బీఏసీ నిర్ణయం
వారం రోజుల పాటు సభ నిర్వహణ
ఒకటో తేదీ వరకు విరామం
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జనవరి రెండో తేదీ నుంచి మళ్లీ ప్రారంభం కానున్నాయి. దాదాపు వారం రోజుల పాటు అంటే జనవరి 7 వరకు సభ జరగనుంది. మంగళ, బుధ, గురువారాల్లో సమావేశాలకు విరామం ఉండనుంది. సోమవారంతో కలిపి ఏడు రోజులు సభను నిర్వహించనున్నారు. జనవరి 2నుంచి 6 వరకు సమావేశాలు చేపట్టాక బీఏసీ నిర్వహిస్తారు. అనంతరం సభను జరపాలా ? వద్దా ? అనేది 7న జరిగే బీఏసీలో తేలనుంది. కాగా సోమవారం స్పీకర్ ప్రసాద్‌కుమార్ అధ్యక్షతన శాసనసభ బిజినెస్ అడ్వైజరీ కమిటీ(బీఏసీ) సమావేశం జరిగింది. స్పీకర్ చాంబర్‌లో జరిగిన ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి డి.శ్రీధర్‌బాబు, మంత్రి పొన్నం ప్రభాకర్, విప్ బీర్ల ఐలయ్య, సభ్యులు టి హరీశ్‌రావు, మహేశ్వర్‌రెడ్డి, అక్బరుద్దీన్ ఓవైసీ, కూనంనేని సాంబశివరావు హాజరయ్యారు.
అలాగే శాసనమండలి కార్యదర్శి వి. నరసంహాచార్యులు, అసెంబ్లీ కార్యదర్శి ఆర్.తిరుపతి పాల్గొన్నారు. ఈసందర్భంగా దాదాపు గంటపాటు సమావేశం జరిగింది. అసెంబ్లీ పనిదినాలకు సంబంధించి బీఏసీలో చర్చకొచ్చింది. అసెంబ్లీని వారం రోజుల పాటు నిర్వహించి మళ్లీ బీఏసీ నిర్వహిస్తామని స్పీకర్ సభ్యులకు తెలియజేశారు. జనవరి 2నుంచి 7వరకు సమావేశాలు నిర్వహించిన తర్వాత మళ్లీ బీఏసీ నిర్వహిస్తామని స్పీకర్ చెప్పినట్టు సమాచారం. ఈనేపథ్యంలో ఆయా పార్టీలకు చెందిన సభ్యులు మాట్లాడుతూ సాధ్యమైనన్నీ ఎక్కువ రోజులు సభను జరపాలని కోరారు.
పీపీటీని బహిష్కరించాం: భట్టి
బీఆర్‌ఎస్ సర్కారు హయాంలో ఆయా అంశాల చర్చ సందర్భంగా పీపీటీ నిర్వహించేందుకు కాంగ్రెస్‌కు అవకాశం ఇవ్వలేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. అప్పుడు బహిష్కరించాల్సి వచ్చిందన్నారు. ప్రజా సమస్యలపై అవసరమైనన్నీ రోజులు చర్చలకు సిద్ధమన్నారు. మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ ప్రభుత్వ కార్యకలాపాలతోపాటు ప్రజాసమస్యలపై చర్చించేందుకు సర్కారు వెనక్కిపోదని అన్నారు. బిజినెస్ రూల్స్ ప్రకారం సభ నడుస్తుందన్నారు.
15 రోజులు జరపాలి: హరీశ్‌రావు
బీఏసీ సమావేశం ముగిసిన తర్వాత హరీశ్‌రావు మీడియాతో చిట్‌చాట్ చేశారు. అసెంబ్లీ సమావేశాలు 15 రోజులు జరపాలని పట్టుబట్టినట్టు చెప్పారు. అయితే వారం రోజులు జరిపి తర్వాత మళ్లీ బీఏసీ పెడతామని స్పీకర్ చెప్పినట్టు వివరించారు. అసెంబ్లీ పీపీటీ నిర్వహించేందుకు అవకాశం ఇవ్వాలని స్పీకర్‌ను కోరినట్టు చెప్పారు. ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని స్పీకర్ అన్నట్టు తెలిపారు. గతంలో కాంగ్రెస్‌కు అవకాశం ఇవ్వనందుకు బహిష్కరించినట్టు భట్టి విక్రమార్క అన్నట్టు హరీశ్‌రావు చెప్పారు. ఇందుకు ఇప్పుడు అవకాశం ఇవ్వకపోతే బాయ్ కాట్ చేయాలా అని ప్రశ్నించినట్టు తెలిపారు. ఏలేటి మహేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశాలు కనీసం 20 రోజులపాటు నిర్వహించాలని కోరారు. 32 అంశాలపై చర్చించాలని చెప్పారు. జనవరి 7 వరకు సమావేశాలు నిర్వహించాలని, ఆ తర్వాత బీఏసీ జరిగేలా నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు.



