నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
పలు పద్దులకు రాష్ట్ర అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఆదివారం శాసనసభలో విద్య, వైద్యం, రోడ్లు, భవనాలు, కార్మిక, ఉపాధి, అటవీ, పర్యావరణం, నీటిపారుదల, పౌరసరఫరాలశాఖల పద్దులపై శాసనసభ చర్చించింది. పద్దులపై జరిగిన చర్చకు విద్య, వైద్యానికి సంబంధించి వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, రోడ్లు, భవనాలశాఖకు సంబంధించి శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కార్మికశాఖ మంత్రి వివేక్, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ సమాధానమిచ్చారు. అనంతరం స్పీకర్ సభను సోమవారం ఉదయం 10 గంటలకు వాయిదా వేశారు.
అంతకు ముందు జరిగిన చర్చలో ఎంఐఎం శాసనసభ్యులు మహ్మద్ పాషాఖాద్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే టి.రామ్మోహన్ రెడ్డి, బీజేపీ సభ్యులు కాటెపల్లి వెంకట రమణారెడ్డి, కాంగ్రెస్ సభ్యురాలు డాక్టర్ రాగమయి, కాంగ్రెస్ సభ్యులు బి.మనోహర్ రెడ్డి, బీజేపీ సభ్యులు మహేశ్వర్ రెడ్డి, కాంగ్రెస్ సభ్యులు ఆది శ్రీనివాస్, సీపీఐ శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు పాల్గొన్నారు.
కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ మంత్రులు మంజూరునిస్తున్నా క్షేత్రస్థాయిలో పనులు జరగడం లేదని విమర్శించారు. మంత్రుల మధ్య సమన్వయం అవసరమని సూచించారు. విద్యకు బడ్జెట్ పెంచాలని కోరారు. యూనివర్సిటీల్లో ఖాళీలను భర్తీ చేయకుండా ఉన్నత విద్య బలోపేతం కాదని తెలిపారు. రోడ్డెక్కుతున్న కేజీబీవీ, యుఆర్‌ఎస్, సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. డీఈవోలుగా ఇతర శాఖల వారిని నియమించొద్దని సూచించారు. అసంఘటితరంగ కార్మికుల కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఏజెన్సీల దోపిడీ నుంచి కాపాడాలన్నారు. సింగరేణిలో కనీస వేతనాల సమస్యను పరిష్కరించాలనీ, ఆర్టీసీలో యూనియన్లను పెట్టుకునేందుకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
మంత్రి వివేక్ సమాధానమిస్తూ కేంద్ర ప్రభుత్వం తెచ్చిన లేబర్ కోడ్లపై రాష్ట్ర ప్రభుత్వం చర్చిస్తుంది. ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు సూచన బాగుందనీ, అసంఘటితరంగ కార్మికులకు లబ్ది జరిగేలా ఆలోచిస్తామని మాటిచ్చారు. గిగ్ వర్కర్ల సంక్షేమానికి సంబంధించిన బిల్లును శాసనసభలో సోమవారం ప్రవేశపెట్టనున్నట్టు వెల్లడించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ గోదావరి, కృష్ణా నదుల్లో తెలంగాణ వాటాను కాపాడుకుంటూ పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తామని తెలిపారు. మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ ప్రభుత్వ విద్య, ప్రభుత్వ వైద్యాన్ని బలోపేతం చేసేందుకు తీసుకున్న, తీసుకుంటున్న చర్యలను వివరించారు. వైద్యారోగ్యశాఖలో సిబ్బంది కొరత లేకుండా నియామకాలు చేపడుతున్నట్టు తెలిపారు. మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ గత 10 ఏండ్లలో నిర్లక్ష్యం చేసిన అటవీ, దేవాదాయశాఖలను గాడిలో పెడుతున్నామని చెప్పారు.
పలు పద్దులకు అసెంబ్లీ ఆమోదం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


