత్తం మా ఇద్దరి హయాం లోనే పునాది వేశాం అన్నారు.
మున్సిపల్ ఎన్నికల బీఆర్ఎస్ కోఆర్డినేటర్ ఉప్పల వెంకటరమణ మాట్లాడుతూ.. ప్రస్తుతం జరుగుతున్న అశ్వారావుపేట మున్సిపాలిటీ ఎన్నికలు కాంగ్రెస్ నాయకుల ఆగడాలకు – అశ్వారావుపేట పౌరుల ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్న పోరు అని అభివర్ణించారు. పార్టీ ఏదైనా, ఎమ్మెల్యే ఎవరైనా తన గుప్పిట్లో పెట్టుకొని రాజకీయ క్రీడలో తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం పాటుపడే వ్యక్తి ఆగడాలకు అడ్డుకట్ట వేయాలంటే బీఆర్ఎస్ కు ఓటు వేసి గెలిపించాలని కోరారు.
క్రోనీ క్యాపిటల్ ధనంతో ఓట్లు కోనుగోలు చేయాలని కొందరు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు అని ఎద్దేవా చేసారు. అదేవిధంగా అశ్వారావుపేట మున్సిపాలిటీ ని కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఛైర్పర్సన్ అభ్యర్థిని కాసాని నాగశేషపద్మ,చంద్ర మోహన్ దంపతులు,డీసీసీబీ మాజీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, జెడ్పీటీసీ మాజీ సభ్యులు జేకేవీ రమణారావు,పద్మజా దంపతులు, మండల పరిషత్ పూర్వ అధ్యక్షులు జల్లిపల్లి శ్రీరామమూర్తి, దమ్మపేట సొసైటీ మాజీ చైర్మన్ రావు జోగేశ్వరరావు, కోటగిరి సీతారామ స్వామి, సంకా ప్రసాద్,మందపాటి రాజ్ మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.



