– నాసిరకంగా సిమెంట్ రోడ్డు పనులు
– పట్టించుకోని ఆర్ అండ్ బీ అధికారులు
నవతెలంగాణ – అశ్వారావుపేట
ఏళ్లుగా కొనసాగుతున్న సెంట్రల్ లైటింగ్, రోడ్డు విస్తరణ, డివైడర్ పనులతో అశ్వారావుపేట పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పనులు పూర్తి కాకపోవడంతో దుమ్ము ధూళి, ట్రాఫిక్ సమస్యలతో ప్రజలు నిత్యం ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా అశ్వారావుపేట ప్రధాన కూడలిలో పరిస్థితి రోజురోజుకూ అస్తవ్యస్తంగా మారుతోంది.
ప్రస్తుతం ప్రధాన కూడలిలో సిమెంట్ రోడ్డు నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి.ఈ కూడలి నుంచి సత్తుపల్లి, జంగారెడ్డిగూడెం, బూర్గంపాడు వైపు నిత్యం భారీగా వాహనాలు రాకపోకలు సాగుతుంటాయి. అయితే పనులు జరుగుతున్న ప్రాంతంలో సరైన ట్రాఫిక్ నియంత్రణ చర్యలు తీసుకోకపోవడం, తాత్కాలిక సూచిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడం వల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా భారీ వాహనాలు కూడలి వద్ద నిలిచిపోవడం వల్ల తరచూ ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడుతున్నాయి.
క్యూరింగ్ విధానంపై విమర్శలు :
సిమెంట్ రోడ్ల నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటిస్తున్నారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా సిమెంట్ రోడ్లకు నీటితో క్యూరింగ్ చేయడం ద్వారా దృఢత్వం పెరుగుతుంది.అయితే ఇక్కడ నీటితో క్యూరింగ్ చేయకుండా నూనె తీసిన పామాయిల్ పీచును పరచి క్యూరింగ్ చేస్తున్నట్టు కనిపిస్తోంది.
దీనివల్ల చమురు అవశేషాలు సిమెంట్ పై పేరుకుపోయి నిర్మాణ నాణ్యతపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని భవన నిర్మాణ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.నీరు లాగా చమురు సిమెంట్‌లో ఇంకకపోవడంతో రోడ్డు దృఢత్వం తగ్గే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు.
ప్రజల ఆవేదన :
పనులు జరుగుతున్న ప్రాంతంలో భద్రతా చర్యలు, ట్రాఫిక్ మార్గదర్శకాలు లేకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.దుమ్ము ధూళి, ట్రాఫిక్ రద్దీతో స్థానిక వ్యాపారులు, పాదచారులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.అధికారులు పర్యవేక్షణ పెంచి పనులను నాణ్యతగా పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు.
అధికారుల స్పందన :
ఈ విషయంపై ఆర్ అండ్ బీ డీఈఈ ప్రకాష్‌ను ప్రశ్నించగా, సిమెంట్ నిర్మాణంలో పీచు ఉపయోగించడం వల్ల ఎలాంటి నష్టం ఉండదని ఆయన తెలిపారు.




