Tuesday, February 24, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలు16 నుంచి అసెంబ్లీ

16 నుంచి అసెంబ్లీ

- Advertisement -

20న రాష్ట్ర బడ్జెట్‌
మే 11 నుంచి జనగణన
ఆగస్టులో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు
మెట్రో స్వాధీనానికి మంత్రివర్గ ఉపసంఘం
రైతు భరోసాకు నిధులు విడుదల
ప్రభుత్వోద్యోగులకు ప్రమాదబీమా
రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయాలు

నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు మార్చి 16వ తేదీ నుంచి జరగనున్నాయి. అదేరోజు గవర్నర్‌ ప్రసంగం, 20వ తేదీ 2026-27 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. అసెంబ్లీలో ఆర్థికశాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క, శాసనమండలిలో శాసనసభావ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. సోమవారంనాడిక్కడి డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది. పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. సమావేశంలో తొలి ఎజెండాగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల గురించి చర్చించినట్టు సమాచారం.

ఈ ఎన్నికలు రద్దు చేస్తారని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని సీఎం రేవంత్‌రెడ్డి మంత్రివర్గానికి స్పష్టత ఇచ్చారు. సంబంధిత శాఖ అధికారులతో ఈ అంశంపై మాట్లాడేటప్పుడు కేంద్రం నుంచి జెడ్పీటీసీ, ఎంపీటీసీలకు ఎలాంటి నిధులు రానప్పుడు వారి పరిస్థితి, ప్రాబల్యం, ఉనికి ఏంటి అనే అంశాలపై చర్చ జరిగిందేతప్ప, వాటిని ఎత్తివేయాలనే చర్చే జరగలేదని వివరించినట్టు సమాచారం. దీనిపై స్పందించిన కొందరు మంత్రులు ఈ ఎన్నికలను వెంటనే నిర్వహించాలని అభిప్రాయం వ్యక్తంచేయగా, మరికొందరు మంత్రులు ప్రతిపక్షపార్టీలు కొన్ని చోట్ల బలంగా ఉన్నాయనీ, పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికల్లో ఆ పార్టీలు చెప్పుకోదగిన స్థాయిలో స్థానాల్ని గెలుచుకున్నాయని గుర్తుచేశారు.

రైతుబంధు, స్కాలర్‌షిప్‌లు, ఫీజురీయింబర్స్‌మెంట్‌ వంటి వాటికి నిధులు విడుదలచేసి ఎన్నికలకు వెళ్తే బాగుంటుందని మరికొందరు మంత్రులు అభిప్రాయాలు వ్యక్తం చేసినట్టు తెలిసింది. దీనిపై సీఎం రేవంత్‌రెడ్డి స్పందిస్తూ విద్యార్థులకు మార్చి, ఏప్రిల్‌ నెలల్లో వరుసగా పరీక్షలు ఉన్నాయనీ, ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వ జనగణన ఉందనీ, అవన్నీ పూర్తి అయ్యాక ఆగస్టులో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు వెళ్దామని చెప్పి, ఆ చర్చను ముగించినట్టు సమాచారం. అనంతరం రైతు భరోసా కోసం రూ.4వేల కోట్ల నిధుల విడుదలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మంత్రివర్గ నిర్ణయాలను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విలేకరులకు వివరించారు. పక్కన మంత్రులు అడ్లూరి లక్షణ్‌కుమార్‌, వాకిటి శ్రీహరి కూడా ఉన్నారు.

మెట్రోకోసం మంత్రివర్గ ఉపసంఘం
హైదరాబాద్‌ మెట్రోరైల్‌ను ఎల్‌అండ్‌టీ సంస్థ నుంచి పూర్తిగా స్వాధీనం చేసుకొనేందుకు మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించాలని సమావేశంలో నిర్ణయించారు. ఇప్పటికే దీనిపై ప్రకటన విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం స్వాధీన ప్రక్రియను పర్యవేక్షించడానికి ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలో మంత్రులు ఎన్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, జూపల్లి కృష్ణారావు సభ్యులుగా ఉపసంఘాన్ని నియమించారు. ఎల్‌ అండ్‌ టీతో జరిగిన ఒప్పందంలో రూ.2 వేల కోట్ల ఈక్విటీని ఏకమొత్తంగా చెల్లించి, రూ.13 వేల కోట్ల రుణాలను ప్రభుత్వం బదలాయించుకునేలా అవగాహనకు వచ్చిన విషయాన్ని సీఎం మంత్రులకు వివరించారు. మెట్రోరైల్‌ ఆస్తులు, వాటి విలువను ఇండిస్టియల్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఐడీబీఐ) పెట్టుబడి మదింపును చేసిందనీ, మెట్రో రైళ్లు, ట్రాక్‌లు, సిగలింగ్‌ వ్యవస్థ వంటి సాంకేతిక అంశాలను మదింపు చేసి ఢిల్లీ మెట్రోరైల్‌ కార్పొరేషన్‌ (డీఎంఆర్‌సీ) ప్రాథమిక నివేదికలు ఇచ్చాయి. వీటిపై మంత్రివర్గంలో చర్చించారు.

మే 11 నుంచి జనగణన
కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన జనగణన-2027ను చేపట్టేందుకు అవసరమైన ఏర్పాట్లపై మంత్రివర్గం చర్చించింది. నిర్ణిత షెడ్యూల్‌ ప్రకారం తొలి విడత జరిగే ఇండ్ల గణన (హౌజ్‌ లిస్టింగ్‌ ఆపరేషన్‌) రాష్ట్రంలో మే 11వ తేదీన ప్రారంభించి జూన్‌ 9 వరకు చేపడుతున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు మంత్రివర్గానికి వివరించారు. హౌజ్‌ లిస్టింగ్‌కు కేంద్రం నిర్దేశించిన 34 ప్రశ్నల నమూనాను చెప్పారు. జనగణన కోసం రాష్ట్రంలో ఎన్యుమరేటర్లతో పాటు నోడల్‌ ఆఫీసర్లు సహా దాదాపు 89 వేల మంది ఉద్యోగులు ఈ ప్రక్రియలో భాగస్వాములు అవుతున్నారని తెలిపారు. రెండో దశ జనగణన ప్రక్రియను 2027 ఫిబ్రవరిలో చేపడతామన్నారు. దీనికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

ప్రభుత్వోద్యోగులకు ప్రమాదబీమా
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఉచితంగా ప్రమాద బీమా పథకం వర్తింపచేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. దీనికోసం ఉద్యోగులు, పెన్షనర్లు ఎలాంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. దీన్ని తొలివిడతలో సింగరేణి కాలరీస్‌, ట్రాన్స్‌కో ఉద్యోగులకు వర్తింపచేశారు. అక్కడ ఈ పథకం విజయవంతమైంది. దానితో ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఈ ప్రమాదబీమాను అమలు చేయాలని మంత్రివర్గంలో నిర్ణయించారు. ఎవరైనా ప్రమాదంలో మరణిస్తే సదరు ఉద్యోగి కుటుంబానికి ఒక కోటి 2లక్షల రూపాయల ప్రమాద బీమా పరిహారం అందుతుంది. సహజ మరణానికి 60 ఏండ్ల వరకు ఉద్యోగులకు రూ.10 లక్షల టర్మ్‌ ఇన్సూరెన్స్‌ వర్తిస్తుంది. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రభుత్వ కార్పొరేషన్లు. ప్రభుత్వ రంగ సంస్థల పరిధిలో 5 లక్షల 19 వేల మంది రెగ్యులర్‌ ఉద్యోగులున్నారు. వీరితో పాటు 2 లక్షల 38 వేల మంది పెన్షనర్లు ఉన్నారు. మొత్తం 7.57 లక్షల మందికి ఈ ప్రమాద బీమా వర్తిస్తుంది.

వైద్య విధాన పరిషత్‌ అప్‌గ్రేడ్‌
ప్రభుత్వ ఆస్పత్రుల్లో మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ (టీవీవీపీ)ను డైరెక్టరేట్‌ ఆఫ్‌ సెకండరీ హెల్త్‌ కేర్‌ (డీఎస్‌హెచ్‌)గా అప్‌గ్రేడ్‌ చేయాలని నిర్ణయించారు. దీంతో పూర్తిస్థాయి ప్రభుత్వ విభాగ హోదా లభిస్తుంది. నిధుల కేటాయింపులో ప్రాధాన్యం పెరుగుతుంది. సర్జికల్స్‌, మెడిసిన్స్‌ కొనుగోలు వేగంగా జరుగుతుంది. డాక్టర్లు, సిబ్బందికి సకాలంలో వేతనాలు అందడంతో వైద్య సేవలు మెరుగుపడుతాయని క్యాబినెట్‌ భావించింది.

వైద్యారోగ్యశాఖలో సంస్కరణలు
వైద్యారోగ్య శాఖలో కీలక సంస్కరణలు చేపట్టాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. రాష్ట్రంలో వివిధ విభాగాల పరిధిలో ఉన్న అన్ని ఆస్పత్రుల నిర్వహణ సమర్థవంతంగా జరిగేలా చర్యలు చేపట్టాలని చర్చించింది. దీనికోసం కొత్త విధానాలపై అధ్యయనం చేసేందుకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. ప్రభుత్వ సలహాదారు డాక్టర్‌ నోరి దత్తాత్రేయ, డాక్టర్‌ శ్రీనాథ్‌రెడ్డితో పాటు మరో ఇద్దరు ఉన్నతాధికారులను కూడా ఈ కమిటీలో నియమించి వారి సలహాలు సూచనలు తీసుకుంటారు. ఆస్పత్రుల నిర్వహణలో మెడికల్‌ సర్వీసెస్‌, అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీసెస్‌ను వేర్వేరుగా విభజించే ప్రత్యామ్నాయాలను కూడా పరిశీలించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సూచించారు.

హెచ్‌ఎండీఏలోకి మరో నాలుగు గ్రామాలు
హెచ్‌ఎండిఏ విస్తరణలో భాగంగా మరో నాలుగు గ్రామాలను దాని పరిధిలోకి చేర్చేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వికారాబాద్‌ జిల్లాలోని నవాబ్‌ పేట్‌ మండలంలోని చిట్టిగూడ, యావపూర్‌, మోమిన్‌పేట మండలం టేకులపల్లి, ఎంకతాల గ్రామాలను హెచ్‌ఎండిఏ పరిధిలో చేర్చారు.

జీహెచ్‌ఎంసీలో సీఆర్‌ఎమ్‌పీ ఫేజ్‌-2
గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో కాంప్రహెన్సివ్‌ రోడ్‌ మెయింటెనెన్స్‌ ప్రోగ్రామ్‌ (సీఆర్‌ఎమ్‌పీ ఫేజ్‌-2) చేపట్టేందుకు క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు ఫేజ్‌-1లోని 744 కిలోమీటర్లకు అదనంగా 300 కిలోమీటర్ల రోడ్లను ఫేజ్‌-2లో అభివృద్ధి, నిర్వహణ చేపడతారు. దీనికోసం రూ.3,145 కోట్ల జీహెచ్‌ఎంసీ నిధుల కేటాయింపును ఆమోదించారు.

కొత్త పైప్‌లైన్లు
గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో మంజీరా వాటర్‌ సప్లరు స్కీమ్‌ ఫేజ్‌-1, ఫేజ్‌-2 ఆధునీకరణ ప్రాజెక్ట్‌కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. హైదరాబాద్‌ జలమండలి ప్రతిపాదనల మేరకు రూ.722 కోట్లతో ఈ ప్రాజెక్ట్‌ పనులను చేపడతారు. రూ.282 కోట్లతో ఉస్మాన్‌ సాగర్‌ మంచినీటి పైప్‌ లైన్‌ ఆధునీకరణకు మంత్రివర్గ ఆమోదం లభించింది.

కోహెడలో 223 ఎకరాల భూ కేటాయింపు
రంగారెడ్డి జిల్లా కోహెడలో మల్టీ మోడల్‌ లాజిస్టిక్స్‌ పార్క్‌, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పార్క్‌ ఏర్పాటు చేసేందుకు అవసరమైన 223.09 ఎకరాల భూమిని టీజీఐఐసీకి బదలాయించేందుకు ఆమోదం లభించింది. అలాగే టీజీ హౌసింగ్‌ బోర్డు ఆధీనంలోని 239 ఎకరాలను ప్రపంచ స్థాయి ప్రమాణాలతో పండ్ల మార్కెట్‌ ఏర్పాటుకు వ్యవసాయ మార్కెటింగ్‌ విభాగానికి కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

కాలేజీలకు…
మహబూబాబాద్‌ జిల్లా మహబూబాబాద్‌ మండలం గుమ్మడూరులో జేఎన్టీయూ అధ్వర్యంలోని ఇంజనీరింగ్‌ కాలేజీకి 70 ఎకరాలు, శాతవాహన యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఇంజినీరింగ్‌ కాలేజీ నిర్మాణానికి సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ మండలం ఉమ్మాపూర్‌లో 36 ఎకరాలను కేటాయించారు. నల్గొండ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్‌, మెదక్‌, నిజామాబాద్‌, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, హైదరాబాద్‌ జిల్లాల్లో 21 యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్ల నిర్మాణానికి భూములు కేటాయిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. అలాగే హైదరాబాద్‌లో ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణాలకు అవసరమైన 42 ఎకరాలను రక్షణ శాఖ (ఢిపెన్స్‌ ల్యాండ్‌) నుంచి తీసుకున్నందున దానికి సమాన విలువైన భూములను కాప్రా మండలంలో 153 ఎకరాలు కేటాయించేందుకు రాష్ట్ర క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది.

భద్రాచలంలో..
భద్రాచలంలో గ్రీన్‌ఫీల్డ్‌ మినీ స్టేడియం నిర్మాణానికి 5 ఎకరాల భూమిని రాష్ట్ర క్యాబినెట్‌ కేటాయించింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ వేంకటేశ్వరస్వామి దివ్య క్షేత్రం నిర్మాణానికి ఖమ్మం అర్బన్‌ మండలం ధంసలాపురం గ్రామంలో 20 ఎకరాలు కేటాయించింది. కరీంనగర్‌ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రంలో పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం నిర్మాణానికి 3 ఎకరాల 12 గుంటలను దేవాదాయ శాఖకు కేటాయించింది. హెచ్‌ఎండిఏ పరిధిలోని నియోపోలీస్‌ పరిసర ప్రాంతాల్లో నీటి సరఫరాకు సంబంధించి మౌలిక వసతుల కల్పనకు గండిపేట మండలం కోకాపేటలో శారద పీఠానికి చెందిన స్థలాన్ని హైదరాబాద్‌ మెట్రో వాటర్‌ సప్లరు అండ్‌ సీవరేజీ బోర్డుకు కేటాయించడంతో పాటు శారద పీఠానికి ప్రత్యామ్నాయ స్థలం కేటాయింపునకు క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది.

షాపుల వేలం
క్యూర్‌ ఏరియాలో డబుల్‌ బెడ్రూమ్‌ ఇండ్ల దగ్గర నిర్మించిన షాపులను వేలం వేసేందుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ ప్రాంతాల్లో స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నుంచి వీలైనన్ని ఎక్కువ నిధులను రాబట్టుకునే అంశంపై చర్చించింది.

గ్రీన్‌ ఎనర్జీ పాలసీకి ఆమోదం
క్లీన్‌ అండ్‌ గ్రీన్‌ ఎనర్జీ పాలసీలో భాగంగా 300 మెగావాట్ల విద్యుత్తు వినియోగించే డేటా సెంటర్లకు రెనెవెబుల్‌ ఎనర్జీ డిస్ట్రిబ్యూషన్‌ లైసెన్స్‌ ఇచ్చేందుకు కేబినేట్‌ ఆమోదించింది. దీనికి సంబంధించిన పాలసీకి ఆమోదం లభించింది.

క్యాష్‌లెస్‌ ఎంప్లాయీ హెల్త్‌ స్కీం
ఉద్యోగుల ఆరోగ్య భద్రతకు క్యాష్‌లెస్‌ ఎంప్లారు హెల్త్‌ స్కీమ్‌ (ఈహెచ్‌ఎస్‌) అమలు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. 3 లక్షల 56 వేల మంది ప్రభుత్వ రెగ్యులర్‌ ఉద్యోగులు, 2.88 లక్షల మంది పెన్షనర్లు, వారిపై ఆధారపడ్డ కుటుంబ సభ్యులు మొత్తం 17.07 లక్షల మందికి ఈ పధకం వర్తిస్తుంది. అన్ని ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు 652 ఎంప్యానెల్‌ ప్రయివేటు ఆస్పత్రుల్లో ఈ పధకం వర్తిస్తుంది. 1998 రకాల వైద్య చికిత్సలు ఉచితంగా అందిస్తారు. దీనికోసం ఉద్యోగులకు డిజిటల్‌ హెల్త్‌ ఎంప్లాయీ కార్డ్‌ అందిస్తారు.

రాజీవ్‌ ఆరోగ్యశ్రీ హెల్త్‌ కేర్‌ ట్రస్ట్‌ ద్వారా ప్రభుత్వ ఉద్యోగులకు ఈ వైద్యం అందుతుంది. దీనికోసం ప్రభుత్వ ఉద్యోగులు తమ మూల వేతనం నుంచి 1.5 శాతం తమ వాటాగా చెల్లిస్తారు. అంతే సమాన వాటాను ప్రభుత్వం మ్యాచింగ్‌ వాటా చెల్లిస్తుంది. దీని ప్రకారం ఏడాదికి ఉద్యోగులు రూ. 528 కోట్లు తమ వాటాగా చెల్లిస్తే, ప్రభుత్వం కూడా రూ. 528 కోట్లు కలిపి మొత్తం రూ.1056 కోట్లతో క్యాష్‌లెస్‌ ఎంప్లాయి హెల్త్‌ స్కీమ్‌ను అమలు చేస్తుంది. దీనికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -