Saturday, February 21, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుమార్చి మొదటి వారంలో అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు

మార్చి మొదటి వారంలో అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు

- Advertisement -

ప్రభుత్వ సన్నాహాలు
సోమవారం నాటి క్యాబినెట్‌లో ముహూర్తం ఖరారు

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలను మార్చి మొదటి వారంలో నిర్వహించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించినట్టు సమాచారం. సోమవారం నిర్వహించబోయే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో సంబంధిత తేదీలను కూడా ఖరారు చేయనున్నారు. పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇప్పటికే తన వార్షిక బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సంగతి విదితమే. మన రాష్ట్రంలో మున్సిపల్‌ ఎన్నికలు, అనంతరం సీఎం ముంబై, ఢిల్లీ పర్యటనల నేపథ్యంలో అసెంబ్లీని సమావేశపరచటంలో కొంత ఆలస్యమైందని అధికారులు తెలిపారు. మరోవైపు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇటీవలే ప్రీ బడ్జెట్‌ సమావేశాలను ప్రారంభించారు.

రోజుకు రెండు మూడు శాఖల ఉన్నతాధికారులతో ఆయన సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళా శిశు సంక్షేమ శాఖల గత కేటాయింపులు, వాటి ఖర్చు, రాబోయే బడ్జెట్‌ ప్రతిపాదనలపై ఆయన వారితో చర్చించారు. ఇవిగాక మిగతా శాఖల కేటాయింపులపై చర్చించి, ప్రతిపాదనలను స్వీకరించాల్సి ఉంది. కాగా ఇప్పటికే అన్ని శాఖల నుంచి ఆన్‌లైన్‌లో ప్రతిపాదనలు స్వీకరించామని ఆర్థికశాఖ వర్గాలు తెలిపాయి. వాటిపై డిప్యూటీ సీఎం ఒకసారి సమగ్రంగా చర్చించి, కేటాయింపులపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ఆయా వర్గాలు పేర్కొన్నాయి. ఇదంతా పూర్తవటానికి కనీసం వారం నుంచి పది రోజులు పడుతుందని అంచనా. ఈ కారణాల రీత్యా వచ్చే నెల మొదటి వారం నుంచి అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

హైదరాబాద్‌కు సీఎం…
కాగా సీఎం రేవంత్‌ రెడ్డి… తన ముంబై, ఢిల్లీ పర్యటనలను ముగించుకుని శుక్రవారం రాత్రి హైదరాబాద్‌కు చేరుకున్నారు. ముంబై క్లైమేట్‌ వీక్‌ కార్యక్రమంలో పాల్గొనేందుకు మంగళవారం రాత్రి ముఖ్యమంత్రి అక్కడికి బయల్దేరి వెళ్లిన సంగతి విదితమే. బుధవారం ఆయన ముంబై నుంచి ఢిల్లీకి పయనమయ్యారు. ఏఐసీసీ నిర్వహించిన ప్రత్యేక సమావేశాల్లో పాల్గొన్న సీఎం కొన్ని ప్రయివేటు కార్యక్రమాలకు కూడా హాజరయ్యారు. శుక్రవారం తిరిగి హైదరాబాద్‌కు చేరుకున్న ముఖ్యమంత్రి… శనివారం వికారాబాద్‌ జిల్లా అనంతగిరి హిల్స్‌లో ప్రారంభమయ్యే ఏపీ, తెలంగాణ జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుల (డీసీసీ) శిక్షణా శిబిరానికి ముఖ్య అతిథిగా హాజరవుతారని సీఎంవో వర్గాలు తెలిపాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -