Monday, March 30, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంపంచాయతీరాజ్‌ చట్ట సవరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం

పంచాయతీరాజ్‌ చట్ట సవరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం

- Advertisement -

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
పంచాయతీరాజ్‌ చట్టం-2018 సవరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి డి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ ఆ సవరణ బిల్లు లక్ష్యాలను సభకు వివరించారు. తెలంగాణ పంచాయతీరాజ్‌ చట్టం పరిధిలో జరిగే ఎన్నికలకు సంబంధించి ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చే వరకు ఓటరు నమోదు, మార్పులు, చేర్పులకు అవకాశం కల్పిస్తున్నామని అన్నారు. అందుకోసమే ఈ చట్ట సవరణకు బిల్లును ప్రతిపాదించామన్నారు. దీనికి సభ్యులు ఆమోదం తెలపాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. అభ్యంతరాలు రాకపోవడంతో ఆ చట్ట సవరణ బిల్లుకు సభ ఆమోదం పొందినట్టు స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ ప్రకటించారు. ఆదివారం అసెంబ్లీ సమావేశం ప్రారంభంకాగానే నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌ (ఎస్టీ) శాసనసభ నియోజకవర్గ మాజీ సభ్యులు ఎ గోవిందనాయక్‌ మృతి పట్ల స్పీకర్‌ సంతాపం ప్రకటించారు. అనంతరం తెలంగాణ విలువ ఆధారిత పన్ను సవరణ బిల్లు-2026ను రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, తెలంగాణ విద్వేషపూరితమైన ప్రసంగం, ద్వేషపూరితమైన నేరాలను నిరోధక బిల్లు-2026, తెలంగాణ న్యాయవాదుల రక్షణ (అడ్వకేట్‌ ప్రొటెక్షన్‌) బిల్లు-2026, తెలంగాణ ఉద్యోగుల తల్లిదండ్రుల పోషణ, జవాబుదారీతనం, పర్యవేక్షణ బిల్లు-2026లను శాసనసభా వ్యవహారాలు, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి శ్రీధర్‌బాబు ప్రవేశపెట్టారు. తెలంగాణ ప్లాట్‌ఫాం ఆధారిత గిగ్‌ వర్కర్ల రిజిస్ట్రేషన్‌, సామాజిక భద్రత, సంక్షేమ బిల్లు-2026ను కార్మిక శాఖ మంత్రి జి వివేక్‌ వెంకటస్వామి సభలో ప్రవేశపెట్టారు.

బీఆర్‌ఎస్‌ సభ్యుల నిరసన
అక్రమమైనింగ్‌ వ్యవహారంపై సభాసంఘం వేయాలని బీఆర్‌ఎస్‌ సభ్యులు డిమాండ్‌ చేశారు. సభలో వెల్‌లోకి వచ్చి నినాదాలు చేయడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. సభాకార్యక్రమాలను అడ్డుకోవద్దనీ, సభ సజావుగా సాగేందుకు సహకరించాలని ప్రతిపక్ష సభ్యులకు స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌ విజ్ఞప్తి చేశారు. అయినా వారి ప్రవర్తనలో మార్పు రాలేదు. హౌజ్‌ కమిటీ వేయాలనీ, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి రాజీనామా చేయాలని నినాదాలు చేశారు. బీజేపీ సభ్యుడు వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ అక్రమమైనింగ్‌పై సభాసంఘం వేయాలని ప్రభుత్వానికి సూచించారు. సభాసంఘం వేసినంత మాత్రాన ప్రభుత్వం ఓడినట్టు, ప్రతిపక్షం గెలిచినట్టు కాదని చెప్పారు.

బీఆర్‌ఎస్‌ సభ్యులను సస్పెండ్‌ చేయాలి : కూనంనేని
బీఆర్‌ఎస్‌ సభ్యుల ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో సీపీఐ సభ్యులు కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ సభను అడ్డుకుంటున్న బీఆర్‌ఎస్‌ సభ్యులను సస్పెండ్‌ చేయాలని స్పీకర్‌ను కోరారు. ప్రతి అంశానికీ సభాసంఘం వేయాల్సిన అవసరం లేదన్నారు. అక్రమ మైనింగ్‌పై సీబీసీఐడీ విచారణకు ప్రభుత్వం ఆదేశించిందనీ, దాన్ని బీఆర్‌ఎస్‌ గౌరవించాలని సూచించారు. ఈ అంశంపై కోర్టుకు వెళ్లే అంశాన్ని పరిశీలించాలని కోరారు. సభ్యులు దానం నాగేందర్‌ మాట్లాడుతూ బాలానగర్‌ భూ ఆక్రమణలపై సభాసంఘం వేయాలని డిమాండ్‌ చేశారు. తన కుటుంబానికి చెందిన భూమిని గత ప్రభుత్వం ప్రయివేటు కంపెనీకి కేటాయించిందనీ, రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా అక్రమాలు జరిగాయనీ, వీటన్నింటిపై విచారణ జరపాలని ప్రభుత్వాన్ని కోరారు. ధరణిని అడ్డుపెట్టుకుని వందల ఎకరాల భూమిని రాయించుకున్నారని చెప్పారు.

బీఆర్‌ఎస్‌ హయాంలో భూకబ్జాలు : కడియం
బీఆర్‌ఎస్‌ హయాంలో భూకబ్జాలు యధేచ్చగా జరిగాయని సభ్యులు కడియం శ్రీహరి అన్నారు. దొంగతనం చేసిన వారే నిస్సిగ్గుగా సభను అడ్డుకోవడం హాస్యాస్పదమమన్నారు. ధరణిని అడ్డుపెట్టుకుని వందల ఎకరాలు కబ్జా చేశారని ఆరోపించారు. పరిశ్రమల యజమానులను బెదిరించారని చెప్పారు. నిజాయితీ ఉంటే బాలానగర్‌ భూముల బదలాయింపుపై హౌస్‌ కమిటీకి బీఆర్‌ఎస్‌ ఒప్పుకోవాలని కోరారు. ఈ సమయంలో ‘నీది ఏ పార్టీ. ఏ పార్టీలో ఉన్నావు’అంటూ బీఆర్‌ఎస్‌ సభ్యులు నినాదాలు చేశారు. ఈ సయమంలో కొంత గందరగోళం నెలకొంది. బీఆర్‌ఎస్‌ సభ్యులు పాడి కౌశిక్‌రెడ్డి వేలు చూపించి బెదిరిస్తూ తుపాకీతో కాల్చుతానంటూ సైగలు చేయడంతో సభలో ఒక్కసారిగా దుమారం చెలరేగింది. అధికార పార్టీ సభ్యులు దీన్ని ఖండించారు. కాంగ్రెస్‌ సభ్యులు నాయిని రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ ఆక్రమించిన భూముల్లోనే బీఆర్‌ఎస్‌ కార్యాలయాలు నిర్మించిందని చెప్పారు. ఇందులో రూ.200 కోట్ల వరకు అవినీతి జరిగిందన్నారు. తాను సేకరించిన ఆర్టీఐ సమాచారమే సాక్ష్యమని వివరించారు. తాను చెప్పేది తప్పు అని నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని అన్నారు. భూ ఆక్రమణలపై సభా సఘం వేయాలని కోరారు. మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ భూముల వ్యవహారంపై సభాసంఘం వేయాలని సూచించారు. మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణకు ఆదేశిస్తే ఎలాంటి పురోగతి లేదన్నారు. బాలానగర్‌ భూముల వ్యవహారంపై హౌజ్‌ కమిటీ సవాల్‌ను స్వీకరించాలని బీఆర్‌ఎస్‌ను కోరారు.

సభాసంఘం గతంలో వేసినా ఉపయోగం లేదు : శ్రీధర్‌బాబు
బీఆర్‌ఎస్‌ హయాంలో మూడు అంశాలపై సభాసంఘాలను గత ప్రభుత్వం వేసిందని శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. వాటితో ఎలాంటి ఉపయోగం జరగలేదన్నారు. సమావేశాలు జరగలేదనీ, ఒక్క నివేదిక కూడా రాలేదని వివరించారు. సభాసంఘం వేసినా నిజాలు నిగ్గుతేల్చాలంటే తిరిగి విచారణ సంస్థలకే ఆ బాధ్యతలు అప్పగించాల్సి ఉంటుందన్నారు. సభను అడ్డుకోవాలనే ఉద్దేశంతోనే బీఆర్‌ఎస్‌ సభ్యులు బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్నారని అన్నారు.

మంత్రిపై బురద జల్లాలని చూస్తున్నారు : భట్టి
అక్రమ మైనింగ్‌ విషయంలో ఓ మంత్రిపై బురద జల్లాలని బీఆర్‌ఎస్‌ సభ్యులు చూస్తున్నారని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. బ్లాక్‌మెయిల్‌ చేయడానికే సభాసంఘాన్ని కోరుతున్నారని చెప్పారు. వారి అక్రమాలకు సహకరించలేదన్న కారణంతోనే ఆ మంత్రిపై ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. బాలానగర్‌ భూ అక్రమాలపై సభాసంఘం వేస్తామని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -