Wednesday, August 27, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయం30న అసెంబ్లీ..అదే రోజు క్యాబినెట్‌ భేటీ

30న అసెంబ్లీ..అదే రోజు క్యాబినెట్‌ భేటీ

- Advertisement -

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఈనెల 30న ప్రారంభం కానున్నాయి. ఉదయం 10.30 గంటలకు శాసనసభ, మండలి కొలువుదీరనున్నాయి. అదే రోజు మధ్యాహ్నం ఒంటిగంటకు అసెంబ్లీ కమిటీ హాల్‌లో రాష్ట్ర మంత్రివర్గం భేటీ కానుంది. తొలుత ఈనెల 29న క్యాబినెట్‌ మీటింగ్‌ను నిర్వహించాలని నిర్ణయించినప్పటికీ ఆ తర్వాత ఆ భేటీని ఈనెల 30కి మార్చారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లే ప్రధాన అజెండాగా క్యాబినెట్‌ భేటీ జరగనుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. బీసీ రిజర్వేషన్లపై అధ్యయనం కోసం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం శనివారమే క్యాబినెట్‌కు తన నివేదికను అందజేయనుంది. దానిపై మంత్రివర్గం చర్చిస్తుంది. శాసనసభా సమావేశాల్లో కాళేశ్వరం కమిషన్‌ రిపోర్టును ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్‌ ఎదురుదాడి చేసే అవకాశముందనీ, దాన్ని ధీటుగా ఎదుర్కోవాలని సీఎం రేవంత్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు ఇప్పటికే సంకేతాలిచ్చారు. మరోవైపు అసెంబ్లీ వర్షాకాల సమావేశాలకు సంబంధించి గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ మంగళవారం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేశారు. 30న ఉదయం 10.30 గంటలకు శాసనసభ, మండలి ప్రారంభవ ువుతాయి. అసెంబ్లీలో జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ మరణానికి సంతాపం ప్రకటించనున్నారు. ఆ తర్వాత సభలోని ఎమ్మెల్యేలందరికీ కాళేశ్వరం కమిషన్‌ నివేదిక కాపీలను అందజేస్తారని తెలిసింది. అనంతరం బీఏసీని సమావేశపరిచి, అసెంబ్లీని ఎన్ని రోజులపాటు నిర్వహించాలనేది నిర్ణయిస్తారు. శాసనమండలి సైతం ఉదయం 10.30 గంటలకు ప్రారంభం కానుంది. అక్కడ ఎమ్మెల్సీలకు కూడా కాళేశ్వరం కమిషన్‌ కాపీలను అందజేస్తారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రధానంగా కాళేశ్వరం కమిషన్‌ ఇచ్చిన నివేదికపైనే చర్చించనున్నారు. అందుకోసమే అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపరుస్తున్నట్టు కాంగ్రెస్‌ వర్గాలు తెలిపాయి. కాళేశ్వరం కమిషన్‌ మొత్తం 115 మందిని విచారించింది. అందులో మాజీ సీఎం కేసీఆర్‌, భారీ నీటిపారుదల శాఖ మాజీ మంత్రి హరీష్‌ రావు, మాజీ ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తదితరులు ఉన్న సంగతి విదితమే. వారి నుంచి వివరణ తీసుకున్న కమిషన్‌ పూర్తి వివరాలను తన నివేదికలో పొందుపర్చి 660 పేజీల రిపోర్టును ప్రభుత్వానికి అందజేసింది. శాసనసభా సమావేశాల నేపథ్యంలో అటు గులాబీ పార్టీ కూడా అలర్ట్‌ అయ్యింది. ఎర్రవెల్లిలో బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌తో మాజీ మంత్రులు కేటీఆర్‌, హరీష్‌రావు మంగళవారం భేటీ అయ్యారు. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై ఆయనతో సుదీర్ఘంగా చర్చించారు. కాళేశ్వరం నివేదికపై చర్చించేందుకే ప్రభుత్వం సమావేశాలు నిర్వహిస్తుండటంతో అధికార పక్షాన్ని ఎలా ఎదుర్కొందాం? నివేదికలోని అంశాలపై ఎలా స్పందిద్దాం? అనే అంశాలపై వారు సమాలోచనలు చేశారు. కాళేశ్వరంతో సాధించిన ఫలాలు, భూగర్భజలాల పెంపు, పెరిగిన సాగు విస్తీర్ణం తదితరాంశాలను సైతం అసెంబ్లీ వేదికగా వివరించాలని హరీష్‌రావుకు కేసీఆర్‌ దిశానిర్దేశం చేసినట్టు సమాచారం. బీఆర్‌ఎస్‌ నేతలు ఇప్పటికే పలు సందర్భాల్లో కాళేశ్వరంపై పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇచ్చారు. తద్వారా తమ పార్టీ నేతలకు అవగాహన కల్పించారు. అయితే కాళేశ్వరం రిపోర్టును రద్దు చేయాలనీ, దానిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని మాజీ సీఎం కేసీఆర్‌, అప్పటి భారీ నీటిపారుదలశాఖ మంత్రి టీ హరీశ్‌రావు కోర్టులో పిటీషన్‌ వేసిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన కోర్టు ఆ పిటీషన్‌ను కొట్టేసింది. ఈ క్రమంలో రాబోయే అసెంబ్లీ సమావేశాలు హాట్‌హాట్‌గా కొనసాగనున్నాయి. మరోవైపు మాజీ సీఎం కేసీఆర్‌ ఈసారైనా అసెంబ్లీకి వస్తారా? లేదా? అనే చర్చ కొనసాగుతోంది. ఒకవేళ ఆయన హాజరు కాకపోతే అధికార పక్షం ధాటిని కేటీఆర్‌, హరీశ్‌రావు ఎదుర్కొని, తిప్పికొట్టాల్సి ఉంటుంది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad