Monday, March 9, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఅసెంబ్లీ 10 రోజులే

అసెంబ్లీ 10 రోజులే

- Advertisement -

ఐదు రోజులు పబ్లిక్‌, మరొకటి ఐచ్ఛిక సెలవులు
ప్రభావితం కానున్న సమావేశాలు
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు తొమ్మిది లేదా పది రోజులు మాత్రమే నడిచే అవకాశాలు ఉన్నాయి. ఈనెల 16 నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ, మండలి సమావేశాలు 30 వరకు కొనసాగనున్నాయి. ఈ మేరకు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి అధ్యక్షతన గత ఫిబ్రవరి 23న జరిగిన క్యాబినెట్‌ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు అసెంబ్లీ అధికార వర్గాలు సన్నాహాలు చేపట్టాయి. శాసనసభ, శాసన మండలి కార్యదర్శులు సైతం నోటిఫికేషన్‌ జారీచేశారు. ఈ సమావేశాల్లో ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. మొదటి రోజు ఉదయం 11:45 గంటలకు అసెంబ్లీ, మండలినుద్దేశించి గవర్నర్‌ ప్రసంగించనున్నారు. ఆ మరుసటి రోజు గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరగనుంది. వార్షిక బడ్జెట్‌ను అసెంబ్లీలో ఈనెల 20న ఉపముఖ్యమంత్రి, ఆర్థికమంత్రి భట్టి విక్రమార్క మల్లు, మండలిలో మంత్రి శ్రీధర్‌బాబు ప్రవేశపెట్టనున్నారు.
సమావేశాలను ప్రభావితం చేయనున్న సెలవులు
అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ఈనెల 30 వరకు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినప్పటికి సాంకేతికంగా తొమ్మిది లేదా పది రోజులే నడిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈనెల 16 నుంచి సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో పండుగలు, ఇతరాల పేరుతో ఐదు రోజులు ప్రభుత్వ సెలవు దినాలు, మరొక రోజు ఐచ్ఛిక సెలవులు వస్తున్నాయి. ఈనెల 19న ఉగాది, 21న రంజాన్‌, 22న ఆదివారం, 27 శ్రీరామనవమి, 29 ఆదివారం కానున్నాయి. 17న షబ్‌-ఏ-ఖదర్‌ పేరుతో సర్కారు ఐచ్ఛిక సెలవును ఇప్పటికే ప్రకటించింది. సెలవులు, ఐచ్ఛిక సెలవు రోజుల్లో నడిపితేనే మొత్తం 15 రోజులు సమావేశాలు జరుగుతాయి. అయితే పండుగల రోజుల్లో సభలు జరగడం సాధ్యం కాకపోవచ్చు. ఒకవేళ ప్రభుత్వం భావిస్తే ఆదివారాల్లో సమావేశాలు కొనసాగించే అవకాశం ఉంది. బడ్జెట్‌ను ఎలాగూ 20న సమర్పిస్తారు కాబట్టి 21న రంజాన్‌తో పండుగ సెలవును బడ్జెట్‌ అధ్యయనం కోసం వాడుకోవచ్చు. మరుసటి రోజు 22 ఆదివారం కానుంది. ఆరోజు సెలవుగా పరిగణిస్తారా? లేక సభలను కొనసాగిస్తారా ? అనేది అసెంబ్లీ బీఏసీలో నిర్ణయించనున్నారు. ఒకవేళ సభను నిర్వహించాలని భావిస్తే 10 రోజులు నడిచే అవకాశం ఉంది. లేకపోతే ఆరోజును సెలవుగా పరిగణిస్తే సమావేశాలు తొమ్మిది రోజులే జరగనున్నాయి. ఈ మేరకు సెలవులు అసెంబ్లీ సమావేశాలను ప్రభావితం చేయనున్నాయి.
జిష్ణు దేవ్‌ వర్మనా..శివప్రతాప్‌ శుక్లానా !
ప్రస్తుత గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మను కేంద్ర ప్రభుత్వం మహారాష్ట్రకు బదిలీ చేసింది. ఆయన స్థానంలో గవర్నర్‌గా శివప్రతాప్‌ శుక్లా నియమితులయారు. జిష్టుదేవ్‌ వర్మ ఈలోపు రిలీవ్‌ అయితే శివప్రతాప్‌ శుక్లాకు ఉభయసభలను ఉద్దేశించి మాట్లాడే అవకాశాలు ఉంటాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -